ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో యథేచ్ఛగా గంజాయి అక్రమ రవాణా

author img

By

Published : Mar 16, 2023, 4:25 PM IST

Smuggling of Ganja

Ganja Smugglers Arrested: ఒడిశా నుంచి అక్రమంగా ఇత‌ర రాష్ట్రాల‌కు త‌ర‌లిస్తున్న గంజాయిని అల్లూరి జిల్లా చింత‌ప‌ల్లి మండలం పెంటపాటు వద్ద పోలీసులు పట్టుకున్నారు. 3 కోట్ల రూపాయల విలువైన.. 17 వందల కేజీల ప్యాకింగ్ చేసిన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Illegal Smuggling of Ganja: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాలలో యథేచ్ఛగా గంజాయి అక్రమ రవాణా సాగుతోంది. తాజాగా ఒడిశా నుంచి అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న గంజాయిని భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి జిల్లా చింతపల్లి పోలీసులు.. గంజాయిని పట్టుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ తుహీన్ సిన్హా, చింత‌ప‌ల్లి ఏఎస్పీ కేపీఎస్ కిశోర్ తెలిపారు.

ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు చింతపల్లి మీదుగా గంజాయిని రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో.. సిబ్బందితో కలసి చింతపల్లి ఎస్​ఐ అరుణ్ కిర‌ణ్‌ తనిఖీలు నిర్వహించారు. చింతపల్లి మండలం పెంటపాడు జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఓ వాహనంలోని ముగ్గురు వ్యక్తులు వెంటనే దిగి పోరిపోవడం పోలీసులు గమనించారు. పారిపోతున్న వారిని వెంబడించి పట్టుకున్నారు. వారు వదిలి వెళ్లిపోతున్న వాహనం తనిఖీ చేయగా.. వాహనంలో బియ్యం బస్తాలు మాటున భారీ మొత్తంలో రవాణా చేస్తున్న గంజాయి దొరికింది. ఇది సుమారు 1700 కేజీలు అని పోలీసులు తెలిపారు.

ఈ గంజాయిని ఒడిశాలోని సీతారాం అనే వ్యక్తి, అతని స్నేహితుడు కలసి మహారాష్ట్రకు చెందిన గంజాయి వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్లు.. పోలీసులకు పట్టుబడ్డ వాహనం డ్రైవర్ ఫేకు యాదవ్, రవీంద్రయాదవ్ తెలిపారు. వీరితో పాటు గంజాయిని సరఫరా చేస్తున్న సీతారాం కూడా ఇదే వాహనంలో ప్రయాణిస్తున్నాడు.

దీంతో వీరిని అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ తుహీర్ సిన్హా తెలిపారు. గంజాయి సరఫరా చేస్తున్నట్లు ముందుగానే తెలుసుకున్న చింతపల్లి ఎస్​ఐ అరుణ్ కిర‌ణ్‌, సీఐ ర‌మేష్​ను.. జిల్లా ఎస్పీ స‌తీష్‌కుమార్ అభినందించారు. అదేవిధంగా నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన ఇతర పోలీసు సిబ్బందిని కూడా ఎస్పీ అభినందించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని తెలిపారు.

కాగా ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల గంజాయిని సరఫరా చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. 2021 సంవత్సరంలో రాష్ట్రంలో పట్టుకున్నంత గంజాయి.. మరే ఇతర రాష్ట్రంలోనూ దొరకలేదని నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో పేర్కొంది. దేశవ్యాప్తంగా 7 లక్షల 49 వేల కిలోల గంజాయిను పట్టుకుంటే.. అందులో మన రాష్ట్రంలోనే 2 లక్షల కిలోల గంజాయిని పట్టుకున్నారు. విశాఖపట్నం మన్యంలో గంజాయి సాగును మొత్తం ధ్వంసం చేశామని, నిర్మూలించామని పోలీసులు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తోంది.

ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతాల నుంచి మన రాష్ట్రంలోకి గంజాయి భారీగా సరఫరా అవుతోంది. దీన్ని పోలీసులు పూర్తి స్థాయిలో అదుపు చేయలేకపోతున్నారు. అదేవిధంగా పట్టణాలు, వివిధ నగరాల్లో గంజాయిని.. పలువురు బ్యాచ్‌లుగా ఏర్పడి విక్రయిస్తున్నారు. ఈ గంజాయి పలు అక్రమాలకు, నేరాలకు కారణం అవుతుంది. దీంతో గంజాయి మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.