విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు - ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయండి: నారా లోకేశ్

విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు - ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయండి: నారా లోకేశ్
Nara Lokesh Letter to CM Jagan on Fee Reimbursement for Students: డిగ్రీ, పీజీ విద్యార్థుల ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ.. నారా లోకేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. లక్షలాది మంది విద్యార్థుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని.. తక్షణమే ఫీజు బకాయిలు విడుదల చేయాలని.. లోకేశ్ డిమాండ్ చేశారు.
Nara Lokesh Letter to CM Jagan on Fee Reimbursement for Students: డిగ్రీ, పీజీ విద్యార్థుల ఫీజు బకాయిలు రూ. 1650 కోట్లు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్‌కు బహిరంగ లేఖ(Nara Lokesh letter to Jagan) రాశారు. విద్యా సంవత్సరం మొదలై నెలలు గడుస్తున్నా విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని అన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉంచడంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను పరీక్షలు రాయనీయడం లేదని విమర్శించారు. చదువు పూర్తయిన విద్యార్థులకు మార్కుల లిస్టులు, ఇతర సర్టిఫికెట్లు జారీని నిలిపేశాయని ఆరోపించారు.
పైచదువులకు, ఉద్యోగ పరీక్షలకు, ఇంటర్వ్యూలకి హాజరయ్యే విద్యార్థులు సర్టిఫికెట్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డిగ్రీ మధ్యలో ఉన్న విద్యార్థులు పరీక్షలకు దూరం అవుతున్నారని ఆక్షేపించారు. లక్షలాది మంది విద్యార్థుల ఆందోళనలు దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఫీజులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2020-21 బకాయిలు రూ. 600 కోట్లను చెల్లించేది లేదని తేల్చేసిన వైసీపీ సర్కారు, 2022 - 23లో నాలుగో టర్మ్ ఫీజులు రూ. 600 కోట్లు చెల్లించాల్సి ఉందని ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా పీజీ కోర్సుల బకాయిలు రూ. 450 కోట్లు పెండింగ్‌లో ఉందని మండిపడ్డారు.
-
ఫీజులు బకాయిలు పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు అంటూ జగన్ కి లేఖ రాసాను. విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.1650 కోట్లు తక్షణమే విడుదల చేయాలి. కాలేజీలు పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థుల్ని ఇబ్బందులకి గురిచేస్తున్నాయి.విద్యాసంవత్సరం పూర్తిచేసుకున్నవారికి స… pic.twitter.com/gA17inTLyD
— Lokesh Nara (@naralokesh) November 16, 2023
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పీజీ కోర్సులకి ఫీజులు చెల్లించగా.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని నిలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ (student fees Reimbursement) అమలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న ఈ ప్రభుత్వం.. నాలుగున్నరేళ్లలో ఒక్క ఏడాదీ సకాలంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదని దుయ్యబట్టారు. ఫీజులు చెల్లించాలంటూ కాలేజీల నుంచి తీవ్రమైన ఒత్తిడితో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారన్నారు. ఫీజులు కట్టలేదని కొన్ని కాలేజీలు పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని విమర్శించారు.
కేంద్రం ఎస్సీ, ఎస్టీల విద్యార్థులకు ఇస్తున్న 60 శాతం ఫీజు ఏ లెక్కలోనా చూపకుండా వైసీపీనే విద్యాదీవెన ఇస్తున్నట్టు చేస్తున్న ప్రచారం ప్రజల్ని మోసగించడమేనని ధ్వజమెత్తారు. కొత్తగా విద్యా దీవెన డబ్బులను విద్యార్ధి, వాళ్ల తల్లి జాయింట్ అకౌంట్లో వేస్తామంటూ మెలిక పెట్టడం విద్యార్థుల్ని మరింత ఇబ్బందులు గురిచేసే ప్రహసనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాదీవెన, వసతి దీవెన అంటూ పేర్లు పెట్టి, విపరీతంగా ప్రచారం చేసుకోవడం తప్పించి.. జరిగిన మేలు శూన్యమని మండిపడ్డారు. మొండివైఖరి, ప్రచార ఆర్భాటాలు మాని ఫీజు రీయింబర్స్మెంట్ పాత బకాయిలు, ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
Lokesh on AP Police System: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసు వ్యవస్థ జగన్ ప్రైవేటు సైన్యంలా మారిందని లోకేశ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలుపుతుంటే పోలీసులు అమాయకులను కొట్టడం దారుణమన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏపై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి చేసి తలపగలకొట్టడం దారుణమని అన్నారు. చంద్రశేఖర్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేశ్ తెలిపారు. పోలీసులు అరాచకశక్తుల మాయలోపడి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు.. రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
