అమరావతి రైతులపై అడ్డగోలు దుష్ప్రచారం!

author img

By

Published : Nov 25, 2022, 10:18 AM IST

అమరావతి రైతులపై అడ్డగోలు దుష్ప్రచారం

Propaganda against Amaravati farmers: విభజిత అవశేషాంధ్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన అన్నదాతల పెద్దమనసునే చిన్నబుచ్చుతున్న వైనమిది. ఆ రైతులంతా త్యాగధనులా, స్వార్థపరులా అనే అంశాన్ని రాష్ట్ర సర్కారు చర్చకు పెట్టింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్ని గత ప్రభుత్వం త్యాగధనులుగా కీర్తిస్తే, ప్రస్తుత వైకాపా సర్కారు స్వార్థపరులని, భూస్వాములని నమ్మబలుకుతోంది.

Propaganda against Amaravati farmers: రాజధాని నిర్మాణం సంపన్న రైతుల ప్రయోజనం కోసమేనని, బలహీన వర్గాలకు అందులో స్థానమే లేదంటూ సాగుతున్న ప్రచారాల్లో డొల్లతనం జనానికి తెలియాల్సిందే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాజధాని కోసం 29,881 మంది రైతులు 34,323 ఎకరాల భూములు ఇచ్చారు. వీరిలో ఎకరం లోపు భూమిని ఇరవై వేలకుపైగా రైతులు ఇవ్వగా, 20-25 ఎకరాలదాకా పన్నెండు మంది, పాతిక ఎకరాల పైబడి కేవలం అయిదుగురే ఇచ్చారు. రెండు ఎకరాల లోపు 25,717 మంది రైతులు 17,501 ఎకరాలు ఇచ్చారు.

మొత్తం రైతుల్లో 32 శాతంతో ఎస్సీ, ఎస్టీలదే అగ్రస్థానం. ఆ తరవాతి స్థానం రెడ్డి సామాజిక వర్గానిది. తక్కువ ఎకరాలు ఇచ్చిన రైతుల సంఖ్యే ఎక్కువగా ఉంది. వీరంతా చిన్న రైతులే. వీరందరినీ భూస్వాములు అందామా? భూములు ఇచ్చిన దళితులు, బీసీలు తదితర సామాజిక వర్గాల వారంతా స్వార్థపరులేనా? పైగా వీరంతా సాగును నమ్ముకున్న రైతులు. భూసేకరణ జరగక ముందు ఏటా మూడు పంటలు పండించిన అన్నదాతలు. పూల తోటలు, ఆకుకూరలు, కూరగాయ పంటలతో ఏటా లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఫలసాయం సంపాదించే కర్షకులు. ఇదంతా కాదనలేని సత్యం!

భూములు ఇవ్వడమే పాపమా?

మరో వాస్తవిక కోణం ఏమిటంటే, తమ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేయాలంటూ ఏ ఒక్క రైతూ ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వమే రైతుల దగ్గరికి వెళ్ళింది. రాజధాని నిర్మాణానికి భూములు కావాలని అడిగింది. నష్టపరిహారం ఇచ్చే స్తోమత, ఆర్థిక పరిస్థితి లేదన్న కారణంగా ల్యాండ్‌పూలింగ్‌ విధానం తీసుకొస్తున్నట్లు చెప్పింది. రాష్ట్ర భవిత కోరి రైతులూ ముందుకొచ్చారు.

ప్రభుత్వానికి, రైతులకు మధ్య పరస్పర ఒడంబడికను శాసనసభ తీర్మానాల ద్వారా చట్టబద్ధం చేశారు. రైతులు ఇచ్చిన భూముల్లో అభివృద్ధి పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చించాయి. అసెంబ్లీ, సచివాలయం, న్యాయస్థానం భవనాలను నిర్మించాయి. ఉద్యోగులు, న్యాయమూర్తుల భవన సముదాయాలు 60-90 శాతందాకా పూర్తయ్యాయి. గత ప్రభుత్వంతోపాటు, ప్రస్తుత సర్కారు పాలన సాగిస్తున్నదీ రైతులు ఇచ్చిన ఆ భూముల్లోనే. ఇదీ రాజధాని వాస్తవ ముఖచిత్రం!

ఈ మొత్తం ప్రక్రియలో రైతుల స్వార్థం ఏముంది? రాష్ట్ర భవిత కోసం భూమి ఇవ్వడమే కర్షకులు చేసిన పాపమా? అదే వారికి శాపమా? రాజధాని రైతులు ఇతర ప్రాంతాలకు ఎలా ద్రోహులవుతారు? వారు ఏం ద్రోహం చేశారు? భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం మారితే రాజధాని మారవచ్చన్న సంగతి తెలుసా? తాము అధికారంలోకి వస్తే రాజధానిని మార్చేస్తాం అని కొత్త ప్రభుత్వం చెప్పిందా? గత ప్రభుత్వం కంటే మిన్నగా రాజధానిని అభివృద్ధి చేస్తామని ఎందుకు చెప్పారు?

