గద్దెనెక్కిన వైసీపీ ఫ్యానేసుకుని కూర్చుంటే - రోడ్లపై గుంతలతో ప్రజల పాట్లు

గద్దెనెక్కిన వైసీపీ ఫ్యానేసుకుని కూర్చుంటే - రోడ్లపై గుంతలతో ప్రజల పాట్లు
Gunthala Andhra Pradeshku Daredi CM: రాష్ట్రంలో అధ్నాన స్థితిలోకి చేరుకున్న రహదారుల దుస్థితికి నిరసనగ నిర్వహించిన.. 'గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది' కార్యక్రమం రెండో రోజూ విజయవంతంగా కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ - జనసేన నేతలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గుంతలు పడిన రహదారులను చూపుతూ నాయకుల ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Gunthala Andhra Pradeshku Daredi CM: గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది 'కార్యక్రమంలో భాగంగా రెండోరోజూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం- జనసేన నేతలు ఆందోళనలను హోరెత్తించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని రహదారులు నరకమార్గాలుగా మారాయని నాయకులు విమర్శించారు. నాలుగున్నరేళ్లలో ఒక్క రహదారినైనా నిర్మించకపోగా.. పాడైన రహదారులకు కనీస మరమ్మతులూ చేయలేదనిఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాటానికి దిగిన తెలుగుదేశం-జనసేన శ్రేణులు.. రహదారుల దుస్థితిని ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’ పేరిట కళ్లకు కట్టారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో గుంతల రోడ్లపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రోడ్ల దుస్థితిపై వాహనదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వానికి అక్రమ లేఅవుట్లకు రోడ్లు నిర్మించడంపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణంపై లేదని మండిపడ్డారు.
TDP Janasena Joint Protest on Roads: అధ్వానంగా మారిన రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని పాములపల్లి రోడ్డుపై టీడీపీ - జనసేన నేతలు నిరసన ప్రదర్శన చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మరమ్మతులకు గురైన రోడ్లపై తట్టెడు మట్టి వేసిన దాఖలాలు లేవని విమర్శించారు.
రాష్ట్రాన్ని గుంతల ఆంధ్రప్రదేశ్‌గా మార్చడాన్ని నిరసిస్తూ.. పల్నాడు జిల్లా తంగడ గ్రామంలోని గుంతల రోడ్లపై ఇరుపార్టీల నేతలు ఆందోళన చేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ ఏర్పడుతోందని.. దీనివల్ల అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోందని నేతలు మండిపడ్డారు.
జగన్ పాలనలో రోడ్ల దుస్థితిని వివరిస్తూ.. కృష్ణా జిల్లా మంటాడ వద్ద నాయకులు ఆందోళన చేశారు. గుంతలో చిక్కుకున్న ఆటో చుట్టూ వైసీపీ రంగులు వేసి.. జగన్ గారి గుంత - సామాన్యుల తంటా అంటూ నినాదాలు చేశారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఫ్యాన్ వేసుకుని కూర్చుంటే.. సామాన్యులు మాత్రం గుంతల్లో పడి అల్లాడుతున్నారని మండిపడ్డారు.
గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు ప్రధాన రహదారిపై టీడీపీ - జనసేన నేతలు నిరసన తెలిపారు. రోడ్ల మరమ్మతుల విషయంలో వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బటన్లు నొక్కడం కాదు రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.
అధ్వాన రహదారుల గురించి ఎన్ని పోరాటాలు చేసినా జగన్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని టీడీపీ - జనసేన నాయకులు విమర్శించారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే భవిష్యత్తులో మరింత ఉద్ధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కొన్నిచోట్ల శ్రమదానం నిర్వహించి, రహదారులపై ఉన్న గుంతలను పూడ్చారు.
