మరిన్ని కొత్త హంగులతో ముందుకొచ్చిన ఆండ్రాయిడ్

author img

By

Published : Sep 28, 2022, 9:06 AM IST

google android latest features

Android Latest Version 2022 : ఐఓఎస్​ లాగే ఆండ్రాయిడ్​ సైతం నిరంతరం అప్డేట్లు ఇస్తూనే ఉంటుంది. యూజర్​కు ఫోన్​ వాడేందుకు వీలుగా ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇటీవలే విడుదలైన కొత్త ఫీచర్లను ఓ సారి చూసేద్దామా...

Android Latest Version 2022 : యాపిల్‌ ఐఓఎస్‌ మాదిరిగానే గూగుల్‌ ఆండ్రాయిడ్‌ సైతం నిరంతరం అప్‌డేట్లు, కొత్త ఫీచర్లను ప్రవేశ పెడుతోంది. ఆత్మీయులతో సంభాషించటం దగ్గర్నుంచి మరింత వినోదాన్ని పొందటానికీ వినూత్న సదుపాయాలు కల్పిస్తోంది. తేలికగా షేరింగ్‌ చేసుకోవటం, యాప్స్‌ను ఇంకాస్త బాగా వినియోగించుకోవటం, గేమ్స్‌ను కొత్తగా ఆడుకోవటం వంటి వాటి కోసం ఇటీవల కొత్త ఫీచర్లనూ తీసుకొచ్చింది. వీటిల్లో కొన్ని ఇవీ..

తేలికగా ఫైళ్ల బదిలీ
దగ్గర్లోని ఆండ్రాయిడ్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు, క్రోమ్‌బుక్స్‌ మధ్య ఫైళ్లను తేలికగా, సురక్షితంగా షేర్‌ చేసుకోవటానికి నియర్‌బై షేర్‌ యాప్‌ తోడ్పడుతుంది. దీంతో ఫొటోలు, వీడియోలనే కాదు మొత్తం ఫోల్డర్లనూ పంపించుకోవచ్చు. ఇందుకోసం మన గూగుల్‌ ఖాతాతో లాగిన్‌ అయిన ఆండ్రాయిడ్‌ పరికరాలను ఎంచుకుంటే సరి. షేరింగ్‌ మెనూ ద్వారా అవసరమైన ఫైళ్లను ఎటు నుంచి ఎటైనా పంచుకోవచ్చు. ఒకసారి దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే స్క్రీన్‌ ఆఫ్‌లో ఉన్నా కూడా మన పరికరాల మధ్య వాటంతటవే ఫైళ్లు బదిలీ అవుతాయి.

వర్క్‌స్పేస్‌ యాప్స్‌ అధునాతం
పెద్ద తెరలతో కూడిన పరికరాల కోసం గూగుల్‌ ఇటీవల వర్క్‌స్పేస్‌ యాప్స్‌ను ఆధునికీకరించింది. ఇప్పుడు మల్టీ-టాస్కింగ్‌ను సులభతరం చేయటానికి ట్యాబ్లెటకూ గూగుల్‌ యాప్స్‌ను అప్‌డేట్‌ చేయటం ఆరంభించింది. ఇందులో భాగంగా గూగుల్‌ డ్రైవ్‌, కీప్‌ విడ్జెట్లను మరింత అందంగా కనిపించేలా తీర్చిదిద్దింది. కొత్త గూగుల్‌ డ్రైవ్‌ విడ్జెట్‌లో మూడు హోం స్క్రీన్‌ బటన్లు ఉంటాయి. వీటితో ఒకేసారి గూగుల్‌ డాక్స్‌, గూగుల్‌ స్లైడ్స్‌, గూగుల్‌ షీట్స్‌ ఫైళ్లను యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఇక గూగుల్‌ కీప్‌లోనైతే పెద్ద విడ్జెట్‌ దర్శనమిస్తుంది. ఫాంట్‌ సైజూ పెద్దగానే ఉంటుంది. నోట్స్‌ తీసుకోవటం, చేయాల్సిన పనుల జాబితా రూపొందించుకోవటం తేలికవుతుంది. రిమైండర్లనూ తేలికగా యాక్సెస్‌ చేసుకోవచ్చు.

