అమరావతిలో రింగ్‌రోడ్డే లేకపోతే.. నాపై కేసు ఎలా పెడతారు?: చంద్రబాబు

author img

By

Published : May 11, 2022, 9:48 PM IST

అమరావతిలో రింగ్‌రోడ్డే లేకపోతే నాపై కేసు ఎలా పెడతారు ?

ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చి వ్యవస్థలను నాశనం చేశారని సీఎం జగన్​పై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిలో రింగ్ రోడ్డే లేకుండా అక్రమాలకు పాల్పడ్డారని తనపై కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు.

అమరావతిలో రింగ్‌రోడ్డే లేకపోతే నాపై కేసు ఎలా పెడతారు ?

అమరావతిలో రింగ్ రోడ్డే లేకుండా అక్రమాలకు పాల్పడ్డారని తనపై కేసు ఎలా పెడతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే జగన్ జీవితాంతం జైలు పాలవ్వాల్సి వస్తోందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెట్టేందుకే మాజీమంత్రి నారాయణను అరెస్టు చేశారన్న ఆయన.. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు.. ప్రభుత్వంపై తీవ్రస్థాయలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చి వ్యవస్థలను నాశనం చేశారని ధ్వజమెత్తారు.

"నారాయణ, చైతన్య సంస్థల ద్వారా మంచి చదువు అందుతోంది. నారాయణ, చైతన్య లాంటి విద్యా సంస్థలను ప్రోత్సహించాలి. విద్యాసంస్థల బాధ్యతల నుంచి నారాయణ తప్పుకున్నారు. రాజకీయ కక్షతోనే మాజీమంత్రి నారాయణ అరెస్టు. 43 ఏళ్లు కష్టపడి విద్యాసంస్థలను నారాయణ నిర్మించారు. అమరావతిలో రింగ్‌రోడ్డే లేకపోతే నాపై కేసు ఎలా పెడతారు ?. సాగుకు మీటర్లు పెడితే అదే వైకాపా చివరి తప్పు అవుతోంది."- చంద్రబాబు, తెదేపా అధినేత

వైకాపా ప్రభుత్వంలో ఊరికో ఉన్మాది తయారవుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ పాలనలో దొంగలు యథేచ్ఛగా రోడ్లపైకి వచ్చి దోచుకుంటున్నారు. డబ్బుల సంచులతో కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలపైన అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తానికి రాష్ట్రం నుంచే గంజాయి సరఫరా అయ్యే పరిస్థితి వచ్చిందని అన్నారు. తన జీవితంలో సొంతానికి ఏమీ చేసుకోలేదని.., నిబద్ధతతో తన పని చేసుకుంటా వెళ్లానన్నారు.

"తెదేపా ప్రభుత్వంలో నిరంతరం విద్యుత్‌ ఇచ్చాం. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో మెరుగైన విద్యుత్‌ అందించవచ్చు. నిత్యావసర ధరల పెరుగుదలతో కుటుంబంపై రూ.10 వేలకు పైగా అదనపు భారం. నవరత్నాల కన్నా.. తెదేపా మంచి పథకాలను అమలు చేసింది. తెదేపా పరిపాలనలో ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ ద్వారా పట్టాలు ఇస్తున్నారు. తెదేపా అధికారంలోకి వస్తే కుప్పంకు హంద్రీనీవా నీటిని తీసుకువస్తా." -చంద్రబాబు, తెదేపా అధినేత

శ్రేణుల ఘన స్వాగతం: మూడ్రోజుల పర్యటన నిమిత్తం సాయంత్రం కుప్పం చేరుకున్న చంద్రబాబుకు తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. చంద్రబాబు రాకతో కుప్పం పరిసరాలు పసుపు జెండాలతో నిండిపోయాయి. ముందుగా బెళ్లకోగిలో చంద్రబాబు అరటిపంటను పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.