'మా' ఎన్నికల్లో మంచు విష్ణు విజయం

author img

By

Published : Oct 10, 2021, 10:45 PM IST

manchu vishnu won maa elections 2021

'మా' కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయం సాధించారు. ప్రకాశ్​రాజ్​పై గెలిచి ప్రెసిడెంట్​గా బాధ్యతలు అందుకున్నారు.

తెలుగురాష్ట్రాల్లో ఆసక్తి రేపిన మా ఎన్నికల్లో విజయవంతంగా పూర్తయ్యాయి. అధ్యక్షుడిగా మంచువిష్ణు గెలుపొందారు. నువ్వానేనా అన్నట్లు తలపడిన పోరులో ప్రకాశ్​రాజ్​పై పైచేయి సాధించారు.

ఈ ఎలక్షన్​ను ఇరు ప్యానల్స్​ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారం చేయడం వల్ల ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఓటింగ్‌ నమోదైంది. స్వల్ప ఘటనలు జరిగినా, పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది.

'మా' ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరిగింది. మొత్తం 883 మంది అర్హులైన సభ్యులు ఉండగా.. 665 ఓట్లు పోలయ్యాయి. 2019 'మా' ఎన్నికల్లో 442 ఓట్లు మాత్రమే పోల్‌ కాగా.. ఈసారి పోలింగ్‌ భారీగా పెరిగింది. ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్‌ కల్యాణ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న మిగతా స్టార్స్​లో రామ్‌చరణ్, నాని, అక్కినేని అఖిల్‌, మంచు మనోజ్‌, అల్లరి నరేశ్, సుధీర్ బాబు, సాయికుమార్‌, ఆదితో పాటు బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, బాబూమోహన్, గిరిబాబు, బ్రహ్మాజీ, పోసాని, బండ్ల గణేశ్ ఉన్నారు. సీనియర్‌ నటి జయప్రద, రోజా, రాశి, లక్ష్మీప్రసన్న, అనుపమ పరమేశ్వరన్, జెనీలియా, ప్రియమణి, పూనమ్‌ కౌర్ కూడా ఓటువేశారు. రాజేంద్రప్రసాద్, ఆర్‌.నారాయణమూర్తి, సుమన్, నాగబాబు, చలపతిరావు, రవిబాబు పోలింగ్‌కు తరలివచ్చారు.

అయితే ఈసారి పోలింగ్ సమయంలో స్పల్ప వివాదాలు చేటుచేసుకున్నాయి. బయట వ్యక్తులు వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ.. ప్రకాశ్‌రాజ్‌, విష్ణు ప్యానల్స్ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. నువ్వెంతంటే నువ్వెంతంటూ నరేశ్, ప్రకాశ్‌రాజ్ వాగ్వాదానికి దిగారు. 10 నిమిషాలపాటు పోలింగ్‌ను అధికారులు ఆపేశారు. నరేశ్‌, ప్రకాశ్‌రాజ్‌ను మోహన్‌బాబు సముదాయించారు. పోలింగ్‌ కేంద్రం బయటకొచ్చిన ప్రకాశ్‌రాజు, విష్ణు.. అంతా సర్దుకుందని చెప్పారు. ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు. 'మా' ఎన్నికల్లో గొడవలు జరగడంపై మోహన్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రామ-రావణ యుద్ధంలా జరుగుతోందని తెలిపారు.

విష్ణు ప్యానల్​లోని శివబాలాజీ చెయ్యిని హేమ కొరకడం కలకలం సృష్టించింది. తానూ వెళ్తున్న సమయంలో చెయ్యి అడ్డుగాపెట్టారని.. తప్పుకోమంటే తప్పుకోలేదని అందుకే చెయ్యి కొరకాల్సి వచ్చిందని హేమ చెప్పారు. హేమ తన చెయ్యి కొరికిన విషయాన్ని శివబాలాజీ తేలిగ్గా తీసుకున్నారు.

మహేశ్‌బాబు, ప్రభాస్‌, రానా, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, వెంకటేశ్‌ వంటి అగ్రహీరోలతోపాటు రకుల్‌, ఇలియానా, త్రిష, హన్సిక వంటి కథానాయికలు ఓటు వేయలేదు. మా ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన నటుల్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్స్‌ వద్ద సందడిగా మారింది. స్టార్లను చూసేందుకు జనం పోటీపడ్డారు. ఒకదశలో అభిమానుల్ని నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.