రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి

author img

By

Published : Mar 9, 2023, 2:17 PM IST

Road accidents in the state

Road accidents in the state : రాష్ట్రంలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఏలూరు జిల్లాకు ఇద్దరు వ్యక్తులు.. శ్రీ సత్య సాయి జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్​ ఈ ప్రమాదాల్లో మృతి చెందారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Road accidents in the state : ఏలూరు జిల్లా.. నూజివీడు మండలం మీర్జాపురం గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బిల్లనపల్లి గ్రామానికి చెందిన తెలగా ప్రభాకర్​రావు (64), కాకుమాను రాంప్రసాద్ (40) ద్విచక్ర వాహనంపై మీర్జాపురం గ్రామం వెళ్తుండగా మార్గం మధ్యలో నూజివీడు నుంచి హనుమాన్ జంక్షన్ వెళుతున్న లారీ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను 100 మీటర్ల వరకు చక్రాల కింద లారీ లాకెళ్లింది. ఘటనా స్థలం నుంచి లారీ డ్రైవర్ పరారయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు నూజివీడు రూరల్ ఎస్సై తలారి రామకృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీ సత్య సాయి జిల్లాలో : జిల్లాలోని తనకల్లు మండలంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢి కొట్టగా ఏఆర్ కానిస్టేబుల్ మల్లికార్జున నాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలం తోడేళ్ల గడ్డపల్లికి చెందిన మల్లికార్జున నాయుడు.. జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ఏ ఆర్ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నారు. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా బందోబస్తు విధుల కోసం కదిరికి వచ్చారు. అక్కడ విధులు ముగిసిన తరువాత ఇంటికి అవసరమైన సరుకులను కొక్కంటి క్రాస్​లో కొనుగోలు చేసి తెలిసిన వారి ద్వారా ఇంటికి పంపారు. వ్యక్తిగత పనిమీద కదిరికి వెళుతున్న సమయంలో ఒక పెద్ద మలుపు రాగా తన ద్విచక్ర వాహనాన్ని నియంత్రించుకోలేక పోయారు. దీంతో రోడ్డు పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టుకు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో మల్లికార్జున నాయుడు తలకు బలమైన గాయాలయ్యాయి. అక్కడ పక్కన ఉన్న స్థానికులు గుర్తించి బాధితుడిని 108 సాయంతో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మల్లికార్జున నాయుడుకి భార్య, కుమార్తె ఉన్నారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేయనున్నట్లు తనకల్లు ఎస్సై రాంభూపాల్ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.