ఉద్యోగంలో జూనియర్.. అక్రమాల్లో సీనియర్.. ఏకంగా రూ.71 లక్షలు!

author img

By

Published : May 10, 2022, 5:35 PM IST

Updated : May 12, 2022, 7:41 AM IST

FRAUD

FRAUD: అనంతపురం జిల్లా ఉరవకొండ పంచాయతీ కార్యాలయంలో అక్రమాలు వెలుగు చూశాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ హరికృష్ణ రూ.71 లక్షలు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. చలానాల డబ్బు కాజేసినట్లు గుర్తించిన పంచాయతీ అధికారులు, హరికృష్ణకు మెమో జారీచేశారు. ఇప్పటివరకు అతడి నుంచి రూ.50 లక్షలు కట్టించుకున్నాారు. మిగతా రూ.21 లక్షలు ఇవ్వకుండానే జూనియర్‌ అసిస్టెంట్‌ హరికృష్ణ పరారయ్యాడు.

Employee Fraud: అనంతపురం జిల్లా ఉరవకొండ గ్రామ పంచాయతీలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. చిల్లర రూపంలో వసూలైన రూ.21.55 లక్షలు కాజేసిన వైనమిది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను పంచాయతీకి చిల్లర జమల రూపంలో రూ. 71.93లక్షల ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని బ్యాంకులో గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్​కు జమ చేయాల్సి ఉండగా.. దిగువశ్రేణి సహాయకుడు హరికృష్ణ రూ.50.38 లక్షలను చలానా రూపంలో ఈ ఏడాది మార్చి 29 వరకు వివిధ తేదీల్లో జమ చేశాడు. మిగిలిన రూ.21.55 లక్షలు జమ చేయలేదు. ఆ మొత్తాన్ని కూడా జమ చేయాలని పంచాయతీ అధికారులు సూచించినా అతను పట్టించుకోలేదు. చేసేదిలేక విషయాన్ని జిల్లా పంచాయతీ ఉన్నతాధికారులకు చేరవేశారు. దీనిపై ఇంచార్జ్ ఎంపీడీఓ ద్వారా ప్రాథమికంగా విచారణ చేయించగా.. ఆ మొత్తాన్ని ఉద్యోగి కాజేసినట్లు నిర్ధారణకు వచ్చారు. అతడిని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్రావు మంగళవారం రాత్రి సస్పెండ్ చేశారు.

ఎవరెవరి పాత్ర ఉందో..?: పంచాయతీ నిధులు కాజేసిన ఘటనలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో అనే చర్చ స్థానికంగా నడుస్తోంది. అయితే గతంలో ఇక్కడ పని చేసిన ఓ పారిశుద్ధ్య కార్మికుడి పాత్ర కీలకంగా ఉన్నట్లు తెలిసింది. అతను కార్మికుడిగా విధులు నిర్వర్తించకుండా.. ఉద్యోగులతో సమానంగా వ్యవహరిస్తూ, చిల్లర జమ వసూళ్లలో భాగస్వామిగా వ్యవహరించాడన్నది వాదన. జిల్లా పరిషత్​లో ఓ ఉన్నతాధికారి అండతోనే ఆ కార్మికుడు పంచాయతీలో తన ప్రభావాన్ని చూపాడని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పంచాయతీలో ఆదాయ వనరులకు సంబంధించిన అంశాలను ఆ ఉద్యోగికే అప్పగించాలని గతంలో కొందరు నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. వారికి కూడా వాటా అందిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉరవకొండ మేజర్ పంచాయతీ సంవత్సర ఆదాయం. సుమారు రూ.1.5 కోట్ల వరకు ఉంటుంది. వచ్చిన ఆదాయాన్ని ఉద్యోగులు ఎప్పటికప్పుడు బ్యాంకులో జమ చేస్తున్నారా? లేదా? చూడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని పలువురంటున్నారు.

పోలీసులకు ఫిర్యాదు: 2021-22 సంవత్సరానికి సంబంధించిన చలానా రూపంలో వచ్చిన నగదును ఉరవకొండ జూనియర్ అసిస్టెంట్ హరికృష్ణ తన వద్ద ఉంచుకొని ఇవ్వకుండా ఉండడంతో జిల్లా పంచాయతీ అధికారులకు పిర్యాదు చేశామని ఉరవకొండ ఇంచార్జ్ ఎంపీడీఓ దామోదర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్యామల తెలిపారు.. సోమవారంలోగా మొత్తం నగదు చెల్లిస్తామని చెప్పిన ఉద్యోగి.. ఆ రోజు నుండి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులకు పిర్యాదు చేశామన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :May 12, 2022, 7:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.