మార్స్ నుంచి ఏలియన్స్ సందేశం! డీకోడ్ చేయలేక సైంటిస్టుల ఇబ్బందులు.. హెల్ప్ చేస్తారా?

author img

By

Published : May 26, 2023, 10:31 AM IST

alien signal mars

Alien Signal From Mars : గ్రహాంతరవాసులు జీవిస్తున్నారా? వారు ఏ గ్రహం మీద ఉన్నారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కోసం చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. కాగా.. అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్‌ చేసి వచ్చిన సమాచారాన్ని యూరప్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్‌ ట్రేజ్‌ గ్యాస్‌ ఆర్బిటార్‌.. భూమికి చేరవేసింది. ఇలా ఇతరగ్రహాల నుంచి ఎన్‌కోడెడ్‌ సమాచారం రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Alien Signal From Mars : కేవలం భూమి మీదనే జీవజాలం ఉందా? అంతరిక్షంలో ఇలాంటి గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా? అక్కడ జీవం ఉందా.. గ్రహాంతరవాసులు జీవిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గ్రహాంతరవాసుల గురించి కచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ.. ఏదో ఒక గ్రహంపై జీవిస్తున్నారనేదే అందరి నమ్మకం. వాటికి మరింత ఊతమిచ్చే ఘటన తాజాగా జరిగింది. భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్‌ చేసిన ఓ సమాచారాన్ని యూరప్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్‌ ట్రేస్‌ గ్యాస్‌ ఆర్బిటార్‌(టీజీఓ) భూమికి చేరవేసింది. అంగారకుడి చుట్టూ తిరుగుతూ అక్కడి పరిస్థితులను నిశితంగా గమనించేందుకు యూరప్‌ స్పేస్‌ ఏజెన్సీ టీజీఓను గతంలో ప్రయోగించింది. అయితే, ఈ సందేశాన్ని గ్రహాంతర వాసులే పంపించారా? అనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు.

అంగారక గ్రహం నుంచి సమాచారాన్ని స్వీకరించిన టీజీఓ 16 నిమిషాల్లో ఆ సందేశాన్ని ఎర్త్‌ స్టేషన్‌కు చేరవేసింది. అందులో ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక వేళ అది గ్రహాంతర వాసులే పంపిన సమాచారమైతే.. ఈ ఘటన చరిత్రలో నిలిచిపోతుందని 'ఎ సైన్స్‌ ఇన్‌ స్పేస్‌' ప్రాజెక్టులో భాగమైన డానియేలా ది పౌలిస్‌ తెలిపారు. 'ఇది చరిత్రలోనే నిలిచిపోయే ఘటన. గ్రహాంతరవాసుల ఉనికి కోసం ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇతర గ్రహాలపైనున్న జీవరాశుల నుంచి ఓ సందేశం రావడం భవిష్యత్‌ పరిశోధనలకు పునాది వేస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు ఊతమిస్తోంది' అని పౌలిస్‌ అన్నారు.

అయితే, ఎన్‌కోడ్‌ చేసిన ఆ సందేశంలో ఏముందో తెలుసుకోవడం శాస్త్రవేత్తలకు కఠిన సమస్యగా ఉంది. దానిని డీకోడ్‌ చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నవారికి అవకాశం కల్పించారు. శాస్త్రసాంకేతిక పరంగానే కాకుండా ఆ సందేశంలో సాంస్కృతిక పరమైన అంశాలేమైనా ఉన్నాయా?అనే కోణంలోనూ పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్‌ చేసి వచ్చిన సిగ్నల్స్‌ను https://asignin.space/the-message/ అనే వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఆసక్తి ఉన్న వారు వాటిని డీ కోడ్‌ చేసి, దాని అర్థాన్ని తిరిగి శాస్త్రవేత్తలకు పంపించవచ్చు.

'ఏలియన్లు భూమిని సందర్శించాయా?'
గ్రహాంతరవాసులు, వారి వ్యోమనౌకలుగా భావిస్తున్న ఫ్లయింగ్‌ సాసర్లు భూమిపై ఉన్నాయా? లేవా?..అనే అంశం చాలా ఏళ్లుగా అంతుచిక్కని రహస్యమే. అయితే.. ఏలియన్లు భూమిని సందర్శించినట్లు, లేదా ఇక్కడ దిగినట్లు చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని అమెరికా సీనియర్ సైనిక అధికారులు గతేడాది డిసెంబరులో వెల్లడించారు. యూఎఫ్‌వో సంబంధిత ఘటనలపై రూపొందిన వందలాది నివేదికలను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇంటెలిజెన్స్, భద్రత కోసం అమెరికా రక్షణశాఖ అండర్ సెక్రెటరీ రోనాల్డ్ మౌల్ట్రీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.