గుంటూరు తొక్కిసలాట ఘటనాస్థలాన్ని పరిశీలించిన విచారణ కమిటీ

author img

By

Published : Jan 19, 2023, 4:03 PM IST

Guntur Stampede

Guntur Stampede : గుంటూరు తొక్కిసలాట ఘటానాస్థలాన్ని విచారణ కమిటీ పరిశీలించింది. రిటైర్డ్​ జడ్జి ఆధ్వర్యంలో విచారణ కమిటీ పనిచేసేలా.. ఈ కమిటీని ప్రభుత్వం గతంలో నియమించింది. రాష్ట్రంలో జరిగిన వరుస తొక్కిసలాట ఘటనల వల్ల.. విచారణ కోసం ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

Stampede Inquiry Committee : గుంటూరు వికాస్​ గ్రౌండ్స్​లో సంక్రాంతి కానుకల పంపిణీలో జరిగిన తొక్కిసలాటపై.. విచారణ కమిటీ ఘటనాస్థలాన్ని పరిశీలించింది. రిటైర్డ్​ జడ్జి నేతృత్వంలో నియమితమైన ఈ కమిటీ.. ఘటన జరిగిన తీరుపై విచారణ చేపట్టింది. రిటైర్డ్‌ జడ్డి జస్టిస్ శేష సాయిరెడ్డితోపాటు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్పీ ఆరీఫ్‌, పోలీస్​ సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ నెల 1వ తేదీన సంక్రాంతి కానుక పేరుతో ఉయ్యూరు ఫౌండేషన్​ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.

సభావేదిక, ఘటన జరిగిన ప్రదేశం, ఆసమయంలో అక్కడి పరిస్థితులపై తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జి శేషశయనారెడ్డి ఆరా తీశారు. ఘటన సమయంలో అక్కడున్న కొందరు బాధితులతో ఆయన మాట్లాడారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన వారిని పిలిచి విచారణ జరిపారు. సభను ఎంత మంది సామర్థ్యంతో నిర్వహించారో అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన తర్వాత బాధితుల కుటుంబ సభ్యులను ఆయన కలిశారు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని వారి వద్ద నుంచి కూడా సేకరించారు. ఘటన జరిగిన సమయం, బాధిత కుటుంబాలకు తెలిసిన సమయం వంటి ఆంశాలను తెలుసుకున్నారు.

ఇదీ జరిగింది : ప్రవాస భారతీయుడు ఉయ్యూరు శ్రీనివాస్‌ నేతృత్వంలోని ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు సదాశివనగర్‌లోని వికాస్‌ హాస్టల్‌ మైదానంలో జనవరి 1వ తేదిన పేదలకు సంక్రాంతి కానుకలు, దుస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమానికి హాజరై కొందరికి కానుకలు అందించారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిన తరువాత నిర్వాహకులు పంపిణీ ప్రారంభించారు. కానుకల కోసం ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది.

ఈ ఘటనలో ఏటీ అగ్రహారానికి చెందిన 52ఏళ్ల గోపిదేశి రమాదేవి చనిపోయారు. గాయపడిన సయ్యద్ ఆసియా, షేక్ జాన్‌బీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మొత్తం 12 లారీల్లో కానుకలు తీసుకువచ్చిన నిర్వాహకులు 24 కౌంటర్ల ద్వారా పంపిణీ మొదలుపెట్టారు. ప్రతి కౌంటర్‌ వద్దకు వెళ్లడానికి ఒకదారి, కానుక తీసుకున్న తర్వాత తిరిగి రావడానికి పక్కనే దారి ఉండేలా బారికేడ్లు ఏర్పాటుచేశారు. అయితే రెండు మార్గాల్లోనూ ఒక్కసారి మహిళలు కానుకలు తీసుకునేందుకు ఎగబడ్డారు.

వేలమంది కౌంటర్ల వద్దకు రావడంతో వాలంటీర్లు, పోలీసులు నియంత్రించలేకపోయారు. తోపులాటకు బారికేడ్లు ఒరిగిపోయి కొందరు వాటికింద పడిపోయారు. అక్కడి నుంచి బయటపడే క్రమంలో మిగతావారు కిందపడినవారిని తొక్కుకుంటూ వెళ్లిపోయారు. పోలీసులు, నిర్వాహకులు కిందపడిన వారిని కష్టం మీద పైకి లేపారు. మహిళలు కాపాడాలని కేకలు వేయడంతో పోలీసులు మరో బారికేడు తొలగించారు. దాంతో అందరూ అటుగా వెళ్లడానికి ప్రయత్నించడంతో అక్కడా తొక్కిసలాట జరిగింది. సుమారు 30 నిమిషాలు గందరగోళం నెలకొంది. జనం రద్దీ ఎక్కువగా ఉండటంతో ఘటనాస్థలానికి అంబులెన్స్‌ రావడానికి కూడా సమయం పట్టింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.