మార్చుకుంటూ పోతే చేసిన చట్టాలు ఎందుకు? ముఖ్యమంత్రికి మిగిలిన రెండు ప్రాంతాల్లోనూ మరో రెండు రాజధానులు కట్టాలని ఉంటే- భూసేకరణ ద్వారానో, భూసమీకరణ ద్వారానో భూములను కూడగట్టి సంపూర్ణమైన మరో రెండు రాజధానులను కట్టవచ్చు కదా? అమరావతి కాలు తీసి కర్నూలులో, చెయ్యితీసి విశాఖలో పెట్టడం దేనికి? వీటన్నింటికంటే మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే- రాజధాని రాష్ట్రానికి మధ్యప్రాంతంలో ఉండటంతో పాటు గుంటూరు, విజయవాడ నగరాల మధ్యలో ఉంది. పైగా కొంతమేర ఎస్సీ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఇదెవ్వరూ విస్మరించలేని కీలక నిజం!

ఉద్యమంపై కర్కశత్వం
ఉద్యమంపై కర్కశత్వం

ఉద్యమంపై కర్కశత్వం

రాజధాని ప్రాంతంపై, అక్కడి రైతులపై నిందలు మోపడం, పచ్చి అబద్ధాలు వల్లెవేయడం, దూషణలు చేయడం ఒక దుర్మార్గమైతే- భూముల్ని ధారపోసిన రైతుల్ని, మహిళల్ని వేధించడం అంతకన్నా మహా దుర్మార్గం. ముఖ్యమంత్రి చేసిన మూడు రాజధానుల ప్రకటనతో రాజధాని రైతులు దీక్షలు చేపట్టారు. రాజధాని కోసం పొలాలు ఇచ్చిన 29 గ్రామాలు కలిసికట్టుగా ఆకుపచ్చ ఉద్యమ జెండాలను ఎగరేశాయి. తొలుత రాజధాని గ్రామాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. శిబిరాలు ఏర్పాటు చేయకుండా భయపెట్టారు. మైకుల్లో సెక్షన్ల పేరిట బెదిరించారు.

పచ్చని పల్లెల గుండెలపై పోలీసు పదఘట్టనలు మార్మోగాయి. అయినా కర్షకులు బెదరలేదు. ఉద్యమ శిబిరాలను తమ సొంత స్థలాల్లోకి, పందిళ్లలోకి మార్చారు. వారు ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా, ఎలాంటి ఆందోళనకు పిలుపిచ్చినా లెక్కకు మిక్కిలిగా పోలీసులు వచ్చేవారు. వీడియోలు తీసేవారు. డ్రోన్‌ కెమెరాలు ఎగరేసేవారు. ప్రతి ధర్నాకి, ప్రతి నిరసన కార్యక్రమానికి ఐకాస నాయకులపై, క్రియాశీలకంగా పాల్గొన్న మహిళలపై కేసులు పెట్టారు. తిడుతూ కొడుతూ రక్తం కళ్ల చూశారు. ఆఖరుకు కనకదుర్గమ్మ బోనాలకూ మహిళలను వెళ్ళనివ్వలేదు.

రాజధాని గ్రామాల్లో పండుగలు లేవు. బంధువుల రాకపోకలపైనా నిఘా కొనసాగేది. వెయ్యి రోజులకు పైబడిన ఉద్యమంలో ఇప్పటి వరకు పోలీసు రికార్డుల ప్రకారమే 1,176 మంది రైతులపై 210 కేసులు నమోదు చేశారు. వీరిలో దళితులు 350 మంది ఉండగా, మహిళలు 400 పైమాటే. దేశంలోనే తొలిసారిగా దళితులపైనే ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన ఘటన రాజధాని గ్రామమైన కృష్ణాయపాలెంలో జరిగింది.

నమ్మిన నేలను ప్రభుత్వానికి ఇచ్చిన నేరానికి రైతులు నేరగాళ్లలా ఆటోలు, సైకిళ్లు, బైకులు వేసుకొని వెళ్ళి కోర్టుల ముందు నిలబడాల్సి రావడం అత్యంత విచారకరం. రాజధాని ఉద్యమంలో పాల్గొన్న దాదాపు 163 మంది రైతులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒత్తిడికి గురై ప్రాణాలు వదిలారు. ఏ ఉద్యమ చరిత్ర చూసినా కన్నీళ్ళకు, కడగండ్లకు కొదవుండదన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఉద్యమంలో రైతుల దుఃఖానికి, కష్టాలకు కరవే లేదని చెప్పాలి. ఇదంతా రాజధానిపై సాగుతున్న కుతంత్రాల ఫలితం!

భూములిచ్చిన వారి వివరాలు
భూములిచ్చిన వారి వివరాలు
భూములిచ్చిన వారి వివరాలు
భూములిచ్చిన వారి వివరాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.