ఎస్సీ, ఎస్టీలకు దగా.. ఏళ్లుగా సాగుతున్న పథకాలకు పాతర

author img

By

Published : Dec 18, 2022, 7:25 AM IST

sc st schemes

Govt cheating SCs and STs: ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై లక్ష కోట్లకుపైగా ఖర్చు చూపిస్తున్న జగన్‌ సర్కార్‌.. అందరికీ ఇస్తున్న నవరత్న పథకాలే అమలు చేస్తూ.. వారిని దగా చేస్తోంది. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అమలవుతున్న పథకాలకు.. జగన్‌ సీఎం అయ్యాక పాతరేశారు. ఈ అన్యాయంపై పలు ఎస్సీ, ఎస్టీ సంఘాలు.. దళిత్‌ గిరిజన ఐకాసగా ఏర్పడి గళమెత్తుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా విజయవాడ కేంద్రంగా నేడు రాష్ట్ర స్థాయి ఐకాస సదస్సు నిర్వహిస్తోంది.

ఎస్సీ, ఎస్టీలకు దగా

Govt cheating SCs and STs: ఎస్సీ, ఎస్టీ, బీసీలను అన్నివిధాలా ఆదుకుంటున్నామని ప్రతి సభలోనూ చెప్పే సీఎం జగన్.. తన హయాంలో... గతంలో ఎస్సీ, ఎస్టీల కోసం అమలైన పథకాలనెన్నో కోత వేశారు. అందులో ఒకటి భూ కొనుగోలు పథకం. గత ప్రభుత్వాలు.. నిరుపేద ఎస్సీల కోసం కేంద్రం సహకారంతో భూమి కొనుగోలు పథకాన్ని అమలుచేశాయి. 1988-2019 మధ్య 23,802 మంది ఎస్సీ మహిళలకు సుమారు 24వేల ఎకరాలు అందించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మూడు దశాబ్దాలుగా వేల మందికి అండగా నిలిచిన ఈ పథకాన్ని వైకాపా ప్రభుత్వం నిలిపేసింది. 2019 బడ్జెట్‌లో 35 కోట్లు కేటాయించినా ఒక్క ఎకరమూ కొనివ్వలేదని కార్పొరేషన్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక కింద కేటాయించే నిధులను... కాలనీలు, తండాల్లో రహదారులు, తాగునీరు, అంతర్గత మురుగుకాల్వలు వంటి అభివృద్ధి పనులు చేపట్టాలి. వైకాపా ప్రభుత్వం వీటన్నింటికీ భిన్నంగా ఉపప్రణాళిక నిధులనూ నవరత్నాల్లో భాగం చేసింది. అందరికీ ఇచ్చే ఉపకారవేతనాలు, పింఛన్లనూ ఉపప్రణాళిక నిధులుగా చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థలు ఎస్సీ, ఎస్టీలకు అందించే రుణాలకూ రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డింది. కేంద్రం నిధులకు తన వాటా కలపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ రాయితీ ఇవ్వకుండా ఏకంగా పథకాలనే నిలిపేసింది. 2015-19 మధ్య రాష్ట్రంలో దాదాపు 23 వేల ఎస్సీ, ఎస్టీలకు 515 కోట్లకుపైగా సాయం అందింది. 2020-21లో NSTFDC టర్ము రుణాల కింద రూ.6.54 కోట్లు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వ రాయితీ అందక యూనిట్ల ఏర్పాటుకు గిరిజనులు ముందుకురాలేదు.

ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్యనందించేందుకు 1995లో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకాన్ని తీసుకొచ్చారు. 2 నుంచి 10వ తరగతి పిల్లలను ప్రభుత్వమే కార్పొరేట్‌ పాఠశాలల్లో చేర్పించేంది. 2014-19 మధ్య 1.40 లక్షల మందికిపైగా పిల్లలు లబ్ధిపొందారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక 2నుంచి 8వ తరగతుల వారికి పథకాన్ని రద్దుచేసి 9, 10 తరగతులకే పరిమితం చేశారు. 48 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అస్తవ్యస్తంగా మారింది. ఎస్సీ, ఎస్టీ సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాలతో ప్రస్తుతం ఆయా తరగతులకే పథకాన్ని కొనసాగిస్తున్నారు. కొత్తగా ఒక్క విద్యార్థికీ సాయం అందించలేదు. రెండేళ్లుగా బకాయిలు చెల్లించడం లేదని కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు ఉద్దేశించిన విదేశీ విద్య పథకాన్ని మూడేళ్లపాటు దూరం చేసిన వైకాపా సర్కారు.. వివిధ సంఘాల ఒత్తిడితో తిరిగి అమల్లోకి తెచ్చినా నిబంధనల కొర్రీ వేసింది. పథకం పేరును అంబేడ్కర్‌ను కాదని జగనన్నకు మార్చింది. 200 క్యూఎస్‌ ర్యాంకింగ్‌ ఉన్న వర్శిటీల్లో సీట్లు సంపాదిస్తేనే సాయమంటూ షరతు పెట్టింది.

కులాంతర వివాహాలు చేసుకున్న వారికి కేంద్రం 2.50 లక్షల ఆర్థిక సాయం పథకాన్ని ఏళ్లుగా అమలుచేస్తోంది. కేంద్రం మూడేళ్లుగా కులాంతర వివాహాలకుగానూ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇచ్చిందని, ఆ మొత్తాన్ని ఇతర పథకాలకు మళ్లించారని ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతంలో పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు భరోసాగా నిలిచిన స్టడీ సర్కిళ్లను వైకాపా ప్రభుత్వం నామమాత్రంగా మార్చింది. తిరుపతి స్టడీ సర్కిల్‌ను బ్యాంకు కోచింగ్‌కు, విశాఖలోని కేంద్రాన్ని సివిల్స్‌కు, విజయవాడ కేంద్రాన్ని గ్రూప్‌ పరీక్షలకు పరిమితం చేసింది. విజయవాడలోని శిక్షణ కేంద్రంలో భవన మరమ్మతుల పేరిట రెండేళ్లు కార్యకలాపాలు నిలిపేసింది. గతంలో ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకం ద్వారా పేద విద్యార్థులకు రూ.1.20 లక్షల చొప్పున అందించి ప్రఖ్యాత సంస్థల్లో ఉచితంగా సివిల్స్‌ శిక్షణ అందించారు. 9 నెలలపాటు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.12 వేలు భృతి అందేది. వైకాపా సర్కారు వీటినీ ఎత్తివేసింది.

పేదల ఆర్థికాభివృద్ధికి కీలకమైన స్వయం ఉపాధి రుణాలను రద్దుచేసిన జగన్ ప్రభుత్వం.. ఆయా వర్గాల వెన్నువిరిచింది. ఈ రుణాల ద్వారా గతంలో ఏటా వేలమంది లబ్ధి పొందారు. వైకాపా ప్రభుత్వం 2019లో దరఖాస్తులు ఆహ్వానిస్తే 3.15 లక్షల మంది ముందుకు వచ్చారు. వీరికి ఒక్క పైసా రాయితీ రుణం ఇవ్వని ప్రభుత్వం... అసలు స్వయం ఉపాధి రుణాల మంజూరు ప్రక్రియనే పక్కనపెట్టింది. పైగా 2016-17, 2017-18 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం ఎస్సీలకు విడుదల చేసిన రాయితీ నిధుల్లో రూ.200 కోట్లు బ్యాంకుల వద్దే ఉన్నట్లు గుర్తించి, వెనక్కి తీసుకుంటోంది. ఎస్సీ కార్పొరేషన్‌ను మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లుగా విభజించగా, అవి వైకాపా నేతలకు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. వైకాపా సర్కారు ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక వైఖరిని తప్పుబడుతున్న దళిత్‌ గిరిజన ఐకాస .. గతంలో అమలైన పథకాలన్నీ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.