ATTACK: అనంతపురం, కడపలో గ్రామ సచివాలయ ఉద్యోగులపై దాడి

author img

By

Published : Oct 18, 2021, 4:51 PM IST

attack on gram sachivalayam employess at ananthapur and kadapa

వివిధ కారణాలతో అనంతపురం, కడప జిల్లాల్లోని గ్రామ సచివాలయ ఉద్యోగులపై.. పలువురు దాడికి పాల్పడ్డారు. తమపై దాడి చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని.. బాధితులు డిమాండ్ చేశారు.

తాను చెప్పినట్టు వినలేదని అనంతపురం జిల్లాలోని సచివాలయ ఉద్యోగిపై.. వైకాపా నేత చెన్నారెడ్డి దాడికి పాల్పడ్డాడు. దీనిపై సచివాలయ సంక్షేమ కార్యదర్శి రమేష్.. రెండో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

అనంతపురంలోని హమాలి కాలనీలోని 44వ వార్డులోని సచివాలయంలో.. సంక్షేమ కార్యదర్శిగా రమేష్ విధులు నిర్వహిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన షాహిద్ బేగం అనే మహిళ.. వైయస్సార్ చేదోడు పథకం కింద.. టైలర్​ షాపు ఉన్నట్లు పథకానికి అమలు చేయాలని ఒత్తిడి తెచ్చింది. 26వ డివిజన్ కార్పొరేటర్ మీనాక్షి, కుమారుడు నాగార్జున రెడ్డి సహా కొంతమంది వైకాపా నేతలు.. ఇదే విషయమై తనపై ఒత్తిడి తెచ్చారని బాధితుడు తెలిపాడు.

అనంతపురంలో సచివాలయ ఉద్యోగిపై వైకాపా నేత దాడి

షాహిద్ బేగం అనే మహిళకు కుట్టు మిషన్ దుకాణం లేకుండా.. ఒక జిరాక్స్ సెంటర్​లో దుకాణం ఉన్నట్లు ఫోటో తీసి అమలు చేయాలని వైకాపా నేతలు తనను బెదిరించినట్లు రమేష్ తెలిపాడు. షాహిద్ బేగంకు పథకం అమలు చేయాలని.. పలువురు వైకాపా నేతలు హెచ్చరించినట్లు బాధితుడు వాపోయాడు. వారు చెప్పిన విధంగా తాను చేయకపోవడంతోనే.. తనపై దాడి చేశారని ఆవేదన చెందాడు. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వారిపై.. వైకాపా నేతలు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. పై అధికారులు సైతం వారికి మద్దతు పలుకుతున్నారని.. దీనిపై స్థానిక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించాలని బాధితుడు కోరారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు.

కడప జిల్లా ప్రొద్దుటూరులో మరో ఘటన
కడప జిల్లా ప్రొద్దుటూరులో సచివాలయం అడ్మిన్‌ కార్యదర్శి ఇషాక్‌బాబుపై.. వాలంటీర్‌ రామాంజనేయులు మరికొందరితో కలిసి దాడి చేశారు. ఫీవర్ సర్వేపై ప్రశ్నించినందుకు.. వాలంటీర్ రామాంజనేయులు దాడి చేసినట్లు ఇషాక్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

'ప్రభుత్వమే యువతను మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.