Narayana Case: మాజీ మంత్రి నారాయణకు బెయిల్
Updated on: May 11, 2022, 6:52 AM IST

Narayana Case: మాజీ మంత్రి నారాయణకు బెయిల్
Updated on: May 11, 2022, 6:52 AM IST
04:32 May 11
పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో నారాయణ అరెస్టు
Narayana: నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిల్ లభించింది. వ్యక్తిగత పూచీకత్తుతో మేజిస్ట్రేట్ సులోచనారాణి బెయిల్ మంజూరు చేశారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు నారాయణను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అనంతరం మంగళవారం రాత్రి ఆయనను చిత్తూరుకు తరలించి... ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల నిర్వహించారు. అనంతరం నారాయణను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసుల అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు. దీంతో ఆ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.
నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్నారని నారాయణపై పోలీసులు అభియోగం మోపారని, కానీ 2014లోనే ఆ విద్యాసంస్థల అధినేతగా ఆయన వైదొలిగినట్లు నారాయణ తరఫున న్యాయవాది తెలిపారు. నారాయణ విద్యాసంస్థలతో నారాయణకు సంబంధం లేదని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను న్యాయమూర్తికి సమర్పించినట్లు తెలిపారు. నేరారోపణ నమ్మేవిధంగా లేదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు. ఘటన జరిగిన నాటికి నారాయణ ఆ విద్యాసంస్థల అధినేత కాదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 18లోగా రూ. లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారని, నారాయణపై పోలీసులు అభియోగాలను నిరూపించలేదని న్యాయవాది అన్నారు.
హైదరాబాద్‌లో అరెస్టు: నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నారాయణను మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి మంగళవారం రాత్రి ఆయనను చిత్తూరుకు తరలించారు. ఏప్రిల్ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం వాట్సప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో నారాయణ పాత్ర ఉన్నట్టు తేలడంతో ఆయన్ను అరెస్టు చేశామని తెలంగాణ పోలీసులకు చిత్తూరు పోలీసులు వివరించారు. హైదరాబాద్ నుంచి తరలించేటప్పుడు నారాయణ ఉన్న వాహనాన్ని తెదేపా శ్రేణులు అడ్డుకుంటాయని.. ఆయన ఆచూకీ తెలియకుండా ఉండటానికి పలుమార్లు వాహనాలను మార్చి రాత్రికి చిత్తూరుకు తరలించారు. నారాయణ కళాశాలల డీన్ బాలగంగాధర్‌ను తిరుపతిలో అరెస్టు చేశారు.
నెల్లేపల్లి కేంద్రంగా ఏప్రిల్ 27న జరిగిన పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీసు వ్యవహారంలో నారాయణను మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రశ్నపత్రం వాట్సప్ గ్రూప్‌లో చక్కర్లు కొట్టడంపై చిత్తూరు డీఈవో ఫిర్యాదు చేయడంతో ఒకటో పట్టణ స్టేషన్‌లో కేసు నమోదైందన్నారు. పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ అభియోగాలపై నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసిన మాజీ మంత్రి నారాయణను..పోలీసులు చిత్తూరులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. గతరాత్రి పొద్దుపోయాక చిత్తూరు ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి నివాసంలో నారాయణను...హాజరుపరిచారు.
ఇదీ చదవండి: మాజీ మంత్రి నారాయణ అరెస్టు !
