'రాహుల్‌కు కెప్టెన్సీ ఇచ్చే విషయంలో నేనేం బాధపడలేదు.. ఏం జరిగినా మన మంచికే'

author img

By

Published : Nov 24, 2022, 12:32 PM IST

shikar dhawan

రాహుల్‌ కరోనా నుంచి కోలుకొని తిరిగి రావడంతో కెప్టెన్సీ బాధ్యతల నుంచి చివరి నిమిషంలో తనను తొలగించడంపై టీమ్​ఇండియా తాత్కాలిక కెప్టెన్​ శిఖర్‌ ధావన్‌ స్పందించాడు. ఈ అంశం తనను ఏమాత్రం బాధించలేదని తెలిపాడు. తానెప్పుడూ జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తానని వివరించాడు.

జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ అందుబాటులో లేకపోవడంతో బ్యాటర్‌ శిఖర్‌ ధావన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రాహుల్‌ కరోనా నుంచి కోలుకొని తిరిగి రావడంతో ధావన్‌ను తొలగించి అతడిని తీసుకున్నారు. ఈ విషయంలో బీసీసీఐ నిర్ణయాన్ని సీనియర్లు, అభిమానులు తప్పుపట్టారు. ఈ బ్యాటర్‌తోనే సిరీస్‌ ఆడిస్తే బాగుండేదన్నారు. అయితే, నాడు కెప్టెన్సీ బాధ్యతల నుంచి చివరి నిమిషంలో తనను తొలగించడంపై తాజాగా శిఖర్‌ ధావన్‌ స్పందించాడు. ఈ అంశం తనను ఏమాత్రం బాధించలేదని తెలిపాడు. తానెప్పుడూ జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తానని వివరించాడు.

"నన్ను నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తాను. ఎందుకంటే కెరీర్‌లో తక్కువ సమయంలోనే జట్టును నడిపించగల అవకాశం నాకు లభించింది. ఇది ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అదే సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు సవాళ్లతో కూడుకున్నవి. టీమ్‌ఇండియా యువజట్టు మంచి విజయాలను నమోదు చేసింది. ఇక జింబాబ్వే పర్యటన గురించి మాట్లాడితే.. వాస్తవానికి టీమ్‌ఇండియా ప్రధాన జట్టులో కేఎల్ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. అతడు గాయం నుంచి కోలుకుని వచ్చినప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. రాహుల్‌కు ఈ సిరీస్‌తో ప్రాక్టీస్‌ అవసరం అని నేను భావించాను. ఎందుకంటే అతడు ఆసియా కప్‌ జట్టుకు ఎంపికయ్యాడు. ఒకవేళ రోహిత్‌ శర్మ గాయపడితే కెప్టెన్సీ బాధ్యతను కేఎల్‌ రాహుల్‌కే అప్పగిస్తారు. కాబట్టి, జింబాబ్వే పర్యటన అతడికి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతుందని అనుకున్నాను. ఈ విషయంలో నేను బాధపడలేదు. ఏం జరిగినా మన మంచికే అని నమ్ముతాను. ఆ తర్వాత నన్ను దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కెప్టెన్‌గా నియమించి టీమ్‌యాజమాన్యం, సెలక్టర్లు నాకు అవకాశమిచ్చారు" అంటూ వివరించాడు. కివీస్‌తో శుక్రవారం ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు ధావన్‌ నాయకత్వం వహించనున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.