నా అక్క చెల్లెమ్మలు అంటూ - వేల మంది మహిళా ఉద్యోగులను తొలగించిన ఏపీ ప్రభుత్వం
Published: Nov 20, 2023, 7:30 AM


నా అక్క చెల్లెమ్మలు అంటూ - వేల మంది మహిళా ఉద్యోగులను తొలగించిన ఏపీ ప్రభుత్వం
Published: Nov 20, 2023, 7:30 AM

CM Jagan Cheated Women: సభ ఏదైనా సీఎం జగన్.. నా అక్క చెల్లెమ్మలు అంటూ మహిళలపై ఒల్లమాలిన ప్రేమ ఒలకబోస్తారు. మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు తెచ్చామంటూ పదే పదే వల్లిస్తారు. కానీ.. మహిళలకు ఉపయోగపడే కల్యాణ మిత్ర, బీమా మిత్ర, పశు మిత్ర పథకాలను సీఎం జగన్ తొలగించారు. వారికి నెలకు 10 వేల నుంచి 20 వేల వరకు దూరం చేశారు. మహిళల పొట్టకొట్టి.. సాధికారతను చంపేశారు.
CM Jagan Cheated Women: మహిళలకు ఉపాధి కల్పించి.. వారి సొంత కాళ్లపై వాళ్లు నిలబడేలా చేయడం.. వారిని సాధికారత దిశగా అడుగులు వేయించడంలో అతి ముఖ్యమైనది. అలా మహిళలకిచ్చే భరోసా వారి కుటుంబాలకే కాదు రాష్ట్ర ప్రగతికీ తిరుగులేని దన్నుగా నిలుస్తుంది. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా దీన్ని ప్రాధాన్యాంశంగా తీసుకుంటుంది. అవకాశమున్న ప్రతిచోటా ఉపాధి కల్పనలో మహిళలకు అండగా నిలుస్తుంది. కానీ జగన్ తీరే వేరు. నాలుగున్నరేళ్ల పాలనలో మహిళలకు సాధికారత మాట పక్కన పెడితే.. అనేక రకాలు వారి పొట్ట కొట్టారు.
చిరుద్యోగాలు చేసుకుంటూ ఎంతో కొంత సంపాదిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్న మహిళలకు ఉపాధే లేకుండా చేసి కుటుంబాలను రోడ్డున పడేశారు. వారిలో వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారన్న కనికరమూ చూపించలేదు. తాను అధికారంలోకి వస్తే మరింతగా వేతనాలు పెంచి గొప్ప మేలు చేస్తానని ఎన్నికలకు ముందు ఊరూరా తిరుగుతూ హామీలిచ్చారు. గద్దెనెక్కిన తర్వాత నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించారు. ఒకరినీ ఇద్దరినీ కాదు 7 వేల 500 మంది మహిళల్ని రోడ్డున పడేశారు. వీరంతా డ్వాక్రా మహిళలే. ఇలా ఉపాధిని హరించడమేనా సాధికారత అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మళ్లీ రాష్ట్రానికి జగన్ ఎందుకులే అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
తాను సీఎంగా కొనసాగినంత కాలం కల్యాణ మిత్రలుగా మీరే ఉంటారంటూ.. ప్రోత్సాహకాన్నీ పెంచుతానని.. 2 వేల 500 మంది కల్యాణ మిత్రలను జగన్ నమ్మించారు..తర్వాత కనీసం తొలగించామనే ఆదేశాలే లేకుండా.. వారిని పక్కన పెట్టేశారు. తమను విధుల్లోకి తీసుకోవాలని ఆ మహిళలు ఎంతగా వేడుకున్నా.. ఆలకించలేదు.
గత ప్రభుత్వ హయాంలో పెళ్లికానుక పథకం కింద గ్రామాలు, పట్టణాల్లో వివిధ వర్గాలకు చెందిన వివాహాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదిస్తూ నెలకు సగటున 10 వేల నుంచి 20 వేల దాకా కల్యాణ మిత్రలు సంపాదించుకునేవారు. ఠంచనుగా వివాహం జరిగే రోజుకు ప్రభుత్వమిచ్చే ఆర్థిక సాయంలో 20 శాతం, ఆ తర్వాత నెల రోజుల్లో మిగతా సాయాన్ని లబ్ధిదారులకు అందించేవారు. జగన్ అధికారంలోకి రాగానే సంవత్సరం పాటు పని చేయించుకుని.. ఆ సమయానికి వేతనాలివ్వకుండా వారి నోట్లో మట్టికొట్టారు.
మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పే జగన్ నాలుక ఎన్ని మడతలేస్తుందో అనే దానికి ఉదాహరణ బీమా మిత్రల నోటికాడ కూడు లాగేయడమే. గత ప్రభుత్వం కంటే మిన్నగా గౌరవ వేతనం కింద 3 వేలిస్తామని, క్లెయిమ్‌ను అప్లోడ్ చేసిన వెంటనే వెయ్యి రూపాయలు ప్రోత్సాహకాన్ని అందిస్తామని మాటిచ్చారు. అంతే తేలిగ్గా ఆ మాట తప్పారు. అంతే కాక.. నెలకు 7 వేల నుంచి 30 వేల దాకా సంపాదిస్తున్న మహిళలకు ఆ ఉపాధీ లేకుండా చేసి దాదాపు 2 వేల మంది పొట్టకొట్టారు.
గ్రామాల్లో పశువులకు దాణా, గడ్డి అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు వాటికి ఏదైనా జబ్బు చేస్తే.. పశు వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించడం, పశు పోషకులకు తగిన సలహాలు ఇవ్వడం.. ఇవీ పశుమిత్రల విధులు. ఆ పనులకు అనుగుణంగా అప్పటి ప్రభుత్వం ప్రోత్సాహకం కింద నగదు అందించింది. దాదాపుగా 3 వేల మంది డ్వాక్రా మహిళల్ని పశుమిత్రలుగా ఎంపిక చేసి.. వారికి తగిన ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించింది. నెలకు సగటున 3 వేల నుంచి 5 వేల దాకా వారు సంపాదించుకునేవారు. వారి సేవలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని తొలగించారు.
