రోగులకు ఆశాదీపం.. మంగళగిరి ఎయిమ్స్‌...

author img

By

Published : Mar 14, 2023, 7:26 AM IST

Mangalagiri AIIMS

Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌ ఆసుపత్రి వైద్య సేవల్లో ప్రత్యేకత చాటుకుంటోంది. నాలుగేళ్ల నాటితో పోలిస్తే ప్రస్తుతం చికిత్సలతో పాటు రోగుల సంఖ్య భారీగా పెరిగింది. 44మంది రోగులతో తొలిరోజున ఓపీ వైద్య సేవలు మొదలవగా... నేడు ఆసంఖ్య రెండున్నర వేలకు చేరింది. మొత్తం 37 విభాగాల్లో ప్రజలకు వైద్యసేవలు అందిస్తూ తెలుగు ప్రజలకు చేరువైన వైనంపై ప్రత్యేక కథనం.

మంగళగిరి ఎయిమ్స్‌ ఆసుపత్రిలో వైద్య సేవలు

Mangalagiri AIIMS in Guntur: మంగళగిరి ఎయిమ్స్‌ ఆసుపత్రి వైద్య సేవల్లో ప్రత్యేకత చాటుకుంటోంది. నాలుగేళ్ల నాటితో పోల్చితే ప్రస్తుతం చికిత్సలతో పాటు రోగుల సంఖ్య భారీగా పెరిగింది. వచ్చిన వారికి అత్యున్నత వైద్యం అందిస్తూ... వైద్యులు ప్రశంసలు పొందుతున్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల కంటే... ఖర్చుతో పాటు సేవల్లో నాణ్యత బాగుందని రోగులు చెబుతున్నారు. ఆరోగ్య ప్రదాయనిగా మారిందని కితాబిస్తున్నారు.

విభజన చట్టం ప్రకారం ఏర్పాటై 2019 మార్చి 12న ఓపీ సేవలు మొదలుపెట్టిన మంగళగిరి ఎయిమ్స్‌... సేవల్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. మొదటి రోజున 44మంది రోగులు వచ్చిన ఆసుపత్రికి.. ప్రస్తుతం బిజీ రోజుల్లో 2వేల500మంది వరకు సేవలు పొందుతున్నారు. ఈ నాలుగేళ్లలో దాదాపు 10లక్షల మంది ఎయిమ్స్‌లో వైద్య సేవలు పొందారు. 2020 జూన్‌ 11న ఇన్‌ పేషెంట్ సేవలు మొదలవగా... ఇప్పటి వరకూ 7వేల 500మంది చికిత్స తీసుకున్నారు. ఇక్కడ ఓపీ ఫీజు 10 రూపాయలే. వివిధ రకాల ఎక్స్‌రేలు, స్కానింగ్‌లకు బయటి ధరలతో పోలిస్తే 30నుంచి 40శాతం తక్కువ. బ్లండ్‌ బ్యాంకు, సీటీ, ఎమ్ఆర్ఐ, పీఈటీ స్కానింగ్‌, అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లు, కాన్పులు, రేడియో థెరపీ, ట్రామాతో పాటు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆయుస్మాన్‌ భారత్, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేస్తున్నారు. వైద్య కళాశాలలో 125 ఎంబీబీఎస్ సీట్లు, పీజీ విభాగంలో 40 సీట్లు ఉన్నాయి. గతేడాది నర్సింగ్‌ కళాశాల కూడా ప్రారంభమైంది.

సమస్యను సరిగ్గా గుర్తించి, అందాల్సిన వైద్యాన్ని కచ్చితంగా అందిస్తున్నారని.. చికిత్స కోసం వచ్చినవారు చెబుతున్నారు. ఎయిమ్స్‌ లాంటి ఆసుపత్రి ఉండటం రాష్ట్రానికి గొప్ప వరమని మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎయిమ్స్‌ నిర్మాణ పనులు 98 శాతం మేర పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అంతర్గతంగా కొన్ని పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

'సామాన్యులకు అతి తక్కువ ఖర్చుతో అత్యున్నత వైద్య సేవలు అందించే సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. రోగి నుంచి మరో రోగికి, చికిత్స పొందిన వారు ఎంతో బాగుందని చుట్టుపక్కల ఉన్నవారికి, బంధువులకు చెప్పడం ద్వారానే.... సేవల్లో నాలుగేళ్లలో ఈ స్థాయి పురోగతి సాధించాం. భవనాలు కాకుండా ఆసుపత్రిలో మిగిలిన మౌలిక వసతుల కల్పన క్రమంగా జరుగుతోంది. ఆసుపత్రి లోపలి సౌకర్యాల అభివృద్ధికి మరికొంత సమయం పడుతుంది. 960 మందికి వైద్యం అందించే అవకాశం ఉండగా.... ప్రస్తుతం 5వందల మందికి చికిత్స అందిస్తున్నాం.' ముకేష్‌ త్రిపాఠి, ఎయిమ్స్‌ డైరెక్టర్‌

క్యాన్సర్‌, మూత్రపిండాలు, ఉదరకోశ వ్యాధులకు ఎయిమ్స్‌లో మంచి వైద్యం అందుతోంది. గుండె సంబంధింత జబ్బుల విభాగం ఇంకా ఏర్పాటు కాలేదు. త్వరలో ఆ విభాగం ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. అది ఏర్పాటైతే అన్ని ముఖ్యమైన వైద్య విభాగాలు అందుబాటులోకి వచ్చినట్లవుతుందని ఎయిమ్స్‌ అధికారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.