భూమికి ముప్పుతప్పించేలా నాసా 'డార్ట్' మిషన్.. ప్రయోగానికి సర్వం సిద్ధం​

author img

By

Published : Sep 26, 2022, 7:16 AM IST

DART Mission Nasa

ఒకప్పుడు భూమిపై హల్‌చల్‌ చేసిన రాకాసి బల్లులు తర్వాత నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. భారీ గ్రహశకలమొకటి(ఆస్ట్రాయిడ్‌) పుడమిని బలంగా ఢీకొట్టడమే అందుకు కారణమన్నది ఎక్కువమంది వాదన. 6.6 కోట్ల ఏళ్ల కిందట చోటుచేసుకున్న ఆ మహోత్పాతంతో రాక్షసబల్లులతో పాటు జీవజాలం చాలావరకు అంతరించిపోయింది! అలాంటి ముప్పు భూమికి ఇకముందు ఉండబోదని చెప్పలేం. మన గ్రహానికి చేరువలో వేల సంఖ్యలో అంతరిక్ష శిలలు ఉన్నాయి. వాటిలో ఏదైనా భూమి దిశగా దూసుకొస్తే మరోసారి విధ్వంసం తప్పదు!

DART Mission Nasa : గ్రహశకలాల నుంచి మానవాళిని రక్షించేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. పుడమిని తాకకుండా వాటిని దారిమళ్లించడంపై ప్రధానంగా దృష్టిసారించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా చేపట్టిన 'డార్ట్‌ (డబుల్‌ ఆస్ట్రాయిడ్‌ రీడైరెక్ట్‌ టెస్ట్‌)' మిషన్‌ వాటిలో అత్యంత కీలకమైనది. గత ఏడాది నవంబరులో నింగిలోకి దూసుకెళ్లిన ఈ డార్ట్‌ ఉపగ్రహంతో.. అంతరిక్షంలో తిరుగుతున్న ఓ గ్రహశకలాన్ని ఢీకొట్టించి, కక్ష్య మార్చాలన్నది లక్ష్యం! ప్రపంచ శాస్త్రవేత్తలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఘటనకు ముహూర్తం.. మంగళవారం తెల్లవారుజామే (భారత కాలమానం ప్రకారం). ఖగోళ పరిశోధనలను కొత్త మలుపు తిప్పే అవకాశమున్న ఈ ప్రయోగం గురించి 'ఈనాడు- ఈటీవీ భారత్​' ప్రత్యేక పతినిధి కంభంపాటి సురేష్‌తో తాజాగా అనేక విషయాలను పంచుకున్నారు మన తెలుగు తేజం ప్రొఫెసర్‌ కనుపూరు విష్ణురెడ్డి. అమెరికాలోని ఆరిజోనా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేస్తున్న ఆయన.. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆస్ట్రాయిడ్‌ శాస్త్రవేత్తల్లో ఒకరు. తాజా ప్రయోగం నేపథ్యంలో గ్రహశకలాల గురించి, వాటిలోని విలువైన ఖనిజాల మైనింగ్‌ గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వాటిలో కీలకాంశాలు ఆయన మాటల్లోనే..

భారీ శిలలతో వినాశనం: చిన్నచిన్న గ్రహశకలాలు భూమిని ఢీకొట్టినా పెద్ద ముప్పేమీ ఉండదు. భారీ శిలలు దూసుకొస్తే మాత్రం వినాశనం చోటుచేసుకుంటుంది. ప్రస్తుతం మేం 140 మీటర్లు, అంతకన్నా వెడల్పుగా ఉండే గ్రహశకలాలను వర్గీకరిస్తున్నాం. ఆ పరిమాణంలోని గ్రహశకలం భూమిని ఢీకొడితే ప్రాంతీయ స్థాయిలో నష్టం వాటిల్లవచ్చు. అంటే.. ఒక రాష్ట్రం మొత్తం నాశనం కావచ్చు. పదేళ్ల కిందట ఒక కిలోమీటరు.. అంతకన్నా ఎక్కువ వెడల్పైన గ్రహశకలాలను పరిశీలించాలన్న లక్ష్యం ఉండేది. అలాంటి శిలలు పడితే దేశం మొత్తం నాశనమవుతుంది. భవిష్యత్‌లో 20 మీటర్లు.. అంతకన్నా వెడల్పైన గ్రహశకలాలపై కన్నేసి ఉంచుతాం. అవి 2013లో రష్యాలోని చెల్యాబిన్స్క్‌పై పడ్డ అంతరిక్ష శిల లాంటివన్నమాట. అలాంటి మరో శిల వందేళ్లలో భూమిని ఢీకొట్టే అవకాశం ఉండొచ్చు. అయితే భూమిపై ఎక్కువ భాగం సముద్రమే ఉంది. కాబట్టి చాలావరకూ సాగరాల్లోనే అవి పడొచ్చు. నాడు చెల్యాబిన్స్క్‌ శిల గాల్లోనే పేలిపోయింది. ఫలితంగా ఉత్పన్నమైన ప్రకంపన వల్ల భవనాల్లో అద్దాలు పగలడం లాంటివి జరిగాయి. కొద్దిమందికి గాయాలయ్యాయి. ఎవరూ చనిపోలేదు. ఆ శిల వస్తున్న విషయాన్ని ముందే పసిగట్టి ఉంటే.. కిటికీల వద్దకు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించి ఉండేవాళ్లం.

