అంబరాన్నంటిన దీపావళి సంబరాలు - వీధుల్లో నరకాసుర వధ, విదేశాల్లోనూ తగ్గని జోరు

అంబరాన్నంటిన దీపావళి సంబరాలు - వీధుల్లో నరకాసుర వధ, విదేశాల్లోనూ తగ్గని జోరు
Diwali Celebrations 2023: దేశవ్యాప్తంగా దీపావళిని ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్నా, పెద్దా అందరూ కలిసి వేడుకలు చేసుకుంటున్నారు. పలుచోట్ల వీధుల్లో నరకాసురుని వధ నిర్వహించారు. విదేశాల్లో సైతం దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. ఎక్కడికి వెళ్లినా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను మరువకూడదంటూ ప్రవాసభారతీయులు లండన్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Diwali Celebrations 2023: చిన్నాపెద్దా అంతా కలిసి ఆనందంగా చేసుకునే వెలుగుల పండుగే దీపావళిని.. సంస్కృతి, సంప్రదాయాల మధ్య ప్రజలంతా సందడిగా చేసుకుంటున్నారు. ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ బాణసంచా దుకాణాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివెళ్లారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికి సరిపడా టపాకాయలను కొనుగోలు చేశారు. దీంతో దుకాణాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.
Diwali Celebrations in Prakasam District: ప్రకాశం జిల్లా మార్కాపురంలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు నరక చతుర్థి సందర్భంగా పట్టణంలో పలు వీధుల్లో నరకాసురుని వధ నిర్వహించారు. సంప్రదాయబద్దంగా రుక్మిణీ సత్యభామ అవతారంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఊరేగింపుగా వచ్చి నరకాసురున్ని వధించారు. పట్టణంలోని రాజాజీ వీధి, నాయుడు వీధిలో నరకాసురున్ని వధించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Diwali 2023: నరకాసుర వధ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుపుకునే దీపావళి పండుగను పురస్కరించుకొని పట్టణాల నుంచి పల్లెల వరకు మార్కెట్లలో సందడి నెలకొంది. గత రెండు రోజులుగా ఎండలు కాస్తుండటంతో.. దీపావళి మందు బాణసంచా కొనుగోలు పెరిగాయి. కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని.. ప్రతి సెంటర్లోను దీపావళి టపాకాయల షాపులు వెలిశాయి.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు అనుమతులు ఇవ్వడంతో ఈ ఏడాది షాపుల సంఖ్య భారీగా పెరిగాయి. అమ్మకాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని వ్యాపారులు చెబుతున్నారు. వెలుగులు విరజిమ్మే అగ్గిపెట్టెల నుంచి భారీ సౌండ్ వచ్చే 5000 వాలా వరకు ధరలు సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు కొనే స్థితిలో లేవని ప్రజలు అంటున్నారు.
Diwali 2023 Celebrations in London: ఏ దేశంలో ఉన్నా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను మరువకూడదని ప్రవాసభారతీయులు అన్నారు. లండన్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. "ఇండియన్ ఫ్రెండ్స ఇన్ లండన్" ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు బ్రెంట్వుడ్ నగరంలో కన్నులపండువగా చేశారు. కార్యక్రమానికి భారత సంతతికి చెందిన సుమారుగా 400 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి, భారతీయ వంటకాలు, తెలుగు సంప్రదాయ వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు.
చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అలరించాయి. అనంతరం అందరూ ఒక దగ్గరచేరి బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీనివాస డబ్బీరు.. మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా దీపావళి వేడుకలను లండన్లో భారతీయులందరితో కలిసి చేసుకోవటం సంతోష దాయకమన్నారు.
