20 బ్రాండ్లపై పీవీ సింధు దావా! కారణమేంటి?

author img

By

Published : Aug 9, 2021, 4:59 PM IST

PV Sindhu

మొమెంట్ మార్కెటింగ్... సోషల్​ మీడియా వచ్చాక బాగా ఆదరణ పొందుతున్న మార్కెటింగ్ స్ట్రాటజీ. క్రికెట్​ మ్యాచ్​లో గెలుపు, రాకెట్ ప్రయోగం విజయవంతం, ఎన్నికల ఫలితం.. ఇలా ఆరోజు వార్తల్లో హైలైట్​గా నిలిచిన అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని అప్పటికప్పుడు యాడ్స్​ రూపొందించడమే మొమెంట్ మార్కెటింగ్. ఒలింపిక్స్​లో పీవీ సింధు కాంస్యం గెలిచిన రోజు ఇదే పని చేశాయి కొన్ని సంస్థలు. ఆ క్షణంలో మార్కెటింగ్​లో భళా అనిపించుకున్నా... ఇప్పుడు చిక్కుల్లో పడ్డాయి. ఎందుకిలా?

ఒలింపిక్స్​లో రెండు పతకాలు సాధించిన తొలి మహిళగా దేశం గర్వపడేలా చేసింది పీవీ సింధు. యావత్​ భారతావని ఆమెపై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రజలతో పాటు పలు దిగ్గజ సంస్థలు సింధుకు శుభాకాంక్షలు తెలిపాయి. అయితే.. అదే సమయంలో తన పేరు, ఇమేజ్​ను ఎలాంటి అనుమతులు లేకుండా మార్కెటింగ్​ కోసం వినియోగించటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది సింధు. అలాంటి 20 బ్రాండ్లపై కేసు నమోదు చేసి, పరువు నష్టం కింద ప్రతి కంపెనీపై రూ.5 కోట్ల మేర దావా వేయాలని భావిస్తోంది సింధుకు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలు చూసే బేస్​లైన్​ వెంచర్స్​.

ఆయా బ్రాండ్లు సింధు పేరును వినియోగించటంలో తప్పు ఏమిటనే విషయాన్ని బేస్​లైన్​ వెంచర్స్​ టాలెంట్​, పార్ట్నర్​షిప్స్​ డైరెక్టర్​ యశ్వంత్​ బియ్యాలా వెల్లడించారు.

" ఈ బ్రాండ్లు పీవీ సింధు పేరును, ఫొటోలను వారి పోస్టుల్లో వినియోగించటం.. క్రీడాకారుల ప్రైవసీని ఉల్లఘించటమే. మరోవైపు.. అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ(ఐఓసీ) నిబంధనలనూ ఉల్లంఘించారని స్పష్టంగా తెలుస్తోంది. టోర్నమెంట్​ సమయంలో ప్రకటనలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఒలింపిక్​ క్రీడలు ప్రారంభమైన జులై 13 నుంచి ఆగస్టు 10న ముగిసే వరకు కనీసం స్పాన్సర్లు సైతం ఆటగాళ్ల గురించి పోస్ట్​ చేసేందుకు అవకాశం లేదు. కేవలం ఐఓసీ, ఇండియన్​ ఒలింపిక్​ అసోసియేషన్​కు మాత్రమే ఆటగాళ్ల గురించి ప్రకటనలు చేసేందుకు వీలుంది."

- యశ్వంత్​ బియ్యాలా, బేస్​లైన్​ వెంచర్స్​ డైరెక్టర్​

15 బ్రాండ్లకు లీగల్​ నోటీసులు

నిబంధనలను ఉల్లంఘించిన 20 బ్రాండ్లను బేస్​లైన్​ వెంచర్స్​ గుర్తించింది. అందులో ఇప్పటికే 15 బ్రాండ్లకు లీగల్​ నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్న బ్రాండల్లో హ్యాపీడెంట్​, పాన్​ బహార్​, యురేకా ఫోర్బ్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, వొడాఫోన్​ ఐడీయా, ఎంజీ మోటార్స్​, యూకో బ్యాంక్​, పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​, స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, కొటక్​ మహీంద్రా బ్యాంక్​, ఫినో పేమెంట్​ బ్యాంక్​, బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర, ఇండియన్​ బ్యాంక్​, విప్రో లైటింగ్​ ఉన్నాయి. ఆయా సంస్థలు ఇచ్చే రిప్లైకు అనుగుణంగా బేస్​లైన్​ వెంచర్స్ తదుపరి కార్యాచరణ ఉండనుంది.

ఇదీ చూడండి: PV SINDHU: ఒలింపిక్​లో తెలుగు తేజం... సింధుపై ప్రశంసల వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.