Email Tracking: ఈమెయిల్‌ ట్రాకింగ్‌.. ఈ మార్పులు చేశారా?

author img

By

Published : Sep 22, 2021, 1:24 PM IST

Email Tracking

సాంకేతికత కొత్త పుంతలు తొక్కే కొద్ది.. వివిధ రకాలుగా సైబర్​ దాడులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటి వరకు మనకు ఒక చిన్న లింక్​ను పంపి సమాచారాన్ని కొల్లగొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఏకంగా మనం రోజు వాడే ఈ మెయిల్​ సర్వీసులను ఆసరాగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు. చక్కగా కనిపించే ప్రకటనలను మెయిల్​కు పంపి వాటిని ఓపెన్​ చేయగానే మన వ్యక్తిగత సమాచారాన్ని సదుర కంపెనీలకు చేరవేస్తూ.. మెయిల్​ ట్రాకింగ్​కు (Email Tracking) పాల్పడుతున్నారు. దీని నుంచి మన మెయిల్​ను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.

మనం ఉపయోగించే ఈమెయిల్‌ సర్వీసుల్లో ప్రకటనలకు సంబంధించిన మెయిల్స్ ఎన్నో చూస్తుంటాం. ఆకర్షణీయమైన ఆఫర్లతో యూజర్స్‌ వాటిని క్లిక్ చేసేలా చేస్తుంటాయి సదరు కంపెనీలు. అయితే వాటిని ఓపెన్ చేసిన వెంటనే అందులోని 'ఈమెయిల్ ట్రాకింగ్ పిక్సెల్స్‌' (Email Tracking) (ప్రకటనలతో కూడిన ఫొటోలు) మీరు మెయిల్ ఓపెన్ చేశారా? లేదా? మెయిల్ ఓపెన్ చేసి ఎంతసేపు ఉంచారు వంటి సమాచారాన్ని సదరు కంపెనీ సర్వర్లకు చేరవేస్తాయి. దాని ఆధారంగా ఆయా కంపెనీలు మీకు ప్రకటనలు పంపిస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ పిక్సెల్స్‌ యూజర్ల సమాచారాన్ని ఆయా కంపెనీలకు చేరవేయడంతోపాటు సైబర్‌ దాడులు జరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ట్రాకింగ్ పిక్సెల్స్‌ నుంచి ఎలా తప్పించుకోవాలి? అందుకోసం మనం ఉపయోగించే జీమెయిల్‌, మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్‌, యాపిల్‌ మెయిల్‌ సర్వీసుల్లో ఎలాంటి మార్పులు చేయాలో తెలుసుకుందాం.

జీమెయిల్‌

జీమెయిల్‌లో (Gmail) ఫొటోలు వాటంతటవే లోడ్ కాకుండా ఉండేందుకు ముందుగా జీమెయిల్‌ని డెస్క్‌టాప్‌ బ్రౌజర్‌లో ఓపెన్ చేయాలి. అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆల్‌ సెట్టింగ్స్‌పై క్లిక్ చేస్తే జనరల్‌ ట్యాబ్ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్‌ చేస్తే ఇమేజెస్ అనే ఆప్షన్‌ ఉంటుంది. అందులో మీకు 'ఆల్వేస్‌ డిస్‌ప్లే ఎక్స్‌టర్నల్‌ ఇమేజెస్‌', 'ఆస్క్‌ బిఫోర్ డిస్‌ప్లేయింగ్‌ ఎక్స్‌టర్నల్‌ ఇమేజెస్' అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో రెండో ఆప్షన్ ఎంచుకుని సేవ్‌ బటన్‌ క్లిక్ చేయాలి. తర్వాత మీరు ప్రకటనలతో ఉన్న మెయిల్స్‌ ఓపెన్ చేసిన ప్రతిసారీ అందులోని ఫొటోలు చూపించాలా? వద్దా? అనే మెసేజ్‌ మీకు కనిపిస్తుంది. అందుకు మీరు అనుమతించకపోతే సదరు ఫొటోలు మీకు మెయిల్‌లో కనిపించవు.

