ఎస్సీల్లో చేర్చాలి.. బీసీ అయినా పర్వాలేదు..! వాగ్వాదం ఘర్షణగా మారి ఒకరు మృతి

author img

By

Published : Mar 5, 2023, 4:04 PM IST

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఉద్రిక్తత

fight for caste certificate : ఏళ్లనాటి సమస్యకు ప్రభుత్వం దారి చూపకపోవడంతో.. ఓ నిండు ప్రాణం బలైంది. కుల ధ్రువీకరణ విషయంలో అధికారుల సాగదీత ధోరణి కారణంగా అమాయక సంచార కుటుంబాల్లో చిచ్చు రేగింది. అన్నదమ్ముళ్లలా కలిసి మెలిసి జీవనం సాగించే ఆ రెండు జాతులు పరస్పర దాడులకు దిగగా.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

fight for caste certificate : అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సంచారజాతుల సామాజిక వర్గానికి చెందిన ఇరువర్గాల మధ్య కుల ధ్రువీకరణ పత్రం కోసం జరిగిన ఘర్షణలో జమ్మన్న మృతి చెందగా.. దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలని సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. మృతుడి తమ్ముడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా.. పోలీసులు పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు. ఆందోళన కారణంగా గాంధీచౌక్ వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా జంగాల కాలనీలో అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జమ్మన్న అంత్యక్రియల సందర్భంగా పోలీసులకు మృతుడి బంధువులకు మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట జరిగింది. జమ్మన్న మృతికి కారకులపై చట్ణపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు సర్ధిచెప్పడంతో సంచార జాతుల సంఘం నేతలు ఆందోళన విరమించారు.

గ్రామసభతో మొదలైన రగడ.. క్యాస్ట్ సర్టిఫికెట్ కేటాయించడానికి అధికారులు ఏర్పాటు చేసిన గ్రామసభ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. బాలసంతులు అనే 39 కుటుంబాలు కులం సర్టిఫికెట్ కోసం తాసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశాయి. ఆయా కులాల జాబితా విషయంలో వివాదం ఉండడంతో అధికారులు గ్రామసభ పెట్టారు. కులం విషయంలో రెండు వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా వివాదం రాజుకుంది. మాటా మాటా పెరిగి దాడికి దారితీసింది. తీవ్ర ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

అధికారుల సమక్షంలోనే.. పట్టణంలోని జంగాల కాలనీలో నివాసం ఉండే ఓ వర్గానికి చెందిన కొంతమంది కులం సర్టిఫికెట్ కోసం ఎమ్మార్వో ఆఫీస్ లో అర్జీ పెట్టుకున్నారు. అయితే, బుడగ జంగమ తెగకు సంబంధించిన దానిలో బేడ బుడగ జంగమ, బాల సంతు అనే రెండు వర్గాలు ఉండగా గతంలో బుడగ జంగమలను ఎస్సీల జాబితాలో చేర్చగా.. దీనిపై వివాదం నెలకొని ప్రభుత్వం ప్రస్తుతానికి నిలిపివేసింది. అయితే బాల సంతు అనే తెగకు మాత్రం బీసీ ఏ గా ప్రభుత్వం నిర్దేశించింది. సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు తమది బాల సంతు తెగకు చెందిన వర్గమని తమను బీసీఏలో చేర్చాలంటూ ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఈ విషయంపై వివాదం ఉన్న నేపథ్యాన తాసిల్దార్ సహా రెవెన్యూ అధికారులు శనివారం సాయంత్రం జంగాల కాలనీకి ఎంక్వయిరీ కోసం వెళ్లారు. కులం సర్టిఫికెట్ కోసం అర్జీ పెట్టుకున్న విషయమై గ్రామ సభ నిర్వహించారు.

ఎస్సీలుగానే కొనసాగుతామని.. జంగాల కాలనీలో ఉండే ఒక వర్గం.. తాము ఎస్సీల జాబితాలో మాత్రమే చేర్చాలని ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించామని తహసీల్దార్ సమక్షంలో చెప్పారు. ఆ విషయాలను పక్కన పెట్టి.. బీసీ ఏ జాబితాలోకి ఎలా వెళ్తారని ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారితో వాగ్వివాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరగడంతో చివరకు తీవ్ర ఘర్షణ వాతావరణానికి దారితీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో జమ్మన్న అనే వ్యక్తి మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బాల సంతు కులానికి చెందిన దాదాపు 39కుటుంబాలు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఫీల్డ్ ఎంక్వయిరీ కోసం గ్రామసభ ఏర్పాటు చేసి సమాచారు ఇచ్చాం. అప్పటికే గ్రామసభ ఏర్పాటు చేసిన గుడి దగ్గర చాలా కుటుంబాలు గుమికూడి ఉన్నాయి. మేం సభ ప్రారంభించిన ఐదు నిమిషాల్లోనే వివాదం మొదలై పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. - మహబూబ్ బాషా, తహసీల్దార్, గుత్తి

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఉద్రిక్తత

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.