సుందరనాయుడు చిత్రపటానికి చంద్రబాబు నివాళి

author img

By

Published : May 8, 2022, 5:38 PM IST

Updated : May 9, 2022, 6:04 AM IST

బాలాజీ హేచరీస్ అధినేత సుందరనాయుడుకు చంద్రబాబు నివాళి

తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ రైతుల కోసం బాలాజీ హేచరీస్ అధినేత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడు నిరంతరం శ్రమించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. చిత్తూరు రెడ్డిగుంటలోని సుందరనాయుడు స్వగృహంలో ఆయన శుభస్వీకరణ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

రాయలసీమలోని రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు డాక్టర్‌ సుందర నాయుడు చేసిన కృషి మరువలేనిదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన రాత్రింబవళ్లు పల్లెల్లో తిరిగి, రైతులను పౌల్ట్రీ రంగం వైపు మళ్లించారని తెలిపారు. అందుకే పౌల్ట్రీ అంటే సుందర నాయుడే గుర్తుకొస్తారని కొనియాడారు. అప్పట్లో విద్యార్థిగా ఉన్న తాను ఆయన స్ఫూర్తితో పౌల్ట్రీ పరిశ్రమను స్థాపించానని.. తర్వాత రాజకీయాల్లోకి రావడంతో ఈ రంగంలో కొనసాగలేకపోయానని చంద్రబాబు చెప్పారు. పౌల్ట్రీ రంగ దిగ్గజం, బాలాజీ హేచరీస్‌ అధినేత డాక్టర్‌ ఉప్పలపాటి సుందర నాయుడి శుభ స్వీకరణ కార్యక్రమం చిత్తూరులోని రెడ్డిగుంటలో ఆదివారం జరిగింది. సోదరుడి కుమారుడు వి.రమేష్‌ బాబు ఉత్తర క్రియలు నిర్వహించారు. చంద్రబాబు హాజరై సుందర నాయుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సతీమణి సుజీవన, కుమార్తెలు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌, నీరజ, అల్లుళ్లు ‘ఈనాడు’ ఎండీ కిరణ్‌, నవీన్‌, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుందర నాయుడితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘పది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో డాక్టర్‌ సుందర నాయుడు ప్రభుత్వోద్యోగం వదులుకుని ఈ రంగంలోకి వచ్చారు. అప్పట్లో రాయలసీమలో కరవు విలయ తాండవం చేసేది. ఉపాధి అవకాశాలు కొరవడి.. వలసలు ఎక్కువగా ఉండేవి. దీంతో పౌల్ట్రీ ద్వారా రైతులకు అదనపు ఆదాయం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని.. బీవీ రావుతో కలిసి దేశం మొత్తం పర్యటించి, పౌల్ట్రీ రంగాన్ని అభివృద్ధి చేశారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో కోలుకుంటారని భావించా. ఆయన మృతి బాధ కలిగించింది. ఆయనిచ్చిన స్ఫూర్తి రైతుల్లో ఎప్పటికీ ఉంటుంది. అన్నదాతలకు ఎనలేని సేవలు అందించారు. సాధారణ రైతు కంటే పౌల్ట్రీ రైతుకు మెరుగైన ఆదాయం వస్తుంది.. తద్వారా పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటారని సుందర నాయుడు ఆశించారు. ఆయన చూపిన మార్గాన్ని రైతులు అనుసరించాలి. పౌల్ట్రీ రైతులకు మేమంతా అండగా ఉంటాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

సుందరనాయుడు చిత్రపటానికి చంద్రబాబు నివాళి

ప్రముఖుల నివాళి
డాక్టర్‌ సుందర నాయుడి శుభ స్వీకరణ కార్యక్రమానికి కిమ్స్‌ ఛైర్మన్‌ బొల్లినేని కృష్ణయ్య, భారత్‌ బయోటెక్‌ డైరెక్టర్లు సాయిప్రసాద్‌, జలచరి, నూజివీడు సీడ్స్‌ ఛైర్మన్‌ మండవ ప్రభాకరరావు, అమరరాజా గ్రూప్‌ వ్యవస్థాపకులు గల్లా రామచంద్ర నాయుడు, రామోజీ ఫిల్మ్‌ సిటీ ఎండీలు ఎ.రామ్మోహన్‌రావు, విజయేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, అమరనాథరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, స్వర్ణభారత్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ దీపా వెంకట్‌, అమర ఆసుపత్రి ఎండీ రమాదేవి, పీఈఎస్‌ వ్యవస్థాపకుడు దొరస్వామి నాయుడు, తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సుగుణమ్మ, తెదేపా ప్రధాన కార్యదర్శి కిషోర్‌ కుమార్‌రెడ్డి, విశ్రాంత ఐఏఎస్‌ కృష్ణయ్య, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ వ్యాపారులు, రైతులు హాజరై నివాళులర్పించారు. పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి సుందర నాయుడు చేసిన కృషిని స్మరించుకున్నారు. ఆయనతో తనకు 30 ఏళ్ల పరిచయం ఉందని.. ఆయన పలకరించే విధానం, చూపించే ఆప్యాయత అందరి మనస్సుల్లో చిర స్థాయిగా నిలిచిపోతుందని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ గుర్తు చేసుకున్నారు. పౌల్ట్రీ రంగ అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని చెప్పారు.

....

"సుందరనాయుడు జీవితం అందరికీ ఆదర్శం. రాయలసీమ రైతులకు మేలు చేసేందుకు కోళ్ల పరిశ్రమ స్థాపించారు. వ్యవసాయంతో సమానంగా కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించారు. కోళ్ల రైతులకు సుందరనాయుడు ఎనలేని సేవలు అందించారు. రైతుల జీవన ప్రమాణాలు పెంచేందుకు సుందరనాయుడు కృషి చేశారు." - చంద్రబాబు, తెదేపా అధినేత

ఇవీ చూడండి

Last Updated :May 9, 2022, 6:04 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.