Email Tracking
జీమెయిల్‌

మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్‌

అవుట్‌లుక్‌లో మాత్రం ప్రకటనలతో వచ్చే ఫొటోలను మైక్రోసాఫ్ట్‌ ఆటోమేటిగ్గా బ్లాక్ చేస్తుంది. ఒకవేళ మీరు మెయిల్‌ ఓపెన్ చేసిన తర్వాత ఫొటో చూడాలనుకుంటే ఈమెయిల్ బ్యానర్‌పై ఉన్న డౌన్‌లోడ్ పిక్చర్స్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. అలాకాకుండా మీరు మెయిల్ ఓపెన్ చేయగానే ప్రకటనలకు సంబంధించిన ఫొటోలు కనిపిస్తుంటే అవుట్‌లుక్ (Microsoft Outlook) డెస్క్‌టాప్ యాప్‌లో ఫైల్‌లోకి వెళ్లి ఆప్షన్స్‌పై క్లిక్ చేస్తే మీకు ట్రస్ట్ సెంటర్‌ కనిపిస్తుంది. అందులో ట్రస్ట్ సెంటర్‌ సెట్టింగ్స్‌ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్‌ డౌన్‌లోడ్, డోంట్‌ డౌన్‌లోడ్ పిక్చర్స్‌ ఆటోమేటికల్లీ ఇన్ ఆర్‌ఎస్‌ఎస్‌/స్టాండర్డ్‌ హెచ్‌టీఎమ్‌ఎల్‌ ఈమెయిల్ మెసేజెస్‌ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో రెండో ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.

Email Tracking
మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్‌

యాపిల్ మ్యాక్‌లో అవుట్‌లుక్‌ ఉపయోగించే యూజర్స్‌ ప్రకటనలతో కూడిన ఫొటోలు చూడాలనుకుంటే మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్‌లో ప్రిఫరెన్సెస్‌లోకి వెళ్లి రీడింగ్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత సెక్యూరిటీలోకి వెళ్లి 'నెవర్‌ టు రిస్ట్రిక్టిక్‌ ఇమేజ్‌ డౌన్‌లోడ్స్‌' లేదా 'ఆటోమేటికల్లీ డౌన్‌లోడ్ ఇమేజెస్‌ ఓన్లీ ఫ్రమ్‌ యువర్ కాంటాక్ట్స్‌' అనే ఆప్షన్లు ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.

యాపిల్ మెయిల్‌

మ్యాక్‌ యూజర్స్‌ యాపిల్ మెయిల్ (Apple Mail) యాప్ ఓపెన్ చేసి ఆటోమేటిక్‌ ఇమేజ్‌ లోడింగ్‌ ఫీచర్‌ను డిసేబుల్ చేస్తే సరిపోతుంది. ఇందుకోసం మెయిల్‌లోకి వెళ్లి ప్రిఫరెన్సెస్‌లో వ్యూయింగ్‌లో 'లోడ్‌ రిమోట్ కంటెంట్ ఇన్ మెసేజెస్‌' అనే ఆప్షన్‌ డిసేబుల్ చేయాలి. అలా మీ మెయిల్స్‌కి వచ్చే ప్రకటనలతో కూడిన ఫొటోలు కనిపించకుండా.. అవి మీ యాక్టివిటీని ట్రాక్‌ చేయకుండా చేయొచ్చు. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ యాపిల్ ఐఓఎస్‌ 15లో మ్యూట్ బటన్‌ అనే కొత్త ఫీచర్‌ని తీసుకొస్తుంది. దానిపై క్లిక్ చేసిన ప్రతిసారీ మీకు బీప్ సౌండ్ వినిపిస్తుంది. దాంతో పిక్సెల్స్ మీ యాక్టివిటీని ట్రాక్ చేయలేవని యాపిల్‌ వెల్లడించింది.

Email Tracking
యాపిల్ మెయిల్‌

ఇదీ చూడండి: Short Videos: షార్ట్ వీడియోస్.. ప్రభావం మాత్రం గట్టిగానే..!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.