అయ్యన్నపై అక్కసు.. 300 మంది పోలీసుల మోహరింపు.. రోజంతా ఉద్రిక్తత

author img

By

Published : Jun 20, 2022, 3:54 AM IST

tdp leader ayyanna patrudu house demolistion full details

తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహారీ కూల్చివేత నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తెల్లవారుజామున నోటీసులివ్వకుండా ఇంటి గోడను కూల్చేయడంపై అయ్యన్న కుటుంబసభ్యులు, తెదేపా నేతలు కక్ష సాధింపులంటూ మండిపడ్డారు. బీసీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అయ్యన్న ఇంటి జోలికి వెళ్లవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆదివారం తెల్లవారుజామున 4 గంటలు.. ప్రజలంతా ఇంకా నిద్రమత్తులోనే ఉన్నారు.. అదే సమయంలో ఆక్రమణల కూల్చివేత అంటూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పురపాలక, రెవెన్యూ అధికారులు రెండు పొక్లెయిన్‌లతో నేరుగా తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటిపైకి దూసుకొచ్చారు. మాటమాత్రమైనా యజమానికి చెప్పకుండా ఇంటి వెనుక ప్రహరీని కూల్చివేయడం మొదలుపెట్టారు. అయ్యన్న భార్య పద్మావతి వచ్చి కూల్చివేత ఆపాలని కోరినా అధికారులు ఆగలేదు. తర్వాత ఆయన కుమారుడు రావడం, తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో కూల్చివేత ప్రక్రియ తాత్కాలికంగా నిలిచింది. నర్సీపట్నంలోని సర్వే నంబరు 276ఎలో 0.02 ఎకరాల (2 సెంట్ల)ను చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు రాజేష్‌ ఆక్రమించినట్లు స్థానిక తహసీల్దారు జయ నోటీసిచ్చారు. నిషేధిత భూమి (పంట కాలువ)లో పక్కా భవనం నిర్మించుకున్నారంటూ అందులో పేర్కొన్నారు. ఆ నోటీసును 2వ తేదీనే ఇచ్చామని తహసీల్దార్‌ చెబుతున్నారు. శనివారం రాత్రే నోటీసు తెచ్చి గోడకు అతికించారని, తమకు మాటమాత్రమైనా చెప్పకుండా కూల్చివేతలు మొదలుపెట్టారని అయ్యన్న కుటుంబం మండిపడింది. నిబంధనల మేరకు ఇల్లు కట్టామని, ప్రభుత్వ సర్వేయర్లతో సర్వే చేయించాలని డిమాండ్‌ చేసింది. దీంతో అధికారులు సర్వే ప్రారంభించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు సాగిన ఈ తతంగం నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. 300 మంది పోలీసులను మోహరించడం, తెదేపా శ్రేణులూ పెద్ద ఎత్తున రావడంతో వాగ్వాదాలు, తోపులాటలతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే అయ్యన్న ఇంటిపై చీకటి దాడులకు దిగారని తెదేపా మండిపడింది. బీసీలపై దాడులు, హత్యలకు నిరసనగా నేడు ‘చలో నర్సీపట్నం’కు పిలుపునిచ్చింది.

.

నర్సీపట్నంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకల్లా స్థానిక ఐదురోడ్ల కూడలి, శివపురం ప్రాంతాల్లో పోలీసులు రోడ్డుకు అడ్డుగా బారికేడ్లు ఉంచారు. వచ్చేపోయేవారిని ఆపి ఎక్కడకు వెళ్తున్నారంటూ ఆరా తీశారు. అప్పటికే పట్టణంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అదే సమయానికి రెండు పొక్లెయిన్లతో అధికారులు అయ్యన్నపాత్రుడి ఇంటి వెనుకకు చేరుకున్నారు. పురపాలక సంఘం పొక్లెయిన్‌తో ఇంటి వెనుక వంటగది ప్రదేశంలో ప్రహరీ కూల్చడం మొదలుపెట్టారు. శబ్దానికి వంటమనిషి లోవ నిద్రలేచి ఇదేంటని ప్రశ్నించగా మహిళా పోలీసులు ఆమెను దూరంగా తీసుకుపోయారు. చుట్టుపక్కల వారు ఫోన్‌ చేయడంతో అయ్యన్న సతీమణి పద్మావతి బయటకు వచ్చారు. కూల్చివేతను ఆపాలని ఆమె కోరినా అధికారులు పట్టించుకోలేదు. సమాచారం తెలియగానే విశాఖలో ఉన్న అయ్యన్న కుమారుడు రాజేష్‌ హుటాహుటిన నర్సీపట్నం వచ్చారు. తమ ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయని, ముందుగా నోటీసు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని మున్సిపల్‌ కమిషనర్‌ కనకారావును ప్రశ్నించారు. అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఆక్రమణ అంటూ మార్కింగ్‌ వేశారని ఆరోపించారు. మున్సిపాలిటీ పొక్లెయిన్‌తో కొంతమేర ప్రహరీని కూల్చిన తర్వాత అధికారులు దాన్ని పంపేశారు. ప్రైవేటు పొక్లెయిన్‌ను తీసుకువచ్చినా.. అయ్యన్న ఇంటి గోడను కూల్చేందుకు అని తెలిసి డ్రైవర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కూల్చివేతలు తాత్కాలికంగా ఆగాయి. పోలీసులు దగ్గరుండి కూల్చివేతలు కొనసాగించడమేమిటని రాజేష్‌ నిలదీశారు. అధికారులు బందోబస్తు కోరినందునే వచ్చామని ఏఎస్పీ విజయ్‌ మణికంఠ జవాబిచ్చారు.

.

నక్సలైట్లమా? గంజాయి స్మగ్లర్లమా: చింతకాయల విజయ్‌
మరోవైపు అయ్యన్న పెద్ద కుమారుడు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ ఉదయం 8 గంటల సమయంలో నర్సీపట్నం చేరుకున్నారు. ఇంటి నిర్మాణానికి అనుమతులన్నీ ఉన్నాయంటూ పత్రాలను మీడియాకు చూపారు. నక్సలైట్ల ఏరివేతకు, గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడానికి వచ్చినట్లు పోలీసు బలగాలను తమ ఇంటి వద్ద మోహరించడమేంటని మండిపడ్డారు. బీసీలను అణగదొక్కేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుణ్ని ఏమీ చేయలేక ఇలాంటి దుశ్చర్యలకు తెగబడ్డారని ఆరోపించారు. ‘ముందుగా నోటీసు ఇవ్వలేదు. అప్పటికప్పుడు తెచ్చి ఇంట్లోకి విసిరేశారు. మా పరువు తీసిన అధికారులపై న్యాయస్థానంలో కేసు వేస్తాను’ అని పేర్కొన్నారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ మంత్రి కోండ్రు మురళి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు మధ్యాహ్న సమయంలో అయ్యన్న ఇంటికి చేరుకున్నారు.

.

సర్వే చేయించండి.. ఆక్రమణ ఉంటే మేమే తొలగిస్తాం
ఈలోగా ఆర్డీవో గోవిందరావుతో రాజేష్‌ మాట్లాడారు. ‘ప్రభుత్వ సర్వేయర్ల చేత సర్వే చేయించండి. ఏ మాత్రం ఆక్రమణ ఉందని తేలినా మేమే తొలగిస్తాం’ అని అడిగారు. దీంతో ఆర్డీవో పది మంది సర్వేయర్లను రప్పించారు. వారంతా ఇంటి చుట్టూ సర్వే చేస్తుండగా బయట ఉన్న తెదేపా కార్యకర్తలు అడ్డగించి, ఓ సర్వేయర్‌ వద్ద కాగితాలు లాక్కున్నారు. ఫొటోలు తీస్తున్న ఇంటెలిజెన్స్‌ ఉద్యోగిని అడ్డుకున్నారు. వెంటనే తెదేపా నాయకులు ఆ కాగితాలను తిరిగి రెవెన్యూ సిబ్బందికి అందజేశారు. ఆ సమయంలో పోలీసులు రావడంతో తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కార్యకర్తలు అయ్యన్న ఇంటి ఎదుట రహదారిపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. చింతకాయల విజయ్‌ వారిని శాంతింపజేశారు. పోలీసు బలగాలను ఉపసంహరించాలని తెదేపా జిల్లా నాయకులు కోరడంతో కొన్ని బలగాలను వెనక్కు పంపేశారు. సర్వే పనులు సోమవారం ఉదయం కొనసాగించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు.