ఒకే సమయంలో వంద మందితో
గూగుల్‌ మీట్‌లో కొత్త షేరింగ్‌ అనుభవాలను అందించే ఫీచర్లనూ గూగుల్‌ ప్రవేశ పెడుతోంది. లైవ్‌ షేరింగ్‌ ఫీచర్‌ ద్వారా అదే సమయంలో ఇతరులతో కలిసి ఇష్టమైన యూట్యూబ్‌ వీడియోలను చూసుకోవచ్చు. ఒకే సమయంలో వంద మంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి గేమ్స్‌ ఆడుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లకు అమలు చేయనుంది.

పదాలతోనే ఎమోజీలు
కొన్నిసార్లు పదాల కన్నా ఎమోజీలతోనే భావాలను బాగా వ్యక్తీకరించటం సాధ్యమవుతుంది. అందుకే గూగుల్‌ దీన్ని కొత్తగా తీర్చిదిద్దటం మీద దృష్టి సారించింది. వ్యక్తం చేయాలనుకున్న భావానికి కచ్చితంగా సరిపోయే ఎమోజీలను ఎంచుకోవటం కోసం కొత్త ఫీచర్లను జోడించింది. తగిన ఎమోజీని ఎంచుకోవటం కష్టమైన సమయాల్లో మెసేజ్‌లనే ఎమోజీలుగా మార్చే వీలు కల్పించింది. జీబోర్డు ద్వారా వాక్యాన్ని టైప్‌ చేసి, ఎమోజీఫై బటన్‌ను తాకితే ఇష్టమైన లేఅవుట్‌ కనిపిస్తుంది. ఇందులో సెండ్‌ను నొక్కితే రైట్‌ ఎమోజీ మ్యాజిక్‌ సాయంతో ఆ వాక్యానికి తగిన బొమ్మ ప్రత్యక్షమవుతుంది. షేర్‌ చేసుకోవటమే తరువాయి. ఈ ఫీచర్‌ ప్రస్తుతం జీబోర్డు బీటా యాప్‌లో ఇంగ్లిష్‌లోనే అందుబాటులో ఉంది. త్వరలో అన్ని జీబోర్డు ఇంగ్లిష్‌ టైపర్లకూ విస్తరించనున్నారు.

సౌండ్‌ నోటిఫికేషన్లు
లైవ్‌ ట్రాన్‌స్క్రయిబ్‌ అండ్‌ నోటిఫికేషన్లలో సౌండ్‌ నోటిఫికేషన్లు మరో కొత్త ఫీచర్‌. వినికిడి లోపం గలవారి అనుభవాల ఆధారంగా దీన్ని రూపొందించారు. దీంతో ఫైర్‌ అలారం, నీరు కారిపోవటం, తలుపు గొళ్లాల వంటి ఇంటి పనులకు సంబంధించిన నోటిఫికేషన్లు శబ్దం రూపంలో ఫోన్‌ లేదా వాచ్‌లకు అందుతాయి. అలాగే వైబ్రేషన్‌, ఫ్లాషింగ్‌ లైట్‌తోనూ అప్రమత్తం చేస్తాయి. వినికిడి లోపం గలవారికివి ఎంతో మేలు చేస్తాయి. హెడ్‌ఫోన్స్‌ ధరించినప్పుడూ ఈ సౌండ్‌ నోటిఫికేషన్లు ఉపయోగపడతాయని అనటంలో సందేహం లేదు.

ఇదీ చదవండి: గూగుల్​ సెర్చ్​లో మీ పర్సనల్ ఇన్ఫో వస్తోందా? డిలీట్ చేయండిలా!

సరికొత్తగా 'ఐమెసేజ్​'.. మరిన్ని నయా ఫీచర్లతో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.