సింధు.. కోహ్లీలా.. మీరూ విజేతలు కావాలంటే?

author img

By

Published : Jan 1, 2022, 7:52 AM IST

Updated : Jan 1, 2022, 11:35 AM IST

How  to Become a Sportsman

How to Become a Sportsman: కొంత కాలంగా క్రీడారంగంలో భారీ మార్పులు వస్తున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిలు బాగా రాణిసున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఆటల వైపు నడిపించేలా చర్యలు తీసుకుంటున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహించే వాళ్లు, అత్యుత్తమ శిక్షణ వసతులు అందుబాటులో ఉంటే అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్లు కావొచ్చు. ప్రతి ఒక్కరూ ఓ కోహ్లీ.. ఓ నీరజ్‌ చోప్రా.. ఓ సింధుగా మారొచ్చు. అయితే అందరూ మైదానంలో విజేతలు కాకపోవచ్చు. కానీ జీవితంలో మాత్రం విజయం సాధిస్తారు. మరి మీరూ క్రీడల్లో దూసుకెళ్లి జీవితంలో విజయం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..

How to Become a Sportsman: పదేళ్ల క్రితం ఊబకాయంతో బాధపడుతున్న ఆ బాలుడిని ఎగతాళి చేసిన స్నేహితులకు తెలీదు అతనే ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుస్తాడని! పదేళ్ల వయసులో దిల్లీలోని గల్లీల్లో బ్యాట్‌తో వీరంగం సృష్టించిన ఆ బాలుడు.. టీమ్‌ఇండియాను నడిపిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు! ఎనిమిదేళ్ల వయసులో శిక్షణ కోసం రోజూ 56 కిలోమీటర్లు ప్రయాణించిన ఆ అమ్మాయి.. వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లో పతకాలతో చరిత్ర సృష్టిస్తుందని ఎవరూ అనుకోని ఉండరు! వాళ్లే.. నీరజ్‌ చోప్రా, విరాట్‌ కోహ్లీ, పీవీ సింధు. వాళ్లు ఈ స్థాయికి చేరడానికి కారణం ఆటలు. అవును.. ఆటలు ఎంతోమందికి జీవితాన్నిచ్చాయి. ఆటలాడిన ప్రతి ఒక్కరూ మైదానంలో విజేతలు కావొచ్చు.. కాకపోవచ్చు. కానీ జీవితంలో మాత్రం ఛాంపియన్‌లుగా నిలుస్తారు.

గత కొంత కాలంగా క్రీడారంగంలో పెను మార్పులు వస్తున్నాయి. అందుకు తగినట్లుగా తమ పిల్లలను ఆటల వైపు నడిపించేలా తల్లిదండ్రుల దృక్పథం మారుతోంది. వెన్నుతట్టి ప్రోత్సహించే వాళ్లు.. అత్యుత్తమ శిక్షణ వసతులు అందుబాటులో ఉంటే.. ఆటలో అడుగుపెట్టి.. అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్లవొచ్చు. ప్రతి ఒక్కరూ ఓ సింధు.. ఓ నీరజ్‌ చోప్రా.. ఓ కోహ్లి కాలేకపోవచ్చు. కానీ జీవితంలో కచ్చితంగా ఛాంపియన్‌గా ఎదుగుతారు. ఏ పాఠశాలలో, కళాశాలలో బోధించని ఎన్నో విషయాలను క్రీడలు నేర్పిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి.

దూసుకెళ్లండిలా..

తమ పిల్లలను ఛాంపియన్లుగా చూడాలని తపనపడే తల్లిదండ్రులు అందుకు సరైన మార్గం కోసం అన్వేషిస్తుంటారు. వాళ్ల చుట్టూనే ఎన్నో అవకాశాలుంటాయి. ముందు తమ పిల్లలు ఏ క్రీడపై ఆసక్తి చూపిస్తున్నారో తెలుసుకోగలగాలి. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు అకాడమీల ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంటారు. అందులో తమ పిల్లాడు ఏ క్రీడలో ప్రతిభ చూపుతున్నాడో గమనించాలి. మరోవైపు తమ జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే శిక్షణా కేంద్రాలుంటాయి. వాటిలో తమ పిల్లలను చేర్చవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో క్రీడా పాఠశాలలున్నాయి. తెలంగాణలోని హకీంపేట్‌లో, కరీంనగర్‌, ఆదిలాబాద్‌లో, ఏపీలోని కడపలో క్రీడా పాఠశాలలున్నాయి. వీటిల్లో నాలుగో తరగతిలోకి ప్రవేశాలుంటాయి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో 8 నుంచి 10 ఏళ్లలోపు విద్యార్థులను పరీక్షల ద్వారా ఈ పాఠశాలల్లోకి తీసుకుంటారు. ఇంటర్మీడియట్‌ వరకు ఆటలో శిక్షణ తీసుకుంటూ చదువుకోవచ్చు. మరోవైపు మండల స్థాయి నుంచి వివిధ వయసు విభాగాల్లో వేర్వేరు క్రీడా సంఘాలు తమ ఆటల్లో టోర్నీలు నిర్వహిస్తాయి. అందులో ఉత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను తర్వాతి స్థాయికి ఎంపిక చేస్తాయి.

