దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపించాం: సీఎం జగన్

దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపించాం: సీఎం జగన్
CM Jagan Comments on Assigned Lands: రాష్ట్రంలో దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపించామని సీఎం జగన్ అన్నారు. చుక్కల భూములు, షరతుల భూములు, సర్వీస్ ఇనాం భూముల ఇబ్బందులు తొలగించామని తెలిపారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. విపక్షాలన్నీ కలిసి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు.
CM Jagan Comments on Assigned Lands: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు తమ ప్రభుత్వం పరిష్కారం చూపిందని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటింటిన సీఎం జగన్..అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడంతోపాటు, లంక భూములకు పట్టాలు అందజేశారు. చుక్కల భూములు, షరతుల భూములు, సర్వీస్ ఇనాం భూముల ఇబ్బందులు తొలగించామని వెల్లడించారు.
Cm Jagan on Assigned Lands: తరతరాలుగా భూములు సాగు చేసుకుంటున్నా.. వాటిపై యాజమాన్య హక్కులు పొందలేక కొందరు రైతులు తీవ్ర ఇబ్బందులుపడ్డారని..రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక, అవసరానికి అమ్ముకోలేక సతమతమయ్యారన్నారు. అందుకే అసైన్డ్ భూములపై రైతులకు హక్కులు కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా, వివిధ రకాలుగా ఇబ్బందులకు గురవుతున్న రైతులకు.. భూమిపై యాజమాన్య హక్కులు కల్పించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 4వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయిందన్న సీఎం.. ఆయా గ్రామాల్లో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.
CM Jagan Comments: ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్.. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడంతోపాటు.. లంక భూములకు పట్టాలు అందజేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ..''రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ.. కొత్తగా డీకేటీ పట్టాలను అందిస్తున్నాం. చుక్కల భూములకు సైతం పరిష్కారం చూపించాం. అసైన్డ్ భూములు, లంక భూములకు భూ హక్కులు కల్పిస్తున్నాం. భూ తగాదాలకు పరిష్కారం చూపిస్తూ.. రికార్డులు అప్‌డేట్ చేస్తున్నాం. వేలమంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నాం'' అని ఆయన అన్నారు.
Cm Jagan Criticism on Opposition: రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయని గుర్తు చేసిన సీఎం జగన్.. గతంలో కలసి పనిచేసిన వారంతా.. ప్రజలను మోసం చేసేందుకు మళ్లీ దగ్గరయ్యారని విమర్శించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంపై తనకు పూర్తి అవగాహన ఉందన్న సీఎం.. త్వరలోనే దీనిని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
''మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు వేశాం. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2.40 లక్షల కోట్లను జమ చేశాం. అర్హత ఉన్న ప్రతీ లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అమలు చేశాం. 2.07 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మా ప్రభుత్వం భర్తీ చేసింది. పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. 80 శాతం ఇళ్ల పట్టాలు ఎస్సీ, బీసీ, ఎస్టీ కుటుంబాలకు ఇచ్చాం. సామాజిక న్యాయం కోసం వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రజలతో తప్ప.. ఎవరితోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకోదు. నూజివీడు పట్టణ పరిధిలోని ప్రతి సచివాలయానికి రూ.కోటి మంజూరు చేశాం. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. విపక్షాలన్నీ కలిసి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి.'' -వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి
