భువనేశ్వర్​ కుమార్​ అరుదైన ఘనత.. గెలుపు జోష్​లో ఉన్న గుజరాత్​కు షాక్​!

author img

By

Published : May 16, 2023, 12:14 PM IST

gujarat titans big shock

గుజరాత్​ టైటాన్స్​-సన్​రైజర్స్ హైదరాబాద్​ మధ్య జరిగిన మ్యాచ్​లో భువనేశ్వర్​ కుమార్ ఓ అరుదైన ఘనత సాధించాడు. అయితే ఈ మ్యాచ్​లో గెలిచి ప్లే ఆఫ్స్​కు వెళ్లిన గుజరాత్​కు ఓ బిగ్​ షాక్​ తగిలింది. ఆ వివరాలు..

ఐపీఎల్‌-2023లో సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఫస్ట్​ టీమ్​గా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది. అయితే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన గుజరాత్‌ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది! ఆ జట్టు స్పిన్నర్‌ నూర్‌ ఆహ్మద్‌కు తీవ్ర గాయమైంది. హైదరాబాద్​ ఇన్నింగ్స్‌ 16 ఓవర్​లో నూర్‌ ఆహ్మద్‌ బౌలింగ్‌ వేశాడు. అతడి సంధించిన బంతిని.. హెన్రిచ్ క్లాసెన్ స్ట్రైట్‌గా భారీ షాట్‌ బాదాడు. ఈ క్రమంలో బంతి నేరుగా నూర్‌ ఆహ్మద్‌ చీలమండకు బలంగా తాకింది. దీంతో వెంటనే అతడు స్టేడియంలోనే తీవ్రమైన నొప్పితో విలవిలలాడుతూ కింద పడిపోయాడు. తక్షణమే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అతడిని మైదానం నుంచి బయటకు తీసుకు వెళ్లాల్సి వచ్చింది. ఇక అతడి బౌలింగ్‌ కోటాను తెవాటియా పూర్తి చేశాడు. దెబ్బ గట్టిగా తగలడంతో అతడు టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

భువనేశ్వర్​ సూపర్​ రికార్డ్​.. ఇక ఈ మ్యాచ్​లో వెటరన్‌ పేసర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ బౌలర్‌ భువనేశ్వర్‌కుమార్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన అతడు.. ఐదు వికెట్ల ప్రదర్శనతో పాటు 25కుపైగా పరుగులు చేసిన రెండో బౌలర్‌గా రికార్డుకెక్కాడు. గతంలో ఈ ఘనత సాధించిన జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఫస్ట్ ప్లేస్​లో ఉన్నాడు. డెక్కన్‌ ఛార్జర్స్‌ టీమ్​పై జడ్డూ 48 పరుగులతో పాటు ఐదు వికెట్లు తీశాడు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేసిన భువనేశ్వర్‌ కుమార్​.. కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఓ రనౌట్‌లోనూ భాగమయ్యాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో అతడు తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా, అహ్మదాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో గుజరాత్‌ టైటాన్స్​ విజయాన్ని అందుకుంది. దీం‍తో ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది హార్దిక్ సేన. ఈ మ్యాచ్‌లో ఫస్ట్​ బ్యాటింగ్‌ చేసిన గుజరాత్​లో శుభ్​మన్‌ గిల్‌ సెంచరీతో విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. సన్​రైజర్స్​ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్​రైజర్స్​.. 9 వికెట్లు కోల్పోయి 154 పరుగులు మాత్రమే చేసింది. సన్‌రైజర్స్‌ బ్యాటర్లలో హెన్రిచ్‌ క్లాసెన్‌(64) ఒక్కడే పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. గుజరాత్‌ బౌలర్లలో షమీ, మొహిత్‌ శర్మ చెరో నాలుగు వికెట్లు తీశారు. ఈ ఓటమితో సన్​రైజర్స్​ ప్లేఆఫ్స్​ రేసు నుంచి తప్పుకుంది.

ఇదీ చూడండి: ఆ రాత్రంతా నిద్రపోలేదు.. మార్నింగ్​ బ్యాటింగ్​కు దిగి ఆడలేకపోయా : కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.