లోకేశ్ యువగళానికి మూడు రోజులే గడువు.. స్పష్టతనివ్వని పోలీసులు

author img

By

Published : Jan 24, 2023, 7:13 AM IST

Etv Bharat

LOKESH YUVAGALAM PADAYATHRA: అప్లై.. అప్లై బట్‌ నాట్‌ రిప్లై..! టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పాదయాత్రకు అనుమతిపై పోలీసులు తీరు ఇలాగే ఉంది. దరఖాస్తు చేసి రోజులు గడుస్తున్నా ఇంకా తేల్చలేదు. పాదయాత్ర ప్రారంభానికి 3 రోజులే సమయం ఉన్నా ఇంకా సమాచారం కావాలంటూ నాన్చుతున్నారు. ఇదే సమయంలో అనుమతి ఇవ్వబోమని చెప్పలేదు కదా అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని టీడీపీ మండిపడుతోంది.

లోకేశ్ యువగళానికి మూడు రోజులే గడువు.. స్పష్టతనివ్వని పోలీసులు

LOKESH YUVAGALAM PADAYATHRA: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జనవరి 27నుంచి 400 రోజుల పాటు యువగళం పేరుతో పాదయాత్ర తలపెట్టారు. దీనికి అనుమతి కోరుతూ ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు చిత్తూరు జిల్లా పార్టీ నేతలు సైతం డీజీపీకి, హోంశాఖ కార్యదర్శికి, చిత్తూరు జిల్లా ఎస్పీకి లేఖలు రాశారు. ఈ నెల 9న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి లేఖ రాశారు.

సవాలక్ష యక్ష ప్రశ్నలు: ఐతే పాదయాత్రలో ఎంత మంది పాల్గొంటారు? వారి వివరాలేమిటి? రాత్రుళ్లు ఎక్కడ బస చేస్తారు? వాహనాల రిజిస్ట్రేషన్‌ నెంబర్లు వంటి సమాచారం ఇవ్వాలంటూ సవాలక్ష యక్ష ప్రశ్నలతో రెండు రోజుల కిందట డీజీపీ ప్రత్యుత్తరమిచ్చారు. ఆ లేఖకు వర్ల రామయ్య వెంటనే సమాధానం పంపించారు. ఐనా పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ప్రకటన లేదు. 14 రోజులు దాటినా అనుమతిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. యాత్ర ప్రారంభానికి మరో మూడ్రోజులే మిగిలి ఉన్న వేళ.. అసలు అనుమతులిస్తారో? లేదో పోలీసు ఉన్నతాధికారులు తేల్చిచెప్పకపోవడం విస్మయం కలిగిస్తోంది.

పాదయాత్రకు అనుమతిచ్చారా? లేదా?: తొలుత చిత్తూరు జిల్లా పోలీసులు అడిగిన మేరకు లోకేశ్‌ వాహన శ్రేణిలో ఉండే కార్ల సంఖ్య, వాటి డ్రైవర్ల వివరాలను ఆ జిల్లా నేతలు అందించారు. కానీ పోలీసులు మరికొన్ని ప్రశ్నలువేశారు. కమతమూరు మార్గంలో నిర్వహించే బహిరంగ సభకు ఎంత మంది హాజరవుతారు? వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో చెప్పాలని కోరారు. టీడీపీ నాయకులు దానికీ సమాధానం పంపారు. కానీ అనుమతులపై అటో ఇటో తేల్చలేదు. లోకేశ్‌ పాదయాత్రకు చట్టప్రకారమే అనుమతులిస్తామని, ఇవ్వబోమని తామెక్కడా చెప్పలేదంటున్నారు చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి.

ఆంక్షలు విధించాలనో, ఆపాలనో ఉద్దేశం లేదంటూనే రూట్‌ మ్యాప్‌ సహా ఇతర అంశాలపై నాలుగైదు రోజులుగా వివరాలు అడుగుతున్నామని చెప్పారు. ఐతే యాత్రకు అనుమతిచ్చారా? లేదా? అనే దానిపై మాత్రం రిషాంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వలేదు. మంగళవారానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవహరిస్తామని చిత్తూరు జిల్లా పోలీసులు చెప్తున్నారు.

అడ్డంకులు సృష్టించినా పాదయాత్రను విజయవంతం: ఉద్దేశపూర్వకంగానే పోలీసులు జాప్యం చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పాదయాత్రకు అనుమతులు ఇస్తున్నట్లు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదని మాజీ మంత్రి అమరనాథరెడ్డి వెల్లడించారు. పోలీసు శాఖ ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్రను విజయవంతం చేస్తారని అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.