ప్రజల ఉసురు తీస్తున్న విద్యుత్​ ప్రమాదాలు.. దీనికి బాధ్యత ఎవరిది?

author img

By

Published : Nov 25, 2022, 1:54 PM IST

Electrical hazards

Electrical Hazards: ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్‌ ప్రమాదాలు ఒకరో, ఇద్దరో, ఏ కొద్దిమందికో సంబంధించిన విషయం కాదు. కొంతకాలంగా ఈ వరసవిషాదాలు అభాగ్యుల పాలిట పెనుశాపంగా మారాయి. పంపిణీ వ్యవస్థలో లోపాలు ప్రజల ఉసురు తీస్తున్నాయి. కేవలం రెండేళ్ల వ్యవధిలో 675 మంది ప్రాణాలు కోల్పోవడమే ఇందుకు నిదర్శనం. దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే అత్యధిక సంఖ్య. ఇన్ని ప్రాణాలు గాల్లో కలుస్తున్నా, ఈ మరణాలపై కేంద్రం నివేదికల రూపంలో స్పష్టత ఇస్తున్నా.. అధికారులు కనీసం స్పందించడం లేదు. ప్రమాద కారణాలను గుర్తించాలన్న కనీస బాధ్యత కూడా మరిచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ డిస్కంలు చేస్తున్న వేలకోట్ల రూపాయల ఖర్చు నీళ్ల పాలే అవుతున్నాయి.

ప్రజల ఉసురు తీస్తున్న విద్యుత్​ ప్రమాదాలు

Electrical Hazards In AP : వెలుగులు పంచాల్సిన విద్యుత్‌.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఉసురు తీస్తోంది. తరచూ ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూ వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. స్వయంగా కేంద్ర విద్యుత్‌ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ లోక్‌సభ సాక్షిగా వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఆయన చెప్పిన వివరాల ప్రకారమే 2019-20, 2020-21 రెండేళ్లలోనే విద్యుత్‌ ప్రమాదాల వల్ల ఏకంగా 675 మంది ప్రాణాలు కోల్పోయారు. 143 మంది గాయపడగా, 681 పశువులు ప్రాణాలు కోల్పోయాయి .

ఇదే వ్యవధిలో తెలంగాణలో 75మంది చనిపోయారు. దక్షిణాదిరాష్ట్రాల్లో గత రెండేళ్ల గణాంకాలు పరిశీలిస్తే విద్యుత్‌ ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువమంది చనిపోయారు. విద్యుత్‌ ప్రమాదాల నియంత్రణ, నష్టాలు తగ్గించుకునే పేరిట ఆంధ్రప్రదేశ్‌ డిస్కంలు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.

ప్రజల ప్రాణాలు పోతున్న అధికారుల్లో మాత్రం నో చలనం: విద్యుత్‌ ప్రమాదాల్లో ఏటా వందిలాది ప్రాణాలు గాల్లో కలుస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం ఉండడం లేదు. ప్రమాదాల తీరుపై కేంద్రం నివేదిక స్పష్టత ఇస్తున్నా... వారు కనీసం స్పందించడం లేదు. ఈ నిర్లక్ష్యం ప్రతిరోజు ఏదొక చోట ప్రమాదానికి కారణం అవుతోంది. ప్రమాదాలు సాంకేతికలోపాల వల్ల జరగడం లేదని, ప్రజల నిర్లక్ష్యమే దీనికి కారణమ అధికారులు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా చాపాడు మండలం చియ్యపాడులో ఇటీవల ముగ్గురు రైతులు విద్యుతాఘాతంతో అక్కడికక్కడే చనిపోయారు. మోటారుకు విద్యుత్‌ సరఫరా చేసే తీగలు తెగిపడ్డాయని, అవి కాలికి తగలడమే ప్రమాదానికి కారణం అని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

సరైన మరమ్మత్తులో చేసే వ్యవస్థ లేదు: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ప్రమాదాలపై అధికారులది నిలువెల్లా నిర్లక్ష్యమే. విద్యుత్‌ తీగలు తెగిపడినా అధికారులకు అంతగా పట్టింపు ఉండదు. ఇళ్లు, పొలాల్లో చేతికి అందేంత ఎత్తులో విద్యుత్‌ తీగలు వేలాడుతున్నా.. మరమ్మత్తులు చేసే వ్యవస్థ లేదు. ప్రజల భద్రతకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నట్లు విద్యుత్‌ సంస్థలు ప్రకటిస్తున్నా ప్రజల ప్రాణాలు పోవడం ఆగడం లేదు.

