కివీస్‌కు ఇన్నింగ్స్‌ విజయం.. బంగ్లాతో టెస్టు సిరీస్‌ 1-1తో సమం

author img

By

Published : Jan 12, 2022, 6:47 AM IST

Ban VS Nz Test

Ban VS Nz Test: బంగ్లాదేశ్​తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్​ను 1-1తో సమం చేసింది. మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో కివీస్‌ ఇన్నింగ్స్‌, 117 పరుగుల ఆధిక్యంతో బంగ్లాపై విజయం సాధించింది.

Ban VS Nz Test: లాంఛనం ముగిసింది. న్యూజిలాండ్‌ లెక్క సమం చేసింది. రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసి తొలి మ్యాచ్‌లో పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో కివీస్‌ ఇన్నింగ్స్‌, 117 పరుగుల ఆధిక్యంతో బంగ్లాపై విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. సోమవారం తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే కుప్పకూలిన బంగ్లాను మూడో రోజు కివీస్‌ ఫాలోఆన్‌ ఆడించింది. మంగళవారం ఉదయం ఆట ఆరంభించిన బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 79.3 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటైంది.

లిటన్‌ దాస్‌ (102; 114 బంతుల్లో 14×4, 1×6) పోరాడినా ఫలితం లేకపోయింది. కివీస్‌ బౌలర్లు జేమీసన్‌ (4/82), నీల్‌ వాగ్నర్‌ (3/77)లు బంగ్లా పతనాన్ని శాసించారు.

వీడ్కోలు వీరుడికి చివరి వికెట్‌:

కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న రాస్‌ టేలర్‌ (1/0) వికెట్‌తో వీడ్కోలు పలకడం విశేషం. చివర్లో వెలుతురు మందగించడంతో ప్రేక్షకుల కోరిక మేరకు కెప్టెన్‌ టామ్‌ లేథమ్‌.. టేలర్‌కు బంతినిచ్చాడు. టేలర్‌ వేసిన మూడో డెలివరీని ఎబాదత్‌ హొస్సేన్‌ (4) భారీ షాట్‌కు ప్రయత్నించగా.. గాల్లోకి లేచిన బంతిని లేథమ్‌ ఒడిసి పట్టుకున్నాడు. అంతే.. టేలర్‌ 15 ఏళ్ల టెస్టు కెరీర్‌కు శుభం కార్డు పడింది. టెస్టు కెరీర్‌లో చివరి మ్యాచ్‌ను వికెట్‌తో టేలర్‌ చిరస్మరణీయం చేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌కు ముందు టెస్టుల్లో తన ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌తో 16 ఓవర్లు మాత్రమే వేసిన టేలర్‌ 2 వికెట్లు తీశాడు. చివరి సారిగా ఎనిమిదేళ్ల క్రితం టేలర్‌ బౌలింగ్‌ చేశాడు. ఇక లేథమ్‌ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో ఒక మ్యాచ్‌లో 250 పరుగులు చేసి, ఆరు క్యాచ్‌లు అందుకున్న ఏకైక ఆటగాడిగా ఘనత అందుకున్నాడు.

ఇలా ముగించడం గొప్ప విషయం:

"విజయం, వికెట్‌తో కెరీర్‌ను ముగించడం చాలా గొప్ప విషయం. గెలుపుతో వీడ్కోలు పలకాలని భావించా. కుర్రాళ్లు ఆ పని చేశారు. బంగ్లాదేశ్‌ చాలా సందర్భాల్లో మమ్మల్ని ఒత్తిడికి గురిచేసింది. కాబట్టి మేము సిరీస్‌ను పంచుకోవడం సముచితమే. దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని పూర్తిగా ఆస్వాదించా. నా కెరీర్‌కు ఇది గొప్ప ముగింపు" అని రాస్‌ టేలర్‌ అన్నాడు.

ఇదీ చూడండి: కోహ్లీ ఒంటరి పోరాటం.. భారత్ 223 ఆలౌట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.