Action On Employees: సచివాలయ ఉద్యోగులపై కొరడా.. అనంతపురంలో మొదలైన చర్యలు

author img

By

Published : Jan 13, 2022, 6:55 AM IST

government action on village and ward secretariat employees

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అనంతపురం జిల్లాలో మొదలైన చర్యలు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2021 అక్టోబరు 2 నాటికి రెండేళ్లు పూర్తయినా ప్రొబేషన్‌ ఖరారు చేయకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు శని, ఆదివారాల్లో రోడ్లపైకి రావడం సంచలనమైంది.

Govt action on village and ward secretariat employees: తమ ఉద్యోగాలకు తక్షణమే ప్రొబేషన్‌, కన్ఫర్మేషన్‌ చేయాలని ఆందోళన చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విధులకు గైర్హాజరైన ఉద్యోగుల ఒకరోజు జీతాన్ని నిలిపేయాలని అనంతపురం జిల్లా రొద్దం ఎంపీడీవో సచివాలయాల డ్రాయింగ్‌, డిజ్బర్స్‌మెంట్‌ అధికారుల (డీడీవో)ను ఆదేశించారు. ఈమేరకు బుధవారం సర్క్యులర్‌ జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించి విధులకు గైర్హాజరైన ఉద్యోగులు 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని ఇదే జిల్లా కళ్యాణదుర్గం, ధర్మవరం పురపాలక సంఘాల కమిషనర్‌లు తాఖీదులిచ్చారు.

అనంతపురంలో చర్యలు..

అనంతపురం జిల్లాలో మొదలైన చర్యలు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2021 అక్టోబరు 2 నాటికి రెండేళ్లు పూర్తయినా ప్రొబేషన్‌ ఖరారు చేయకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు శని, ఆదివారాల్లో రోడ్లపైకి రావడం సంచలనమైంది. ప్రభుత్వం సైతం ఈ పరిణామాలను ఊహించలేదు. సీఎంవో ఆదేశాలతో గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ సచివాలయంలో సోమవారం సంబంధిత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ఉద్యోగాల నుంచి తొలగించబోమని భరోసా..

ఒకవైపు ఉద్యోగులను హెచ్చరిస్తూనే.. మరోవైపు బుజ్జగించే ప్రయత్నం చేశారు. తక్షణం విధుల్లో చేరితే జూన్‌ 30 కంటే ముందే ప్రొబేషన్‌ ఖరారు చేసేలా సీఎం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. ఎవర్నీ ఉద్యోగాల నుంచి తొలగించబోమని భరోసా ఇచ్చారు. దీంతో మంగళవారం నుంచి 85 శాతానికిపైగా ఉద్యోగులు విధులకు హాజరవుతూనే.. తమ డిమాండ్ల సాధనకు కొన్నిచోట్ల పెన్‌డౌన్‌ చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నినాదాలిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వినతులు అందిస్తున్నారు. ఉన్నతాధికారి హామీకి భిన్నంగా.. జిల్లా, మండల స్థాయి అధికారులు వీరిపై చర్యలకు సిద్ధమవ్వడం చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలివ్వలేదని ఉన్నతాధికారులు చెబుతున్నా.. జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) ఉత్తర్వుల మేరకు ఈనెల 10న బయోమెట్రిక్‌కు గైర్హాజరైన సచివాలయాల ఉద్యోగుల జీతాలను నిలిపేయాలని డీడీవోలను రొద్దం ఎంపీడీవో ఆదేశించారు. ఈ నెల 10న మండల వ్యాప్తంగా గైర్హాజరైన 127 మంది పేర్లను డీడీవోలకు పంపారు. ఎవరైనా జీతభత్యాలు చెల్లిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంబంధిత సమాచారాన్ని జాయింట్‌ కలెక్టర్‌, డీపీఓ, డివిజనల్‌ పంచాయతీ అధికారులకు తెలియజేశారు.

క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం

నిర్ణీత గడువులోగా తాఖీదులకు సమాధానం ఇవ్వకపోయినా, సమాధానం సంతృప్తికరంగా లేకపోయినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉద్యోగులకు జారీ చేస్తున్న తాఖీదుల్లో కళ్యాణదుర్గం పుర కమిషనర్‌ హెచ్చరించారు. ధర్మవరం పుర కమిషనర్‌ సైతం ఇదే తరహాలో 346 మందికి తాఖీదులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మతో గ్రామ సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ బుధవారం సచివాలయంలో సమావేశమైనట్లు తెలిసింది.

చర్యలు తీసుకోవాలని ఆదేశాల్విలేదు: అజయ్‌జైన్‌

విధులకు గైర్హాజరైన ఉద్యోగుల జీతాలను నిలిపివేసి, క్రమశిక్షణ చర్యలు కోవాలని జిల్లా అధికారులకు తాము ఎలాంటి ఆదేశాలివ్వలేదని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ స్పష్టంచేశారు. అనంతపురం జిల్లాలో అధికారులు ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం వాస్తవమైతే... పరిశీలించి వాటిని వెనక్కి తీసుకునేలా ఆదేశాలిస్తామమన్నారు.

‘స్పందన’ కాల్‌ సెంటర్‌కు ఫోన్లు

గ్రామ సచివాలయాల ఉద్యోగులు పలువురు బుధవారం ‘స్పందన’ కాల్‌ సెంటర్‌కు ఫోన్లు చేశారు. ప్రొబేషన్‌ను తక్షణం ఖరారు చేయాలన్న తమ వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సిబ్బందిని కోరారు. విధులకు హాజరై తమ సమస్యలను ఇతర రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చన్న అధికారుల సూచనతో ఎక్కువ మంది స్పందన కాల్‌సెంటర్‌ను వేదికగా చేసుకుంటున్నారు.

ఇదీ చదవండి:

Plots For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లను రిజర్వు చేస్తూ ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.