ఈ నెల 27న మంగళగిరికి పవన్​.. ఇప్పటం బాధితులకు పరిహారం

author img

By

Published : Nov 22, 2022, 5:49 PM IST

PAWAN IPPATAM TOUR

PAWAN IPPATAM TOUR : ఇప్పటం కూల్చివేతల్లో నష్టపోయిన వారికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పరిహారం అందించనున్నారు. 27న మంగళగిరి రానున్న జనసేనాని.. తాను ప్రకటించిన లక్ష రూపాయల పరిహారాన్ని ఇవ్వనున్నారు. ఈ నేప‌థ్యంలో వైకాపాకు చెందిన పలువురు కార్యకర్తలు తమకు పరిహారం వద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పరిహారం తీసుకునేందుకు ఎంతమంది అంగీకరిస్తారన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

JANASENA PAWAN MANGALAGIRI TOUR : జనసేన అధినేత పవన్​కల్యాణ్​ ఈనెల 27న మంగళగిరిలో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి పార్టీ తరపున పరిహారం అందించనున్నారు. ఈనెల 4వ తేదీన ఇప్పటం గ్రామంలో అధికారులు రహదారి విస్తరణ పేరిట ఇళ్లు, ఇతర నిర్మాణాలను తొలగించిన సంగతి తెలిసిందే. అప్పట్లో దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పవన్ కల్యాణ్ స్వయంగా ఇప్పటం గ్రామానికి వచ్చి బాధితులను పరామర్శించి.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందునే ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేశారని పవన్ ఆరోపించారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. ఆ పరిహారాన్ని అందించేందుకు పవన్ కల్యాణ్ ఈ నెల 27న రానున్నారు. అయితే ఈ పరిహారాన్ని పవనే స్వయంగా ఇప్పటం వెళ్లి అందించే అవకాశముందని.. వీలుకాని పక్షంలో బాధితులను మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పిలిపించి అందించనున్నట్లు సమాచారం.

పవన్ పరిహారం ప్రకటించిన తర్వాత తమకు అవేమీ వద్దని వైసీపీకి చెందిన కొందరు ఫ్లెక్సీలు కట్టారు. దీంతో పరిహారం ఎందరికి ఇవ్వాలనే విషయంలో స్పష్టత రాలేదు. బాధితుల నుంచి వివరాలు సేకరించి ఎవరైతే పరిహారం తీసుకునేందుకు అంగీకరిస్తారో వారికి ఇవ్వాలని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతమందికి అందించేది రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.