మంచిగా బతకమంటే.. మాటు వేసి హత్య చేశాడు.. ఆపై!

author img

By

Published : Dec 5, 2021, 12:15 PM IST

man murdered his friend in rajamundry

డబ్బులు దుబారా చేయవద్దని హితం చెప్పిన స్నేహితుడినే హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కోలమూరులో చోటుచేసుకుంది.

కంచిబొట్ల నాగ సాయి అలియాస్‌ సాయి వెంకటేష్‌(25), సాయి పవన్‌ చిన్నప్పటి నుంచే అనాథలు. ఎక్కడో కలిసిన వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఒకరికొకరు సాయంగా ఉంటా.. సొంత అన్నాతమ్మళ్లలా మెలిగారు. కలిసే పౌరోహిత్యం నేర్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కోలమూరులో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. స్థానిక గుడిలో అర్చకులుగా ఉంటూనే పౌరోహిత్యం చేస్తున్నారు. గతకొంతకాలంగా పవన్​కు స్నేహితులు ఎక్కువయ్యారు. వారితోనే తిరుగుతూ.. డబ్బు వృథా చేస్తున్నాడు.

స్నేహితుడిని మార్చాలని తరచూ మంచిమాటలు..

చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారో వారిద్దరికీ బాగా తెలుసు. అయినప్పటికీ చెడుసావాసాలతో పవన్​ జీవితాన్ని నాశనం చేసుకోవడం సాయి వెంకటేశ్ జీర్ణించుకోలేకపోయాడు. తన సొంత సోదరుడిగా భావించి... వారితో తిరగొద్దని చెప్పేవాడు. అయినా పవన్ పట్టించుకోకుండా మరింత ఎక్కువ చేశాడు. చెప్తే వినకపోయినప్పటికీ.. పవన్ కచ్చితంగా మారతాడనే ఉద్దేశంతో తరచూ మందలిస్తూ వచ్చాడు. దీంతో పవన్​కు సాయి వెంకటేశ్​పై కోపం ఎక్కవైంది. ప్రతిరోజూ ఇంట్లోకి రాగానే... తన స్నేహితుడు చెప్పే మంచి మాటలు సోదిలా అనిపించింది. ఇక నేను తట్టుకోలేనని భావించి ఓ పథకం పన్నాడు.

ఇంట్లోనే మృతదేహాన్ని కాల్చారు..

తన స్నేహితులతో కలిసి సాయి వెంకటేష్​ను హత్య చేసేందుకు పన్నాగం పన్నాడు. అనుకున్నట్లుగానే తన స్నేహితులతో కలిసి సాయి వెంకటేష్​ను హత్య చేశాడు. మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించాడు. వీలుకాకపోవడంతో... శుక్రవారం రోజు ఇంట్లోనే మృతదేహంపై స్నేహితులతో కలిసి పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. ఇంట్లోంచి పొగ, దుర్వాసన రావడంతో.. స్థానికులు వచ్చి తలుపులు కొట్టారు. అందరికీ తెలిసిపోతుందనే భయంతో సగం కాలిన మృతదేహాన్ని బాత్​రూమ్​లో పడేసి... పవన్, అతని స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు.

సగం కాలిన మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలింపు..

వారు తమముందే పారిపోవడంతో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని స్థానికులు ఇంట్లోకి వెళ్లారు. సగం కాలిన మృతదేహాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు... సగం కాలిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.