సరిపడా లేని సిబ్బంది: విద్యుత్‌ లైన్ల నిర్వహణలో లోపం, మరమ్మతులపై వెంటనే స్పందించడానికి సరిపడా సిబ్బంది లేకపోవడమే దీనికి కారణం అని నిపుణులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ లైన్ల పొడవు 6లక్షల 26వేల 389 కిలోమీటర్లు కాగా, సబ్‌ స్టేషన్‌ల సంఖ్య 3వేల 221. ట్రాన్స్‌ఫార్మర్ల సంఖ్య 10లక్షల 73వేల 50. అయితే వీటన్నింటి నిర్వహణకు తగినంత సిబ్బంది అందుబాటులో లేరు.

విద్యుత్‌ చట్టాల ప్రకారం వెయ్యి సర్వీసులకు 1.86 మంది వంతున సిబ్బంది ఉండాలి. కాని ఆంధ్రప్రదేశ్‌లో 0.80 మంది సిబ్బందితోనే బండి లాగుకు వస్తున్నాయి. అవసరమైన వారిలో కేవలం 43%మంది సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇంత తక్కువ సిబ్బంది ఉంటే ఫిర్యాదులనే వేగంగా పరిష్కరించడానికి వీలు కావడం లేదని, పని ఒత్తిడి చాలా ఉందని ఏపీ విద్యుత్‌ సంఘాలు అంటున్నాయి.

ప్రమాదాలకు అనేక కారణాలు: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ప్రమాదాలకు కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఒకే ప్రాంతంలో వేర్వేరు ఫీడర్ల నుంచి వచ్చే విద్యుత్‌ లైన్లు ఒకే స్తంభంపై ఉంటున్నా యి. ఇలాంటి చోట్ల మరమ్మతుల నిర్వహణకు ఒక ఫీడర్‌ నుంచి వచ్చే లైన్‌లో సరఫరా నిలిపి వేసినా, రెండో లైన్‌లో ప్రసారమయ్యే విద్యుత్‌ కారణంగా ప్రమాదాలకు ఆస్కారం ఉంది. దీనికి పరిష్కారం ఒక ప్రాంతంలో ఉండే కనెక్షన్లను మొత్తం ఒకే ఫీడర్‌ పరిధిలోకి తీసుకురావడం.

1990లో తయారు చేసిన విద్యుత్‌ నియమాల ప్రకారం 650 సర్వీసులకు ఒక లైన్‌మెన్‌ ఉండాలి. ఆ పరిధిలోని లైన్లు, మరమ్మతులపై స్పందించేలా అప్పట్లో సిబ్బంది సంఖ్యను నిర్ణయించారు. అయితే 3దశాబ్దాలు గడిచినా, కనెక్షన్ల సంఖ్య భారీగా పెరిగినా, దానికి అనుగుణంగా సిబ్బంది సంఖ్యను పెంచలేదు, ఖాళీలను భర్తీ చేయలేదు.

తీగలకు కొక్కెం తగిలించి విద్యుత్​ సరఫరా: ఆంధ్రప్రదేశ్‌లోని 3 డిస్కంల పరిధిలో గృహ, వాణిజ్య సర్వీసులు ఒక కోటి 56లక్షలు. వాటి పర్యవేక్షణకు 24వేల మంది సిబ్బంది అవసరం. ప్రస్తుతం 12వేల మందికి మించి సిబ్బంది అందుబాటులో లేరు. విద్యుత్‌ ప్రమాదాలకు మరో కారణం లైన్‌ క్లియరెన్స్‌ తీసుకున్నా.. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి సరఫరా పునరుద్ధరించడం. ఇక వ్యవసాయ విద్యుత్ మోటార్ల కోసం సర్వీసు వైరు ద్వారా కాకుండా తీగలకు కొక్కెం తగిలించి సరఫరా చేస్తున్నారు. ఇదే ప్రమాదాలకు కారణం అవుతోందని అధికారులు చెబుతున్నారు. వీటిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.