ఫాస్టెస్ట్​ 150 స్కోరు.. బట్లర్​ జస్ట్​ మిస్​.. టాప్​-5లో ఎవరెవరు?

author img

By

Published : Jun 18, 2022, 1:37 PM IST

Updated : Jun 18, 2022, 2:30 PM IST

Fastest 150

Jos buttler 150 plus score: వన్డే క్రికెట్‌లో ఎవరైనా సెంచరీలు కొట్టడం సాధారణ విషయమే. అదే 150 పరుగులు చేయడం.. అంత పెద్ద స్కోరును కూడా అతి తక్కువ బంతుల్లోనే సాధించడం గొప్ప విశేషం. శుక్రవారం నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ అదేపని చేశాడు. కేవలం 65 బంతుల్లోనే 150 పరుగులు చేసి త్రుటిలో ప్రపంచ రికార్డును మిస్‌ చేసుకున్నాడు. అయితే తక్కువ బంతుల్లో 150 స్కోరును చేసిన ఆటగాళ్లెవరో తెలుసుకుందాం..

Jos buttler 150 plus score: శుక్రవారం నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌.. కేవలం 65 బంతుల్లోనే 150 పరుగులు చేసి త్రుటిలో ప్రపంచ రికార్డును మిస్‌ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తక్కువ బంతుల్లో 150 స్కోరును చేసిన ఆటగాళ్లెవరో తెలుసుకుందాం..

ఏబీ డివిలియర్స్‌ నంబర్‌ వన్‌.. వన్డే క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 150 స్కోర్‌ సాధించిన ఆటగాడు ఏబీ డివిలియర్స్‌. ఈ దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్‌ 2015 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో ఆడిన గ్రూప్‌ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. కేవలం 64 బంతుల్లోనే 150 పరుగులు చేసిన మిస్టర్‌ 360 అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 408/5 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఏబీ (162 నాటౌట్‌; 66 బంతుల్లో 17x4, 8x6) వీర విహారం చేశాడు. స్ట్రైక్‌రేట్‌ 245.45గా నమోదు చేశాడు. దీంతో వన్డే క్రికెట్‌లో వేగవంతమైన 150 స్కోర్‌ సాధించిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు.

బట్లర్‌ సొంత రికార్డు బద్దలు.. ఇక నెదర్లాండ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో బట్లర్‌ 65 బంతుల్లో 150 పరుగులు సాధించి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే తన పాత రికార్డును తానే బద్దలుకొట్టుకున్నాడు. 2019లో వెస్టిండీస్‌తో ఆడిన ఓ మ్యాచ్‌లో బట్లర్‌ (150; 77 బంతుల్లో 13x4, 12x6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అప్పుడు 76 బంతుల్లో 150 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్‌ 194.80గా నమోదైంది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 418/6 భారీస్కోర్‌ చేసింది. దీంతో ఏబీడి తర్వాత తక్కువ బంతుల్లో 150 స్కోర్‌ సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇక తాజా మ్యాచ్‌లో 65 బంతుల్లోనే ఈ ఘనత సాధించి తన పాత రికార్డును అధిగమించాడు. అయితే, ఇంకో రెండు తక్కువ బంతుల్లోనే 150 పరుగులు సాధించి ఉంటే ఏబీడీని కూడా అధిగమించి కొత్త చరిత్ర సృష్టించేవాడు. త్రుటిలో ఆ అవకాశాన్ని కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో బట్లర్‌ (162 నాటౌట్‌; 70 బంతుల్లో 7×4, 14×6) దంచికొట్టడంతో ఇంగ్లాండ్‌ 498/5 స్కోర్‌ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించడం విశేషం.

డివిలియర్స్‌ వచ్చేవరకు వాట్సన్‌.. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ ఈ జాబితాలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. 2011లో బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌లో అతడు 83 బంతుల్లోనే 150 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా టీమ్‌ 50 ఓవర్లకు 229/7 పరుగుల మోస్తరు స్కోర్‌ సాధించింది. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 26 ఓవర్లలో ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వాట్సన్‌ (185 నాటౌట్‌; 96 బంతుల్లో 15x4, 15x6) బౌండరీల మోత మోగించాడు. అతడి స్ట్రైక్‌రేట్‌ 192.70గా నమోదైంది. ఈ క్రమంలోనే తక్కువ బంతుల్లో 150 మార్క్‌ చేరుకున్నాడు. అయితే, 2015లో డివిలియర్స్‌ 64 బంతుల్లో ఈ ఘనత సాధించేవరకు వాట్సన్‌దే ఈ జాబితాలో అగ్రస్థానం. కానీ, ఇప్పుడది నాలుగో స్థానానికి పడిపోయింది.

గేల్‌, షర్జీల్‌ ఖాన్‌ కూడా.. ఈ జాబితాలో వెస్టిండీస్‌ విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌, పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ షర్జీల్‌ ఖాన్‌ చెరో 85 బంతుల్లో 150 పరుగులు సాధించి వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు. 2019లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో గేల్‌ 85 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 419 పరుగుల ఛేదనలో విండీస్‌ 389 పరుగులకే ఆలౌటైంది. అయితే, గేల్‌ (162; 97 బంతుల్లో 11x4, 14x6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. అతడి స్ట్రైక్‌రేట్‌ 167.01గా నమోదైంది. ఇక 2016లో ఐర్లాండ్‌తో జరిగిన మరో వన్డేలో పాక్‌ బ్యాట్స్‌మన్‌ షర్జీల్‌ ఖాన్‌ (152; 86 బంతుల్లో 16x4, 9x6) కూడా దంచికొట్టాడు. అతడి స్ట్రైక్‌రేట్‌ 176.74గా నమోదైంది. పాక్‌ 337/6 స్కోర్ సాధించగా ఐర్లాండ్ 82 పరుగులకే ఆలౌటైంది.

ఇదీ చూడండి: 'ఆ విషయంలో ఆందోళన లేదు.. వాటిని సరిచేసుకుంటా'

Last Updated :Jun 18, 2022, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.