'డార్ట్‌' ఏం చేస్తుందంటే..!: భూమి దిశగా ఏదైనా గ్రహశకలం వస్తుందని నిర్ధారించినప్పుడు దాని కక్ష్యలో మార్పు చేయడం ద్వారా సురక్షితంగా పక్కకు మళ్లించడం సాధ్యమేనా అన్నది డార్ట్‌ మిషన్‌ పరీక్షిస్తుంది. ఇందుకోసం డిడిమోస్‌, డైమార్ఫస్‌ అనే జంట గ్రహశకలాలను నాసా ఎంచుకుంది. ఇలాంటి గ్రహశకల వ్యవస్థలో ఒక పెద్ద శిల చుట్టూ చిన్న శిల తిరుగుతూ ఉంటుంది. భూమికి చేరువలో ఉన్న గ్రహశకలాల్లో ప్రతి ఐదింట్లో ఒకటి ఇలాంటి జంట గ్రహశకల వ్యవస్థే. ఇక్కడ డిడిమోస్‌ చుట్టూ డైమార్ఫస్‌ తిరుగుతోంది. నిజానికి ఈ గ్రహశకల వ్యవస్థతో భూమికి ప్రమాదమేమీ లేదు. ప్రయోగం కోసమే నాసా డైమార్ఫస్‌తో డార్ట్‌ వ్యోమనౌకను ఢీ కొట్టిస్తుంది. దీనివల్ల ఆ గ్రహశకల కక్ష్యలో స్వల్ప మార్పు వస్తుందని అంచనా. దాన్ని భూమి నుంచి కొలవగలమని భావిస్తున్నాం. డార్ట్‌ వ్యోమనౌక ఒక కైనెటిక్‌ ఇంపాక్టర్‌లా పనిచేస్తుంది. అది బాంబు కాదు. వేగమే దాని బలం. ఇలాంటి ప్రయోగం ఇప్పుడు అవసరం. భూమివైపు దూసుకొచ్చే ప్రమాదకర అంతరిక్ష శిలలను దారి మళ్లించాల్సిన తీరు గురించి మనం నేర్చుకోవాలి.

.

గ్రహశకలాలపై మైనింగ్‌ సాధ్యమేనా?: ఇనుము, నికెల్‌, ప్లాటినం గ్రూపు లోహాలు పుష్కలంగా ఉన్న గ్రహశకలాలు చాలా ఉన్నాయి. బంగారం, వెండి, వజ్రాలతో కూడినవి లేవు. అయితే గ్రహశకలాల నుంచి విలువైన ఖనిజాలను వెలికితీయాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదు. భవిష్యత్తులో సుదూర అంతరిక్ష యాత్రలు చేపట్టినప్పుడు.. ఆస్ట్రాయిడ్ల నుంచి నీటిని సేకరించాల్సిన అవసరం రావొచ్చు. ఆ నీటిని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌గా విడగొట్టి, గ్రహాంతర వ్యోమనౌకలకు ఇంధనంగా, ఆక్సిడైజర్‌గా ఉపయోగించొచ్చు. నిజానికి అందుకోసం ఇప్పటికే అనేక ప్రయత్నాలు జరిగినా అవేవీ ఫలించకపోవడంతో.. ప్రస్తుతం స్తబ్ధత ఏర్పడింది. కొద్దికాలం తర్వాత దీనిపై మళ్లీ ఆసక్తి పెరగడం ఖాయం.

.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.