న్యాయమూర్తుల బదిలీలు నిరసిస్తూ.. న్యాయవాదుల ఆందోళన

author img

By

Published : Nov 25, 2022, 12:09 PM IST

Updated : Nov 26, 2022, 10:12 AM IST

న్యాయమూర్తుల బదిలీలను నిరసిస్తూ న్యాయవాదుల ఆందోళన

ADVOCATES PROTEST: హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్ బదిలీపై నిరసనలు వెల్లువెత్తాయి. న్యాయవాదులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించారు. కోర్టు హాళ్ల నుంచి లాయర్లంతా వెళ్లిపోవడంతో.. కేసులను వాయిదా వేసి న్యాయమూర్తులు బెంచ్ దిగిపోయారు. బదిలీలను నిలిపివేయాలంటూ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు నినాదాలు చేశారు. హైకోర్టు వద్ద జాతీయ పతాకం ఉన్న ప్రాంతం నుంచి క్యాంటీన్ వరకు ర్యాలీ తీశారు.

ADVOCATES PROTEST AT HIGHCOURT : ‍‌ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ . రమేశ్ అకస్మిక బదిలీలను నిరసిస్తూ.. న్యాయవాదులంతా విధులు బహిష్కరించారు. నెక్ బ్యాండ్లను తొలగించి కోర్టు ప్రాంగణంలో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్భలంతోనే ప్రజా న్యాయమూర్తులుగా ముద్రపడిన జ‌డ్జీల బదిలీ జరిగిందని మండిపడ్డారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిష్పక్షపాతంగా తీర్పులిస్తున్నందునే బదిలీ చేయించారని ఆక్షేపించారు. పేద, అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని భరోసా కల్పించిన జడ్డీల ఏకపక్ష బదిలీలపై అనుమానాలు వ్యక్తం చేసిన న్యాయవాదులు.. కక్షసాధింపు చర్యల్లో భాగంగా చేసిన ఫిర్యాదుకు అనవసర ప్రాముఖ్యత ఇస్తే మిగిలిన న్యాయమూర్తుల పనివిధానంపై ఆ ప్రభావం పడుతుందన్నారు.

అటెండరైనా, ఐఏఎస్ అధికారైనా కోర్టు దృష్టిలో సమానమనేలా ఇరువురు న్యాయమూర్తులు వ్యవహరించారని గుర్తుచేశారు. జడ్జీలకు ఇబ్బంది తలెత్తితే బయటకొచ్చి మాట్లాడలేరని.. అందుకే వారి పక్షాన న్యాయవాదులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్‌లో న్యాయవాదులంతా ఒక్కమాటపై నిలబడి అక్కడి న్యాయమూర్తి బదిలీని నిలిపేయించుకున్నారని.. అదే తరహాలో ఏకతాటిపై నిలబడి బదిలీలను ఆపించుకోవాలని సీనియర్‌ లాయర్లు పిలుపునిచ్చారు.

"గుజరాత్‌ హైకోర్టు జడ్జి బదిలీ వెనక్కి తీసుకుని.. ఏపీ న్యాయమూర్తులను బదిలీ చేయడం సరికాదు. జడ్జిల బదిలీలో వివక్ష చూపుతున్నారు. ఏపీ హైకోర్టు నుంచి జస్టిస్‌ దేవానంద్‌, జస్టిస్‌ రమేష్‌ బదిలీ సరికాదు"-న్యాయవాదులు

హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలపై న్యాయవాదుల సంఘ సభ్యులు అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. బదిలీ ప్రక్రియను నిలిపేసి, ఇద్దరు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టులో కొనసాగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేశారు. బదిలీలకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఇరువురు జడ్జీలను ఇక్కడే ఉంచేలా చర్యలు చేపట్టాలంటూ ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్‌ను కోరుతూ తీర్మానం చేశారు.

విధుల బహిష్కరణకు తాము పిలుపు ఇవ్వలేదని.. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఓ న్యాయవాద సమూహం చేసిన తీర్మానానికి ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం నుంచి ఆథరైజేషన్ లేదన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 26, 2022, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.