High Court Regarding Anticipatory Bail in the Punganur Incident: పుంగనూరు ఘటనలో ముందస్తు బెయిల్‌పై విచారణ.. 15వతేదీ కి వాయిదా

High Court Regarding Anticipatory Bail in the Punganur Incident: పుంగనూరు ఘటనలో ముందస్తు బెయిల్‌పై విచారణ.. 15వతేదీ కి వాయిదా
High Court Regarding the Anticipatory Bail in the Punganur Incident: పుంగనూరు ఘటనలో టీడీపీ నేతలు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ ఈనెల 15కి వాయిదా వేసింది. ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో సవాలు చేశామని అదనపు ఏజీ కోర్టుకు తెలపడంతో 15న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.
High Court Regarding the Anticipatory Bail in the Punganur Incident: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పుంగనూరు పర్యటన సందర్భంగా అంగళ్లు, భీమగానిపల్లె కూడలి వద్ద చోటు చేసుకున్న ఘటనల్లో... ముదివేడు, పుంగనూరు పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో... ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ ఈనెల 15కి వాయిదా పడింది. ఇదే కేసుకు సంబంధించి కొంతమంది టీడీపీ నేతలకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశామని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి విచారణను ఈనెల 15కి వాయిదా వేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం కోసం కొంత సమయం వేచి చూద్దామన్నారు.
పలువురిపై కేసులు: చంద్రబాబునాయుడు పుంగనూరు పర్యటన సందర్భంగా అంగళ్లు, భీమగానిపల్లె కూడలిలో చోటు చేసుకున్న ఘటనలో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. తమపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్ భాష, డి రమేశ్, తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, రాజంపేట తెదేపా పార్లమెంట్ ఇంఛార్జి గంటా నరహరి, తెదేపా నేతలు ఎం.రాంప్రసాద్‌రెడ్డి, వసునూరి చంద్రశేఖర్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇలాంటి తీవ్ర విషయాల్లో బెయిలు మంజూరు చేస్తే ఘటనలు పునరావృతం అవుతాయని ప్రభుత్వ తరపు అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. యువగళం పాదయాత్ర ఇటీవల మందలపర్రు గ్రామంలో జరుగుతుండగా చర్చిలో పార్థన చేసుకుంటున్న వారికి టీడీపీ కార్యకర్తలు చిటికిన వేలు చూపించారన్నారు. అందుకోసమే వారిపై దాడి చేశారన్నారు.
సుప్రీంకోర్టులో బెయిలు వ్యవహారం: ఇదే అంశంపై న్యాయమూర్తి స్పందిస్తూ గొడవలు సృష్టిస్తుంటే కార్యక్రమానికి అనుమతి నిరాకరించండి అన్నారు. మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు.. అని అదనపు ఏజీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గింజుపల్లి సుబ్బారావు, ఎం.లక్ష్మీనారాయణ అదనపు ఏజీ వాదనలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత కేసుతో సంబంధం లేని విషయాలను అదనపు ఏజీ చెబుతున్నారన్నారు. వైసీపీ కార్యకర్తలే రెచ్చగొట్టేలా వ్యవహరించారన్నారు. యువగళం పాదయాత్రలో అలజడులు సృష్టిస్తున్నారన్నారు. వాదనలతో కోర్టులో పరిస్థితి కొంత వేడెక్కడంతో న్యాయమూర్తి స్పందిస్తూ ఇరువైపు న్యాయవాదులు నియంత్రణ పాటించాలని సూచించారు. బెయిలు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో ప్రస్తుత వ్యాజ్యాల విచారణను ఈనెల 15కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.
