ఇతర జిల్లాల్లో స్లాట్లు.. దివ్యాంగులకు పాట్లు

author img

By

Published : Jan 26, 2023, 12:19 PM IST

physical handicapped problems

Difficulty of Disabled Persons for Certification: వారంతా మరొకరి సాయం లేనిదే బయటకు వెళ్లలేరు. అలాంటి వారు ధ్రువీకరణ పత్రాల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించి.. బాధలు పడతున్నారు. గతంలో దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకునేలా స్లాట్లు కేటాయించే వారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ స్లాట్లు ఇస్తుండటంతో దివ్యాంగులు పాట్లు పడుతున్నారు.

Difficulty of Disabled Persons for Certification: దివ్యాంగ ధ్రువీకరణ పత్రం కోసం ప్రత్యేక అవసరాలు గల బాధితులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పత్రాలు అవసరమైన వారు ముందుగా మీ సేవా కేంద్రాలు లేదా స్థానిక గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా అర్జీ చేసుకున్న వారికి గతంలో సమీపంలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకునేలా స్లాట్లు కేటాయించే వారు. కొద్ది కాలంగా ఈ విధానంలో మార్పు చేయడం దివ్యాంగుల పాలిట శాపంగా మారింది. ఆన్‌లైన్‌లో రాష్ట్రంలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ స్లాటు కేటాయిస్తున్నారు. దీనివల్ల దివ్యాంగ ధ్రువీకరణ పత్రం, వైద్య పరీక్షల కోసం జిల్లాలు దాటి ప్రయాణించాల్సి వస్తోంది. మరొకరి సాయం లేనిదే బయటకు రాలేనివారు పత్రాల కోసం మైళ్ల కొద్దీ ప్రయాణించడం ఎంత కష్టమో ఆలోచించకుండా దూర ప్రాంతాల్లో స్లాట్లు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాపట్ల జిల్లా పర్చూరు సామాజిక ఆసుపత్రిలో బుధవారం నిర్వహించిన సదరం శిబిరానికి 15 మందిని కేటాయించారు. వీరిలో అత్యధికులు ఇతర జిల్లాలకు చెందినవారే కావడం గమనార్హం.

కాళ్లు పనిచేయడంలేదు: "ఐదేళ్లుగా కాళ్లు పనిచేయడంలేదు. వీల్‌ఛైర్‌ సాయంతో బయటకు వస్తున్నాను. దివ్యాంగ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా పర్చూరు ఆసుపత్రిలో స్లాటు కేటాయించారు. చిలకలూరిపేటలో ప్రభుత్వాసుపత్రి ఉన్నా ఇంత దూరం ఎందుకు కేటాయిస్తున్నారో అర్థం కావడంలేదు". - కరీముల్లా, పురుషోత్తమపట్నం, పల్నాడు జిల్లా

కరీముల్లా

దగ్గరలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా: "పక్షవాతం వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. ఆహారం తీసుకోవడం కష్టంగా ఉంది. వీల్‌చైర్‌లో ఇతరుల సాయంతోనే బయటకు రాగలను. మందులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నాను. ధ్రువీకరణ పత్రం ఉంటే దివ్యాంగ పింఛను వస్తుందనే ఆశతో దరఖాస్తు చేసుకున్నాను. మా గ్రామానికి దగ్గరలో ప్రభుత్వాసుపత్రులు ఉన్నా పర్చూరులో స్లాటు కేటాయించారు. కుటుంబ సభ్యుల సాయంతో ఇక్కడకు వచ్చాను. నాలాంటి వాళ్లు ఇంతదూరం రావడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించకపోవడం బాధాకరం". - వేల్పూరి వరదమ్మ, వట్టిచెరుకూరు గ్రామం, గుంటూరు జిల్లా

వంద కిలోమీటర్లు ప్రయాణించి: "చిన్నతనం నుంచి కాలు, చెయ్యి పని చేయడంలేదు. దివ్యాంగ ధ్రువీకరణ పత్రం కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం దక్కలేదు. ఇటీవల మీసేవా కేంద్రం ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోగా బాపట్ల జిల్లా పర్చూరు సామాజిక ఆసుపత్రిలో కేటాయించారు. వంద కిలోమీటర్లు ప్రయాణించి వచ్చాను. నడవలేని స్థితిలో ఉన్న నాకు ఇంత దూరం రావడం ఎంత కష్టంగా ఉందో చెప్పలేను". - పి.శ్రీనివాసరావు, ఓగూరు, కందుకూరు మండలం, నెల్లూరు జిల్లా

పి.శ్రీనివాసరావు



ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.