పవర్​ లిఫ్టింగ్​లో పతకాలు..ఆర్టీసీ డ్రైవర్​కు ప్రోత్సాహం కరవు

author img

By

Published : Jan 3, 2023, 9:05 PM IST

RTC DRIVER

KAKINADA DEPO RTC DRIVER: ఆయనొక ఆర్టీసీ డ్రైవర్. విధినిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్న ఆయన.. క్రీడల్లోనూ విశేషంగా రాణిస్తూ భళా అనిపిస్తున్నారు. స్వయం కృషితో సాధన చేసి పవర్ లిఫ్టింగ్ సహా అథ్లెటిక్స్‌లోనూ సత్తా చూపుతున్నారు. ఏమాత్రం సహకారం అందకపోయినా పట్టుదలతో దేశానికి, రాష్ట్రానికి ఎన్నో పతకాలు తీసుకొచ్చారు. ఎలాంటి గురువూ లేకున్నా.. ఒలింపిక్ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కనీసం తనకు పదోన్నతి కల్పించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ఆర్టీసీ నుంచి స్పందన లేదు.

ఓ వైపు ఆర్టీసీ డ్రైవర్​గా బాధ్యతలు.. మరోవైపు పవర్​ లిఫ్టింగ్​లో పతకాలు.. అయినా ప్రోత్సాహం కరవు

RTC DRIVER TALENT : బరువులు ఎత్తుతూ కఠోర సాధన చేస్తున్న మందపల్లి శ్రీనివాసరావు.. కాకినాడలోని జగన్నాథపురం ఘాటీ సెంటర్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం కాకినాడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పేద కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రీనివాసరావు.. ఏదో ఒక ఘనత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

2000 సంవత్సరంలో విజయవాడ విద్యాధరపురం డిపోలో విధుల్లో చేరిన ఆయన.. తాను పనిచేసే సంస్థకు, రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తేవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. తన శరీరం బలంగా, సౌష్టవంగా ఉండటంతో తొలుత బాడీ బిల్డింగ్‌పై దృష్టి పెట్టారు. దిగ్గజ ఆటగాళ్ల స్ఫూర్తితో 2004లోనే సాధన ప్రారంభించారు. డ్రైవర్‌గా విధుల్లో పాల్గొంటూనే సాయంత్రం వేళల్లో, సెలవు రోజుల్లో కఠోర సాధన చేసేవారు. కోచ్‌లు లేకపోయినా.. యూట్యూబ్ వీడియోలు చూసి సాధన చేసేవారు.

"2000వ సంవత్సరంలో జాబ్​ వచ్చింది. 2004 నుంచి క్రీడలు మొదలుపెట్టా. జిల్లా, రాష్ట్రం, దేశానికి పేరు తేవాలని నా కోరిక. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. నా మైండ్​లో ఎలాగైనా పథకాలు తేవాలనే ఒకటే ఉండేది. అప్పుడే కచ్చితంగా గెలవాలని నిర్ణయించుకున్నా. బాడీ బిల్డింగ్, పవర్​ లిఫ్టింగ్​లో కోచ్​లు ఎవరూ లేరు. కేవలం యూట్యూబ్​లో చూసి నేర్చుకున్నా"-మందపల్లి శ్రీనివాసరావు, ఏపీఎస్​ఆర్టీసీ డ్రైవర్​, కాకినాడ డిపో

బాడీ బిల్డింగ్, పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో MS రావు విజయాలు సాధించి పతకాలు తెచ్చారు. గతేడాది సెప్టెంబర్‌లో ఇండోర్‌లో జరిగిన 7వ జాతీయ క్రీడల పవర్‌ లిఫ్టింగ్ మాస్టర్-1 విభాగంలో 405 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించారు. హామర్‌త్రో, డిస్కస్ త్రో, షాట్ ఫుట్ విభాగాల్లోనూ బంగారు, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. నవంబర్‌లో నేపాల్‌లో జరిగిన SBKF 7వ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొన్న MS రావు.. పవర్ లిఫ్టింగ్ 105 కేజీల విభాగంలో ఏకంగా 450 కేజీలు ఎత్తి దేశానికి స్వర్ణ పతకం అందించారు.

"నేను వచ్చే నెలలో వైజాగ్​లో జాతీయ పోటీలు, ఆ తర్వాత అంతర్జాతీయ పోటీలకు దుబాయ్​ వెళ్తాను. నేను కచ్చితంగా పథకం సాధిస్తా. రాష్ట్రానికి, సంస్థకు పేరు తీసుకురావాలని కోరిక ఉంది. అది కచ్చితంగా నెరవేరుస్తా"-మందపల్లి శ్రీనివాసరావు, ఏపీఎస్​ఆర్టీసీ డ్రైవర్​, కాకినాడ డిపో

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 44 పతకాలు సాధించినా.. ప్రభుత్వం గానీ, ఆర్టీసీ గానీ శ్రీనివాసరావుకు ఎలాంటి సాయమూ చేయలేదు. బాడీ బిల్డింగ్, పవర్‌ లిఫ్టింగ్‌ సాధనకు, శిక్షణకు, పౌష్టికాహారానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. పోటీలకు వెళ్లాలన్నా విధులకు సెలవు పెట్టి వెళ్లాల్సిందే. దీంతో నాలుగేళ్ల వేతనం కోత పడింది. తనకు సాయం చేయాలని ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేదు.

క్లిష్ట సమయాల్లో పలువురు దాతలు సాయం అందించి తనను ప్రోత్సహించారని శ్రీనివాసరావు చెబుతున్నారు. తనకు పదోన్నతి కల్పించి ఆర్ధిక సాయం చేయాలని మరోసారి అర్జీ పెట్టుకోగా.. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు విజయవాడలోని తన కార్యాలయానికి పిలిపించి సన్మానించారు. సాధన సహా పోటీల్లో పాల్గొనే రోజులను ఆన్‌డ్యూటీగా పరిగణిస్తామని చెప్పారు. పదోన్నతి, ఆర్ధిక సాయంపై ఎలాంటి హామీ లేకపోవడంతో శ్రీనివాసరావు నిరుత్సాహంతో వెనుదిరిగారు.

"పార్టిసిపేట్​ చేసిన ఈవెంట్లు.. అలాగే వాటి కోసం ప్రిపేర్​ అయిన సమయాన్ని ఆన్ ​డ్యూటీ కింద పరిగణలోకి తీసుకుంటాం. ఉద్యోగంతో పాటు ఈవెంట్లలో పాల్గొని సంస్థకు పేరు తీసుకొచ్చినందుకు గర్వకారణంగా ఉంది. శ్రీనివాసరావుకు సంస్థ తరఫున ఎటువంటి సాయం కావాలన్నాఅందిస్తాం"- ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ ఎండీ

దేశవిదేశాల్లో సత్తాచాటుతూ పతకాలు తెస్తున్న శ్రీనివాసరావు.. ఒలింపిక్‌ పతకమే లక్ష్యమంటున్నారు. తనను క్రీడాకారుడిగా గుర్తించి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వానికి, ఆర్టీసీకి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.