ఇంకా తేలని టికెట్ల లెక్క.. స్టేడియం కుర్చీలపై పిట్టల రెట్ట.. మ్యాచ్ నిర్వహణ ఎలా?

author img

By

Published : Sep 24, 2022, 6:58 AM IST

Hyderabad Cricket Association predident Azharuddin

India Australia T20 Series : భారత్​-ఆసీస్ మూడో టీ20 హైదరాబాద్​లో 25న ఉప్పల్​ రాజీవ్​గాంధీ స్టేడియంలో జరగనుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు టికెట్లపై స్పష్టత రాలేదు. టికెట్లన్నీ అమ్ముడయ్యాయని హెసీఏ చెప్పినప్పటికీ.. ఇంకా కొన్ని టికెట్లు లెక్కకు రావడం లేదు. మరోవైపు దాదాపు మూడేళ్ల తర్వాత స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్​ జరుగుతోంది. కానీ స్టేడియం నిర్వహణ చూడడంలో హెచ్​సీఏ తీవ్రంగా విఫలమైంది.

India Australia T20 Series : భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే టీ20 మ్యాచ్‌ టికెట్ల లెక్కపై స్పష్టత రావడం లేదు. స్టేడియం సామర్థ్యం 39 వేలు కాగా.. ఇప్పటివరకూ వివిధ రూపాల్లో 26,550 టికెట్లు అయిపోయాయని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహమ్మద్‌ అజహరుద్దీన్‌ వెల్లడించాడు. టికెట్ల విక్రయం బాధ్యత పూర్తిగా 'పేటీఎం'కే అప్పగించామని, జింఖానా ఉదంతంతో హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.

గురువారం జింఖానా మైదానంలో తొక్కిసలాట కారణంగా టికెట్ల కోసం వచ్చిన అభిమానులు కొందరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో అజహరుద్దీన్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. "టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 టికెట్ల అమ్మకంలో హెచ్‌సీఏది ఎలాంటి తప్పు లేదు. ఆ టికెట్ల విక్రయం బాధ్యతను పూర్తిగా 'పేటీఎం'కు అప్పజెప్పాం. బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నారనే ఆరోపణల్లో నిజం లేదు"

"ఆన్‌లైన్‌లో టికెట్లు కొని బయట ఎక్కువ ధరకు అమ్మేవాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఈ నెల 15న పేటీఎంలో 11450 టికెట్లు అమ్ముడయ్యాయి. కార్పొరేట్‌ బాక్సుల కోసం 4 వేల టికెట్లు కేటాయించాం. జింఖానాలో 2100 టికెట్లు విక్రయించారు. గురువారం రాత్రి పేటీఎంలో మరో 3 వేల టికెట్లు అభిమానులు దక్కించుకున్నారు. హెచ్‌సీఏ అంతర్గత వ్యక్తులు, వాటాదార్లు, స్పాన్సర్ల కోసం మరో 6 వేల టికెట్లు అందుబాటులో ఉంచాం"

"టికెట్ల విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. జింఖానాలో జరిగిన ఘటనతో హెచ్‌సీఏకు సంబంధం లేదు. మ్యాచ్‌ సందర్భంగా మైదానంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే అప్పుడు అడగండి. మ్యాచ్‌ను ప్రేక్షకులు ఆస్వాదించేలా సౌకర్యాలు మెరుగుపరుస్తున్నాం" అని అజహరుద్దీన్‌ తెలిపాడు. అజహర్‌ చెప్పిన టికెట్ల లెక్క 26,550 కాగా.. మిగతావి, దాదాపు 13 వేల టికెట్ల ఏమయ్యాయన్నదే ప్రశ్న.

నిర్వహణలోనూ నిర్లక్ష్యం
పిట్టల రెట్ట, దుమ్ము, ధూళితో నిండిపోయిన కుర్చీలు.. విరిగిపోయిన సీట్లు.. పైకప్పు లేక కళావిహీనంగా స్టేడియం.. ఇదీ ప్రస్తుతం ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానం పరిస్థితి. ఈ స్టేడియంలో భారత్‌, ఆసీస్‌ టీ20 మ్యాచ్‌కు ఒక్క రోజే సమయం ఉంది. కానీ ఇప్పటికీ మ్యాచ్‌ నిర్వహణ కోసం మైదానాన్ని మెరుగ్గా సిద్ధం చేయడంలో హెచ్‌సీఏ తాత్సారం చేస్తోంది.

Hyderabad Cricket Association predident Azharuddin says that they did nothing wrong in ticket issue
పిట్ట రెట్టలతో స్టాండ్​లోని కుర్చీలు

టికెట్ల విక్రయంతో సంబంధం లేదంటూ తప్పు మొత్తాన్ని పేటీఎం ఖాతాలో వేసే ప్రయత్నం చేసిన హెచ్‌సీఏ.. మ్యాచ్‌ నిర్వహణ విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికీ సీట్లను శుభ్రం చేస్తూనే ఉన్నారు. అక్కడి ప్రదేశాలు దుర్భరంగా ఉన్నాయి. పిట్టల రెట్ట, దుమ్ము, ధూళి స్టేడియంలోని కుర్చీలు, ప్రాంతాల్లో పేరుకుపోయింది. 2019 ఏప్రిల్‌లో భారీ గాలులకు స్టేడియంలోని ఓ వైపు అక్కడక్కడా పైకప్పు లేచిపోయింది.

Hyderabad Cricket Association predident Azharuddin says that they did nothing wrong in ticket issue
పైకప్పు లేని స్టేడియం

దీన్ని ఇప్పటివరకూ మరమ్మతు చేయలేదు. ఇప్పుడేమో కొత్త పైకప్పు వేసేందుకు ఎక్కువ సమయం పడుతుందని, మ్యాచ్‌ నేపథ్యంలో అలాగే వదిలేశామని హెచ్‌సీఏ చెప్పింది. "స్టాండ్స్‌లోని సీట్లను శుభ్రం చేస్తున్నాం. వాటిపై కవర్లు వేస్తాం. కరోనా కారణంగా మూడేళ్ల పాటు స్టేడియం నిర్వహణపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోయాం" అని విజయానంద్‌ పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే టికెట్ల విక్రయంపై తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న హెచ్‌సీఏ.. మ్యాచ్‌నైనా సవ్యంగా నిర్వహిస్తుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

ఇవీ చదవండి: నా కెరీర్‌లో అదొక్కటే అసంతృప్తి: ఝులన్‌ గోస్వామి

అందుకే.. మైదానంలో అంత కూల్​గా కనిపిస్తా: ధోనీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.