గోదావరి తీరంలో ఇసుక తోడేళ్లు - గడువు పూర్తైనా యథేచ్ఛగా ఇసుక దందా

గోదావరి తీరంలో ఇసుక తోడేళ్లు - గడువు పూర్తైనా యథేచ్ఛగా ఇసుక దందా
Illegal Sand Transportation in East Godavari District: గోదావరి తీరంలో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. రేయింబవళ్లు తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయించి.. చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
Illegal Sand Transportation in East Godavari District: గోదావరి తీరంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రేయింబవళ్లు తేడా లేకుండా అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. నిబంధనలకు పాతరేస్తూ.. గోదారి తల్లి గుండెల్లో భారీ యంత్రాలు దింపుతున్నారు. అనుమతుల్లేకుండా నిత్యం వేల లారీల్లో ఇసుకను సరిహద్దులు దాటించేస్తున్నారు. కిలోమీటర్ల మేర లారీలను బారులు తీరుస్తూ.. నర్సరీ రైతుల వ్యాపారానికీ గండికొడుతున్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు.. చంపేస్తామంటూ బెదిరింపులు.. ఇదీ తూర్పుగోదావరి బుర్రిలంక రేవులో జరుగుతున్న ఇసుక దందా తీరు.
Sand Smuggling in AP: గోదారి నదీ గర్భంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు.. జాతీయ రహదారికి ఇరువైపులా.. ప్రధాన కాల్వ, నర్సరీ పొలాల నుంచి రీచ్ వరకు నిలిచి ఉన్న లారీలు.. ఇసుక మాఫియాకు ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి. తూర్పుగోదావరి జిల్లా బుర్రిలంక రేవు.. ఇసుకాసురుల కబంద హస్తాల్లో చిక్కుకుంది. ఈ ర్యాంపులో తవ్వకాల గడువు మే 5న పూర్తయింది. టెండర్ల ప్రక్రియ ఖరారు కాకపోయినా అక్రమ ఇసుక తరలింపునకు కేంద్ర బిందువుగా మారింది.
Sand Mafia in Burrilanka: అనుమతులు ముగిసినా జేపీ సంస్థ వే బిల్లులతోనే యథేచ్ఛగా రవాణా సాగుతోంది. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి సమీపంలోనే బుర్రిలంక రేవు ఉంది. అలాంటి చోట నిబంధనలను తుంగలో తొక్కి 30 అడుగులకుపైగా నదిలో ఇసుక తోడేస్తున్నారు. హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు కనీసం అమలు కావట్లేదు. గతంలో ఇక్కడ బోట్స్‌మెన్ సొసైటీ ద్వారా కూలీలు ఇసుక తవ్వుతూ జీవనోపాధి పొందేవారు. ప్రస్తుతం యంత్రాలను వాడటంతో కూలీలకు పని లేకుండా పోయింది. ఇసుక తోడేళ్లు పేట్రేగిపోతుంటే.. మైనింగ్ సహా ఇతర అధికారులు కనీసం కన్నెత్తి చూడటం లేదు.
Illegal Sand Transportation: కడియం అంటేనే నర్సరీలకు ప్రసిద్ధి. కానీ ఇసుక దందాతో.. నర్సరీల ఉనికే ప్రశార్థకంగా మారింది. ఇసుక లారీల దెబ్బకు.. మొక్కలు తీసుకు వచ్చే వాహనాలు రాలేకపోతున్నాయి. మొక్కల ఎగుమతులు, దిగుమతులకు ఆటంకం కలుగుతూ రైతుల వ్యాపారానికి గుదిబండలా మారింది. 50కిపైగా టన్నుల ఇసుక లోడుతో లారీలు రాకపోకలు సాగించడం వల్ల గోదావరి గట్టు బలహీనంగా మారింది. వరదలొస్తే గట్టు తెగే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
BJP Purandeshwari on Sand Mafia: బుర్రిలంక ఇసుక ర్యాంపులో అక్రమ తవ్వకాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి.. జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్‌తో కలిసి పరిశీలించారు. దోచుకో.. దాచుకో మాదిరిగా ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని వారు ధ్వజమెత్తారు.
