ZPTC-MPTC Results: పరిషత్ ఎన్నికల ఫలితాలు.. ఎవరికెన్ని స్థానాలంటే..!

author img

By

Published : Sep 19, 2021, 4:44 PM IST

Updated : Sep 19, 2021, 9:23 PM IST

ZPTC - MPTC Results

రాష్ట్రంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార వైకాపా హవా కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ... వైకాపా జెండా రెపరెపలాడింది. ప్రతిపక్ష తెలుగుదేశం ఎన్నికలను బహిష్కరించగా.. కొన్నిచోట్ల ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో అధికార వైకాపా పూర్తి ఆధిపత్యం కనబర్చింది.

రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 206 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టగా.. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో అధికార వైకాపా హవా కొనసాగింది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 678 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 66 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 590 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల్లో వైకాపా 376, తెలుగుదేశం 49, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలిచారు. విజయనగరం జిల్లాలో 549 ఎంపీటీసీ స్థానాల్లో 55 ఏకగ్రీవం కాగా, 487 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. వైకాపా 389, తెలుగుదేశం 86చోట్ల గెలుపొందాయి. విశాఖ జిల్లాలో 652 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 37 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 612 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఇప్పటివరకు వైకాపా 337, తెలుగుదేశం 82, భాజపా 4, స్వతంత్రులు 20 స్థానాల్లో విజయం సాధించారు.

తూర్పుగోదావరి జిల్లాలో 1086 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 82 ఏకగ్రీవమయ్యాయి. 999 చోట్ల ఎన్నికలు జరగ్గా.. ఇప్పటివరకూ వైకాపా 120, తెలుగుదేశం 30, జనసేన16 స్థానాలు గెలుచుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 863 ఎంపీటీసీ స్థానాలు ఉండగా..73 ఏకగ్రీవమయ్యాయి. 9 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. 13 స్థానాలు మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. 781 చోట్ల ఎన్నికలు జరగ్గా వైకాపా 550, తెలుగుదేశం 84, జనసేన 51, భాజపా 3, స్వతంత్రులు పది స్థానాలు కైవసం చేసుకున్నారు.

కృష్ణా జిల్లాలో మొత్తం 812 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 69 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 648 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ఇప్పటివరకూ వైకాపా 568, తెలుగుదేశం 63, జనసేన 9, బీఎస్పీ 2 స్థానాల్లో గెలుపొందాయి. గుంటూరు జిల్లాలో 862 ఎంపీటీసీ స్థానాలకు.. 226 ఎకగ్రీవమయ్యాయి. 571 స్థానాల్లోఎన్నికలు జరగ్గా, వైకాపా 485.., తెలుగుదేశం 54, జనసేన10 స్థానాల్లో గెలుపొందాయి. ప్రకాశం జిల్లాలో మొత్తం 742 ఎంపీటీసీలు ఉండగా.. 374 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 368 స్థానాల్లో.. 274 చోట్ల వైకాపా,. 22 స్థానాల్లో తెలుగుదేశం విజయం సాధించాయి. ఒకచోట కౌంటింగ్ నిలిపివేశారు. నెల్లూరు జిల్లాలో 554 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 188 ఎకగ్రీవమయ్యాయి. మిగిలిన 362 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఇప్పటివరకూ వైకాపా 292.., తెలుగుదేశం అభ్యర్థులు 27 చోట్ల గెలుపొందారు. భాజపా 2, సీపీఎం 2, జనసేన ఒకటి, ఇండిపెండెంట్లు 12 చోట్ల గెలుపొందారు.

సీమ జిల్లాల్లో వైకాపానే..

కర్నూలు జిల్లాలో 807 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 312 ఏకగ్రీవం అయ్యాయి. 11 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 484 స్థానాల్లో ఎన్నికల జరగ్గా వైకాపా 406, తెలుగుదేశం 62 భాజపా3, CPI 2, స్వతంత్రులు 11చోట్ల గెలుపొందారు. కడప జిల్లాలో 554 ఎంపీటీసీ స్థానాలుండగా... 432 ఏకగ్రీవమయ్యాయి. 117 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. వైకాపా 84, తెలుగుదేశం 10, భాజపా 4 స్థానాల్లో గెలిచాయి. చిత్తూరు జిల్లాలో 886 ఎంపీటీసీ స్థానాలకు.. 433 ఏకగ్రీవమయ్యాయి. 419 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఇప్పటి వరకూ 389 చోట్ల వైకాపా, 25 స్థానాల్లో.. తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందారు. అనంతపురం జిల్లాలో 841 స్థానాలుండగా..50 ఏకగ్రీవమయ్యాయి. 10 చోట్ల అభ్యర్థులు చనిపోయారు. 781 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా... ఇప్పటి వరకూ వైకాపా 694, తెలుగుదేశం 47, కాంగ్రెస్, భాజపా, సీపీఎం, సీపీఐ, జనసేన ఒక్కో చోట గెలిచాయి. 13 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు.

జడ్పీటీసీ ఫలితాలు ఇలా...

జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లోనూ.. అన్నిచోట్ల వైకాపా ఆధిక్యంలో కొనసాగుతోంది. అర్థరాత్రి దాటినా లెక్కింపు పూర్తి చేసి విజేతలను ప్రకటిస్తామని.. రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 38 ZPTC స్థానాలకు.. 37 చోట్ల ఎన్నికలు జరిగాయి.ఇప్పటివరకు 24 జడ్పీటీసీల్లో వైకాపా విజయం సాధించింది. విజయనగరం జిల్లాలో 34 స్థానాలుండగా... అందులో 3 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 31 స్థానాలకు ఎన్నికలు జరగ్గా..అన్ని స్థానాలనూ వైకాపా కైవసం చేసుకుంది. విశాఖ జిల్లాలో 39 జడ్పీటీసీలకు గానూ రోలుగుంట స్థానం ఏకగ్రీవం అయింది. ఆనందపురంలో తెలుగుదేశం అభ్యర్థి మృతితో ఎన్నిక వాయిదాపడింది. మిగిలిన 37 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా..వాటి లెక్కింపు కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో 61 స్థానాలకు.. ఎన్నికలు జరగ్గా, ఇప్పటివరకు 3 చోట్ల వైకాపా అభ్యర్థులు గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 48 జడ్పీటీసీ స్థానాలుండగా.. రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఒక స్థానంలో ఎన్నికలు ఆగిపోయాయి. ఎన్నికలు జరిగిన 45స్థానాల్లో.. 7 చోట్ల వైకాపా అభ్యర్థులు గెలుపొందగా మిగిలిన స్థానాల్లో లెక్కింపు కొనసాగుతోంది.

కృష్ణా జిల్లాలో మొత్తం 49 జడ్పీటీసీ స్థానాలకు రెండు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ కారణాలతో.. 2 చోట్ల ఎన్నికలు వాయిదాపడ్డాయి. 41 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా.. 40 జడ్పీటీసీలను వైకాపా కైవసం చేసుకుంది. ఒకచోట తెలుగుదేశం గెల్చింది. గుంటూరు జిల్లాలో మొత్తం 57 జడ్పీటీసీలు ఉండగా.. 54 చోట్ల పోలింగ్ కు నోటిఫికేషన్ జారీచేశారు. వాటిలో 8 ఏకగ్రీవం కాగా.. మిగతా స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో ఇప్పటివరకూ 40 చోట్ల వైకాపా విజయం సాధించింది. ప్రకాశం జిల్లాలో మొత్తం 56 స్థానాలుండగా.. 14 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలు జరిగిన 41 స్థానాల్లో 20 చోట్ల వైకాపా అభ్యర్థులు గెలుపొందగా.. మిగిలిన స్థానాల్లో లెక్కింపు కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో మొత్తం 46 జడ్పీటీసీ స్థానాలుండగా.. 12 ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలు జరిగిన 34 స్థానాల్లో.. ఇప్పటివరకూ 24 జడ్పీటీసీలను వైకాపా కైవసం చేసుకుంది.

కడప జిల్లాలో మొత్తం 50 జడ్పీటీసీ స్థానాలుండగా.. 38 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలు జరిగిన 12 జడ్పీటీసీల్లో.. ఇప్పటివరకు 6 చోట్ల వైకాపా, ఒకచోట తెలుగుదేశం విజయం సాధించాయి. చిత్తూరు జిల్లాలో మొత్తం 65 జడ్పీటీసీ స్ధానాలుండగా.. అందులో 30 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలు జరిగిన 33 స్థానాల్లో వైకాపా గెలుపొందింది. కర్నూలు జిల్లాలో 53 జడ్పీటీసీ స్థానాలకు 16 ఏకగ్రీవం అయ్యాయి. నంద్యాల జడ్పీటీసీ స్థానం అభ్యర్థి మరణించగా.. మిగిలిన 36 జడ్పీటీసీలకు ఎన్నికలు జరగ్గా..అన్నింటినీ వైకాపా కైవసం చేసుకుంది. అనంతపురం జిల్లాలో మొత్తం 63కు గాను.. 45 జడ్పీటీసీలను వైకాపా దక్కించుకుంది.

వైకాపా పక్షాన నిలబడ్డారు: మంత్రి పెద్దిరెడ్డి

'పరిషత్ ఎన్నికల్లో ప్రజలు వైకాపా పక్షాన నిలబడ్డారు. 51 శాతం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాది. వ్యూహం ప్రకారమే ముఖ్యమంత్రి జగన్‌పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవీ నేరవేర్చలేదు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను రెండున్నరేళ్లలోనే అమలు చేసి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సాధించని ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. సీఎం పరిపాలన ఈ ఎన్నికల్లో ప్రతిబింబించింది. ఈ ఫలితాలు తెదేపాతో పాటు ఇతర పార్టీలకు చెంపపెట్టులాంటివి ' - మంత్రి పెద్దిరెడ్డి

ఎన్నికల ఫలితాలే నిదర్శనం: సజ్జల

రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వసనీయతకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు (parishad elections results) నిదర్శనమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala ramakrishna reddy news) అన్నారు. సీఎం జగన్ రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన ఆశీస్సుల వల్లే ఈ తరహా ఫలితాలు వచ్చాయన్నారు. ప్రభుత్వం నిలకడతో కూడిన అభివృద్ధి, సంక్షేమం అందించగలిగితే ఫలితాలు ఎలా ఉంటాయో ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయన్నారు. సువర్ణ అక్షరాలతో నిలిచేలా ప్రజలు ప్రభుత్వానికి ఆశీస్సులు ఇచ్చారని, ప్రజల విశ్వాసాన్ని సీఎం జగన్ నిలుపుకున్నారన్నారని వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేసింది: అచ్చెన్నాయుడు

మరోవైపు ఫలితాలపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. పరిషత్‌ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైకాపా ఖూనీచేసిందని ఆరోపించారు. వైకాపా తీరు వల్లే పరిషత్‌ ఎన్నికలను తెదేపా బహిష్కరించిందని గుర్తు చేశారు. అధికార పార్టీకి అధికారులు, పోలీసులు సహకరించారని విమర్శించారు. ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే ధైర్యం జగన్‌కు ఉందా..? అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి

సొంత తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన హీరో విజయ్

Last Updated :Sep 19, 2021, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.