.
.

గొంతునొక్కే ప్రయత్నం: అయ్యన్న సతీమణి పద్మావతి

అయ్యన్న సతీమణి పద్మావతి

ఇది అయ్యన్నపాత్రుడి గొంతు నొక్కే ప్రయత్నమే అని ఆయన సతీమణి పద్మావతి పేర్కొన్నారు. ‘ప్రహరీ కూల్చివేతకు ఒక్క నిమిషం ముందైనా అధికారులు మాకు నోటీసు ఇవ్వలేదు. ఎవరూ చూడకుండా గోడకు అతికించారు. నేనూ, మా చిన్నబ్బాయి రాజేష్‌ నర్సీపట్నం పురపాలక సంఘంలో కౌన్సిలర్లుగా ఉన్నాం. తరచూ కమిషనర్‌ను కలుస్తుంటాం. ఏనాడూ ఆక్రమణ ఉందని చెప్పలేదు. కక్షపూరితంగా తెల్లవారుజామున వచ్చి ప్రహరీ కూల్చేశారు. పాలు కూడా తెచ్చుకోనివ్వలేదు. పనిమనిషిని నిర్బంధించారు. మమ్మల్ని ఇంట్లో బంధించినట్లు చేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులే తప్పు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై న్యాయస్థానానికి వెళ్తామని స్పష్టం చేశారు.

.

2నే నోటీసు ఇచ్చాం: తహసీల్దారు
నర్సీపట్నం తహసీల్దారు జయతో ‘న్యూస్‌టుడే’ మాట్లాడగా.. నెల రోజుల కిందట రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఈ ఆక్రమణపై ఫిర్యాదు వచ్చిందన్నారు. విచారణ జరిపి ఇంటి నిర్మాణంలో ఆక్రమణ ఉన్నట్లు ఈ నెల 2న చింతకాయల రాజేష్‌కు నోటీసు ఇచ్చామన్నారు. వారు స్పందించకపోవడంతో నిబంధనల ప్రకారం 15 రోజుల తర్వాత (ఈ నెల 17న) ఆక్రమణను తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆ మేరకే ఆదివారం ప్రహరీ కూల్చివేతకు సిబ్బంది ఉపక్రమించారని చెప్పారు.

ఆక్రమణ కాబట్టే కూల్చారు: మంత్రి అమర్‌నాథ్‌
తిరుమల, శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్‌లు అనవసర రాద్ధాంతాలను మానుకోవాలని మంత్రి అమర్‌నాథ్‌ సూచించారు. మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో రెండు సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి అధికారులు నోటీసులిచ్చారని తెలిపారు. ప్రభుత్వ స్థలం కావడంతోనే నిర్మాణాన్ని కూల్చారని, అది సక్రమమైతే ఆధారాలు చూపించాలని అన్నారు.

12 మంది ఎస్సైలు.. 300 మంది సిబ్బంది

ఒక ఏఎస్పీ, అదనపు ఎస్పీ (క్రైం), ట్రైనీ ఐపీఎస్‌, డీఎస్పీ, నలుగురు సీఐలు, 12 మంది ఎస్సైలు, 300 మంది సిబ్బంది, సచివాలయాల్లోని మహిళా పోలీసులు, ఓ వజ్ర వ్యాన్‌. ఇవన్నీ అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీ కూల్చివేత వేళ బందోబస్తు ఏర్పాట్లు. అనకాపల్లితో పాటు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల నుంచి అదనంగా సిబ్బందిని రప్పించి మరీ మోహరించారు. ఈ భారీ పటాలాన్ని చూసి ప్రజలంతా అయ్యన్నను అరెస్టు చేసేందుకే పోలీసులు మోహరించారని, ఆయన ఇంట్లోకి ప్రవేశించేందుకే వెనుక గోడ పగలగొడుతున్నారని అనుమానించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.