Ranji Trophy: 42వ టైటిల్​ వేటలో ముంబయి.. మధ్యప్రదేశ్​ అడ్డుకునేనా?

author img

By

Published : Jun 21, 2022, 12:47 PM IST

Ranzi Trophy 2022 final

Ranji Trophy 2022 Final: రంజీ ట్రోఫీ 2022 సీజన్ చివరకు చేరుకుంది. ఫైనల్​లో​ ముంబయి- మధ్యప్రదేశ్ తలపడనున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో 41 సార్లు టైటిల్​ గెలుచుకున్న ముంబయి.. 42వ సారి ట్రోఫీని అందుకోవాలన్న పట్టుదలతో ఉండగా.. 23ఏళ్ల తర్వాత తుదిపోరుకు చేరుకున్న మధ్యప్రదేశ్​ ఎలాగైనా విజేతగా నిలవాలని ఊవిళ్లూరుతోంది.

Ranji Trophy 2022 Final: దేశవాళీ క్రికెట్​ టోర్నమెంట్​ రంజీ ట్రోఫీ 2022 సీజన్​ తుది అంకానికి చేరుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ నెల 22న దేశవాళీ దిగ్గజం​ ముంబయి- మధ్యప్రదేశ్ మధ్య ఫైనల్​ జరగనుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో 41 సార్లు ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి.. మరో టైటిల్‌పై కన్నేసింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల రికార్డులను ఓ సారి పరిశీలిద్దాం..

బలాలు.. ముంబయి బ్యాటింగ్​ లైనప్​ బలంగా ఉంది. గత కొన్ని సీజన్ల నుంచి నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్​ ఖాన్ ఈసారి ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. ఆడిన ఐదు గేమ్స్​లో 803 పరుగులు చేసి సీజన్​లో అత్యధిక రన్స్​ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఐపీఎల్​లో అద్భుత ప్రదర్శన చేసిన యశస్వి జైశ్వాల్​.. రంజీ ట్రోఫీలో రెండే మ్యాచులు ఆడి ఏకంగా 413 పరుగులు చేశాడు. అదీ కీలక క్వార్టర్​ ఫైనల్లో ఓ సెంచరీ, సెమీఫైనల్లో రెండు సెంచరీలతో చెలరేగాడు. మరో అరంగేట్ర ఆటగాడు సువేద్​ పార్కర్​(252) తన తొలి మ్యాచ్​లోనే డబుల్​ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బౌలర్లో షామ్స్​ ములాని ఐదు మ్యాచుల్లో 37 వికెట్లు తీసి 292 పరుగులు చేయగా.. తనుష్​ కొటియన్​ 18 వికెట్లు తీసి, 236 రన్స్​ చేశాడు. ఇక ఓపెనర్​, దూకుడైన ప్లేయర్​ పృథ్వీ షా, అర్మాన్​ జాఫర్​ కూడా బాగా ఆడుతున్నారు. కాబట్టి వీరంతా తుదిపోరులో రాణిస్తే.. 42వ టైటిల్​ను​ ముంబయి ముద్దాడడం ఖాయమనే చెప్పాలి.

మధ్యప్రదేశ్ జట్టు కూడా ఈ మధ్య కాలంలో క్రమక్రమంగా బలంగా తయారవుతోంది. ఆ జట్టుకు కీలకంగా ఉన్న ఆల్​రండర్​ వెంకటేశ్ అయ్యర్​, పేసర్​ అవేశ్​ ఖాన్​ అందుబాటులో లేకపోవడం ఒక్కటే ప్రతికూలాంశం. బ్యాటింగ్​లో హిమన్షు మంత్రి, అక్షత్​ రఘువంశీ కూడా బాగా ఆడుతున్నారు. ఐపీఎల్​లో ఆర్సీబీ తరఫున రజత్ పాటిదార్​.. అద్భుతంగా రాణించాడు. వీరంతా ఫైనల్​లో రాణిస్తే జట్టు గెలిచే అవకాశముంది.

మరోవైపు.. స్పిన్నర్లు కుమార్ కార్తికేయ, సారాన్ష్​ జెయిన్​ నిలకడైన ప్రదర్శన చేస్తున్నారు. ఐదు మ్యాచుల్లో 27 వికెట్లు తీసిన కార్తికేయ.. ఈ సీజన్​లో ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

ముంబయి

  • సెమీఫైనల్​లో ఉత్తర్​ప్రదేశ్​పై పూర్తి ఆధిపత్యం చలాయించిన ముంబయి తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో టోర్నీ చరిత్రలో 47వ సారి ఫైనల్​కు అర్హత సాధించింది.
  • ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ యశస్వి జైశ్వాల్‌ (100, 181) రెండు శతకాలు చేసి 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు.
  • ముంబయికి ఇది 47వ ఫైనల్​ అయినప్పటికీ గత ఐదేళ్లలో తుదిపోరుకు చేరడం ఇదే తొలిసారి.
  • 41సార్లు టైటిల్స్​ను అందుకుని 89.1 విజయశాతం నమోదు చేసింది. కేవలం ఐదు సార్లు మాత్రమే రన్నరప్​గా నిలిచింది. రికార్డు స్థాయిలో 15 వరుస టైటిళ్లు సాధించిన రికార్డు ముంబయి పేరిట ఉంది.
  • చివరిసారిగా 2015/16లో సౌరాష్ట్రపై గెలిచి సీజన్​ విజేతగా నిలిచింది ముంబయి.
  • క్వార్టర్​ ఫైనల్​లో ఏకంగా 725 పరుగులు భారీ తేడాతో గెలిచి 92ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్​లో అరంగేట్ర ఆటగాడు సువేద్​ పార్కర్​(252), సర్ఫరాజ్​ ఖాన్​(153), ఆకాశ్​ మధ్వల్​(108), జైస్వాల్​(103) ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడారు.
  • ఈ సీజన్​లో ఇప్పటివరకు ఎక్కువ పరుగులు 803 సర్ఫరాజ్​ ఖాన్ చేయగా.. షామ్స్​ ములాని 37 అత్యధిక వికెట్లు తీశాడు

మధ్యప్రదేశ్​

  • సెమీఫైనల్​లో బెంగాల్​పై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి 174 పరుగుల తేడాతో గెలిచిన మధ్యప్రదేశ్​.. 23 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తుదిపోరుకు వెళ్లింది.
  • మధ్యప్రదేశ్‌ తొలిసారి 1998-99లో రంజీ ఫైనల్‌ ఆడి రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు మూడోసారి తుదిపోరు చేరింది.
  • అప్పుడు ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న చంద్రకాంత్‌ పండిత్‌ ఇప్పుడు కోచ్‌గా వ్యవహరిస్తుండడం విశేషం.
  • 1953లో చివరిసారిగా ట్రోఫీని ముద్దాడిన మధ్యప్రదేశ్​.. అప్పటి నుంచి ఇప్పటివరకు టైటిల్​ను దక్కించుకోలేదు.
  • మధ్యప్రదేశ్​ తరఫున ఈ సీజన్​లో ఎక్కువ పరుగులు (480) యశ్ దుబే, కుమార్​ కార్తికేయ ఎక్కువ వికెట్లు(27) తీశారు.

ఇదీ చూడండి: అశ్విన్​కు కరోనా.. ఇంగ్లాండ్​ టెస్టుకు ఆలస్యంగా పయనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.