నర్సీపట్నంలో రహదారి విస్తరణ 120 అడుగులకు పెంచాలని ర్యాలీ
Published: Mar 16, 2023, 4:39 PM


నర్సీపట్నంలో రహదారి విస్తరణ 120 అడుగులకు పెంచాలని ర్యాలీ
Published: Mar 16, 2023, 4:39 PM
NARSIPATNAM ROAD EXPANSION: నర్సీపట్నంలో ప్రధాన రహదారి విస్తరణ పనులకు మద్దతుగా ప్రజా సంఘాలు భారీ ర్యాలీలు నిర్వహించాయి. 100 అడుగుల మేరకు రోడ్డు విస్తరణ చేపట్టాలని ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో 20 రోజుల నుంచి దీనిపై అధికారులు సర్వే చేస్తున్నారు. అయితే రహదారి విస్తరణ 100 అడుగుల నుంచి 120 అడుగులకు పెంచాలంటూ 'నర్సీపట్నం అభివృద్ధి కమిటీ' పేరుతో ఈ ర్యాలీలను నిర్వహించారు.
NARSIPATNAM ROAD EXPANSION: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రధాన రహదారి విస్తరణ పనులు చేపట్టాలని 'నర్సీపట్నం అభివృద్ధి కమిటీ' ఆధ్వర్యంలో ప్రజాసంఘాలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. ముందుగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ఈ ర్యాలీ మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి మొదలుకొని ఆర్డీఓ కార్యాలయం, ఆర్టీసీ కాంప్లెక్స్, శ్రీ కన్య కూడలి మీదుగా పెద్ద బొడ్డేపల్లికి చేరుకుంది.
నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి కల్వర్టు నుంచి పట్టణంలోని అబీద్ సెంటర్ వరకు ఇరువైపులా వంద అడుగుల రహదారి విస్తరణకు ఇటీవలే ప్రభుత్వ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సుమారు 16 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత 20 రోజుల నుంచి పట్టణంలో మున్సిపాలిటీ సిబ్బంది సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా రహదారులకు ఆనుకుని ఉన్న గృహ, వాణిజ్య సముదాయాల యజమానులకు ముందుగా నోటీసులను జారీ చేశారు.
రాత్రివేళల్లో మార్కింగ్ చేస్తూ యజమానులకు నోటీసులు అందజేయడం వల్ల రహదారి విస్తరణ విషయం చర్చనీయాంశమైంది. విస్తరణకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం నర్సీపట్నం పర్యటనకు హాజరై శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. విస్తరణ పనులకు మరో పక్క మున్సిపాలిటీ సిబ్బంది ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో రహదారికి ఇరువైపులా ఉన్న వర్తకులు, చిరు వ్యాపారులు, గృహ యజమానులంతా రెండు రోజుల క్రితమే పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు.
'60 అడుగులు ముద్దు, 100 అడుగుల వద్దు' అంటూ వ్యాపారులంతా కలిసి ఆర్డీవో కార్యాలయానికి, మున్సిపల్ కార్యాలయానికి వినతి పత్రాలను అందజేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా 'నర్సీపట్నం అభివృద్ధి కమిటీ' అనే పేరుతో నర్సీపట్నంలో రహదారి విస్తరణ చేపట్టాలంటూ మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. అయితే వీరు '120 అడుగులు ముద్దు, 100 అడుగులు వద్దు' అంటూ నినాదాలతో పట్టణంలో ర్యాలీ కొనసాగించారు. ఈ ర్యాలీలో అధికార పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు కొంతమంది వ్యాపారులు, వైసీపీ నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అయితే 'నర్సీపట్నం అభివృద్ధి కమిటీ'లో అధికార పార్టీ నేతలు పాల్గొనడంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఇవీ చదవండి:
