పట్టించుకోని ప్రజాప్రతినిధులు.. ఆసుపత్రి కోసం యువకుడి పోరాటం

author img

By

Published : Aug 2, 2022, 3:11 PM IST

youngman struggle

Struggle For Hospital Construction: ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే.. ఆ వ్యక్తి జ్ఞాపకాలతో గడుపుతారు. కానీ ఆ యువకుడు అలా ఆలోచించలేదు. తన కుటుంబానికి జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదని భావించాడు. అన్ని వసతులతో కూడిన ఆస్పత్రి త్వరగా నిర్మిస్తే.. తనలాంటి ఎంతో మందికి న్యాయం జరుగుతుందంటూ.. ద్విచక్ర వాహనానికి పోస్టర్ కట్టుకుని మరీ తిరుగుతున్నాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరు? అతనికి జరిగిన అన్యాయం ఏంటి?

Struggle For Hospital Construction: ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన మురళీకృష్ణ.. ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు. కొంత కాలం క్రితం పాము కాటుకు గురై.. సమయానికి చికిత్స అందక కళ్లముందే తన సోదరుడిని పోగొట్టుకున్నాడు. తమ ఊర్లో అన్ని వసతులతో కూడిన ఆస్పత్రి (hospital) లేకపోవడమే తన సోదరుడి మరణానికి కారణమని భావించిన రామకృష్ణ.. మరే కుటుంబానికి అలాంటి అన్యాయం జరగకూడదని.. ఆస్పత్రి నిర్మాణం కోసం పోరాడుతున్నాడు.

బొర్రంపాలానికి 2011లో రూ.79 లక్షలతో 10 పడకలతో కూడిన ఆస్పత్రి మంజూరు కాగా.. స్థల సేకరణలో జరిగిన జాప్యం కారణంగా నిర్మాణం అటకెక్కింది. దీంతో అంచనా వ్యయం పెరిగిపోయింది. 2016లో మరోసారి ఈ ఆస్పత్రి నిర్మాణానికి కోటి 49 లక్షల రూపాయలు మంజూరు కాగా.. మళ్లీ స్థల సేకరణ దశలోనే ఆగిపోయింది. ఎట్టకేలకు గతేడాది స్థలసేకరణ జరిగినా.. నిర్మాణ పనులకు మాత్రం నోచుకోలేదు. దీంతో కనీసం అక్కడ శంకుస్థాపన కూడా జరగలేదు.

నిధులున్నా పనులు చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చేందుకు మొగ్గు చూపడం లేదని మురళీకృష్ణ వాపోయాడు. ఎలాగైనా తన సమస్యను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని తన ద్విచక్రవాహనానికి ఆస్పత్రి పరిస్థితి అద్దం పట్టేలా ఫ్లెక్సీ రూపొందించుకుని.. తిరుగుతున్నాడు. ఎప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆస్పత్రి నిర్మాణంపై స్పందించకపోతారా అంటూ ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఆస్పత్రి నిర్మాణం చేస్తే.. తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామల ప్రజలకు వైద్య సేవలు అందుతాయని యువకుడు వేడుకుంటున్నాడు.

ఆసుపత్రి కోసం యువకుడి పోరాటం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.