క్రికెటర్‌ అవ్వాలనుకునే వాళ్ల కోసం ఇటు తెలంగాణలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ).. అటు ఏపీలో ఆంధ్రప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (ఏసీఏ) గుర్తింపు పొందిన సంఘాలు జిల్లాల్లో పోటీలు పెడతాయి. శిక్షణ కూడా అందిస్తాయి. ఇక హెచ్‌సీఏ, ఏసీఏ లీగ్‌లు, టోర్నీలు నిర్వహిస్తాయి. వీటిల్లో పాల్గొనే క్లబ్బులు తమ జట్టు తరపున ఆడే ఆటగాళ్లను సెలక్షన్‌ ట్రయల్స్‌ ద్వారా ఎంపిక చేసుకుంటాయి. ఈ టోర్నీల్లో మంచి ప్రదర్శనతో రాష్ట్ర జట్లలో చోటు దక్కించుకోవచ్చు. దేశవాళీ టోర్నీల్లో ప్రదర్శనతో ఐపీఎల్‌తో పాటు టీమ్‌ఇండియా తలుపు తట్టొచ్చు.

ఎవ్వరూ నేర్పని పాఠాలు..

క్రీడలంటే కేవలం పోటీలు.. విజయాలే కాదు. అవి జీవితాన్ని తీర్చిదిద్దే పాఠాలు నేర్పిస్తాయి. కరోనా కారణంగా ఇప్పుడందరూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అదే ఆటలాడితే శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు ఉండవు. జట్టుగా కలిసి ఆడడం వల్ల సమష్టితత్వం అలవడుతుంది. ఆటలో పేద, ధనిక అనే భేదాలుండవు. ఒక్కసారి మైదానంలో అడుగుపెడితే అందరూ సమానమే. దీంతో ప్లేయర్లలో సమానత్వం అలవాటవుతుంది. పది మందిని కలుపుకొని పోయే నాయకత్వ లక్షణాలు అబ్బుతాయి. సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఆటలు ఓటమి భయాన్ని పారదోలి.. ధైర్యం అనే మందు నూరిపోస్తాయి. మైదానంలో క్షణకాలంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితంలోనూ సమస్యల్లో చుట్టుముట్టినప్పుడు వేగంగా స్పందించే శక్తి వస్తుంది. క్రమశిక్షణ వంటబడుతుంది. గెలుపోటములను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞత సమకూరుతుంది. అంత సులభంగా ఓటమికి తలవంచని నైజం అలవడుతుంది. ఇలా క్రీడలు కేవలం మైదానం వరకే పరిమితం కావు. అవి మెరుగైన జీవితాలకు బాటలు వేస్తాయి.

క్రీడలు అంటే పతకాలు మాత్రమే కాదు. ఫిట్‌నెస్‌ ఆరోగ్యం కూడా. ఆటలు ఆడటం వల్ల మొదడు చురుగ్గా మారుతుందని పరిశోధనల్లో తేలింది కూడా. క్రీడలు అందరినీ ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే కొన్నేళ్లుగా పిల్లలు కేవలం చదువుకే అంకితమవుతున్నారు. చదువు మాత్రమే కాదు.. శారీరక దృఢత్వం కూడా వారికి చాలా అవసరం. ప్రతి ఒక్కరు చదువుతో పాటు ఆటలపై దృష్టిసారించేలా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి.

- గోపిచంద్‌, జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌

ఇదీ చూడండి: 2022 Sports calendar: ప్రపంచకప్‌ నామ సంవత్సరం.. క్రీడాభిమానులకు పండగే

Last Updated :Jan 1, 2022, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.