క్రికెట్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. ఐపీఎల్ 2023పై గంగూలీ కీలక ప్రకటన

author img

By

Published : Sep 22, 2022, 3:32 PM IST

Updated : Sep 22, 2022, 3:46 PM IST

ipl ganguly

ఐపీఎల్​ 2023 సీజన్​పై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కీలక ప్రకటన చేశారు. అలానే మహిళల ఐపీఎల్ గురించి కూడా మాట్లాడారు. ఏం చెప్పారంటే..

ఐపీఎల్​కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే మహిళలకూ ప్రత్యేకంగా టీ20 లీగ్‌ను నిర్వహించాలని భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. ఇప్పటికే వారికి టీ20 ఛాలెంజ్‌ పేరిట కొన్ని మ్యాచ్‌లను నిర్వహిస్తున్నప్పటికీ.. తమకూ ఇటువంటి లీగ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో బీసీసీఐ కసరత్తు ప్రారంభించింది. అయితే తాజాగా ఐపీఎల్​ 2023 సీజన్ సహా మహిళల ఐపీఎల్​ గురించి బోర్డు అధ్యక్షుడు గంగూలీ కీలక ప్రకటన చేశారు. ఈ సారి నుంచి పురుషుల మెగాలీగ్​ స్వదేశంలోనే గతంలో లాగా హోమ్‌ అండ్​ అవే(సొంత మైదానం-బయట మైదానం) పద్ధతిలోనే జరుగుతుందని స్పష్టం చేశారు. కాగా, గత రెండు సీజన్లుగా కరోనా కారణంగా ఐపీఎల్‌ విదేశీ వేదికలపై లేదా స్వదేశంలో ఉన్న పరిమిత వేదికల్లో జరుగుతోంది. కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్‌ అభిమానులకు దూరంగా లీగ్​ను​ నిర్వహించారు. అయితే ఇప్పుడు కొవిడ్ పరిస్థితులు మెరుగవ్వడం వల్ల తాజా నిర్ణయం తీసుకున్నారు. ఇక 2022 నుంచి ఐపీఎల్‌లో పది జట్టు పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే తాజా నిర్ణయంతో వచ్చే సీజన్‌ నుంచి ఈ పది టీమ్స్‌కు తమ హోమ్‌గ్రౌండ్స్‌లో మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది.

ఉమెన్స్‌ ఐపీఎల్‌ 2023.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉమెన్స్‌ ఐపీఎల్‌.. 2023 నుంచే ప్రారంభం కానున్నట్లు దాదా వెల్లడించారు. "ప్రస్తుతం బీసీసీఐ మహిళల టీ20 లీగ్‌పైనా కసరత్తు చేస్తోంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ టోర్నీ వచ్చే ఏడాది నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాం. అలాగే పురుషుల టీ20 లీగ్‌ కూడా గతంలో జట్టుకు సొంత మైదానాల్లో ఆడే అవకాశం ఉండేది. అయితే, కరోనా కారణంగా గత సీజన్‌లో కుదరలేదు. అందుకే వచ్చే సీజన్‌కు ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం" అని గంగూలీ పేర్కొన్నారు.

అండర్​-15 వన్డే టోర్నీ.. ఇక మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సీజన్​ నుంచి అండర్‌15 వన్డే టోర్న్​మెంట్​ ప్రారంభించబోతున్నట్లు దాదా తెలిపారు. " అంతర్జాతీయంగా మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరుగుతోంది. మన జట్టు కూడా బాగా రాణిస్తోంది. అందుకే ఈ కొత్త టోర్నీ ఈ సీజన్​ నుంచి ప్రారంభించబోతుంది. దీంతో కొత్త ఆటగాళ్లకు నేషనల్, ఇంటర్నేషనల్‌ లెవల్లో రాణించడానికి ఈ టోర్నీ బాగా ఉపయోగపడుతుంది" అని దాదా చెప్పారు. ఈ టోర్నీని డిసెంబరు 26 నుంచి జనవరి 12 వరకు బెంగళూరు, రాంచి, రాజ్​కోట్​, ఇండోర్​, రాయ్​పూర్​, పుణెలో నిర్వహించనున్నారు.

రంజీ ట్రోఫీ కూడా ఎప్పటిలాగే.. ఇక నుంచి దేశవాళీ క్రికెట్‌లోని అన్ని టోర్నీలు కూడా హోమ్‌ అండ్​ అవే పద్ధతిలో జరుగుతుందని గంగూలీ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సీజన్‌లో రెండు ఇరానీ కప్‌లు జరుగుతాయని కూడా చెప్పారు.

ఇదీ చూడండి: 'ధోనీ ఉండుంటే ఆ ఔట్​ను ఈజీగా గుర్తించేవాడు'.. మాజీ కెప్టెన్​పై రవిశాస్త్రి ప్రశంసలు

Last Updated :Sep 22, 2022, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.