అవమాన భారంతో చైనా.. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా?

author img

By

Published : Aug 5, 2022, 8:46 AM IST

world war 3 latest news

World War 3 latest news : అమెరికా కాంగ్రెస్​ దిగువ సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన చైనాను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. ఆంక్షలు, సైనిక విన్యాసాలు, క్షిపణుల ప్రయోగంతో ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు కారణమైంది డ్రాగన్ ప్రభుత్వం. ఇది ఇంతటితో ఆగుతుందా? మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా?

China Taiwan war reason : ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) దిగువ సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ను సందర్శించడం సంచలనం సృష్టిస్తోంది. పెలోసీ యాత్రపై చైనా మండిపడటంతో మరో కొత్త యుద్ధం మొదలవుతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. తైవాన్‌లో ఒక ఉన్నతస్థాయి అమెరికా ప్రతినిధి అధికారికంగా పర్యటించడం 25 ఏళ్ల తరవాత ఇదే తొలిసారి. పెలోసీ తైవాన్‌కు వస్తున్నారని తెలిసినప్పటి నుంచే ఆ ప్రయత్నం మానుకోవాలని చైనా డిమాండ్‌ చేసింది. తీరా ఆమె రానే వచ్చారు. దానికి ప్రతిగా తైవాన్‌ నుంచి పండ్లు, చేపల దిగుమతిపై బీజింగ్‌ ఆంక్షలు విధించింది. చైనా నుంచి తైవాన్‌కు ఇసుక ఎగుమతిని నిలిపి వేసింది. తైవాన్‌ తీరం చుట్టూ డ్రాగన్‌ సేనలు భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాలు మొదలు పెట్టాయి. చైనా యుద్ధ విమానాలు తైవాన్‌ తీరానికి సమీపంలో చక్కర్లు కొట్టాయి. పెలోసీ యాత్రను సాకుగా చూపి తైవాన్‌పై దాడికి దిగవద్దని బైడెన్‌ సర్కారు చైనాను హెచ్చరించింది. నిజానికి తైవాన్‌ చైనాలో అంతర్భాగమని మొదట అమెరికాయే ప్రకటించింది. దాన్నే 'ఒకే చైనా' విధానమంటారు. సోవియట్‌ యూనియన్‌కు పోటీగా బీజింగ్‌ను దగ్గర చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ 1972లో ఒకే చైనా విధానాన్ని ముందుకు తెచ్చారు.

డ్రాగన్‌ అవమాన భారం
చైనాలో 1949 అంతర్యుద్ధంలో ఓడిపోయిన కొమింటాంగ్‌ పార్టీ సమీపంలోని ఫార్మోజా దీవి (నేటి తైవాన్‌)కు పారిపోయి రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చైనా ప్రధాన భూభాగంలో పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాను కమ్యూనిస్టు పార్టీ స్థాపించింది. చైనా, తైవాన్‌ వేరుకావని, అవి ఒకే దేశమని కమ్యూనిస్టు పార్టీ చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15 రాజ్యాలే తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నాయి. ఒకే చైనా విధానాన్ని భారత్‌, అమెరికాలతో సహా అత్యధిక దేశాలు ఆమోదిస్తున్నాయి. చైనా, తైవాన్‌ల ఏకీకరణ బలప్రయోగంతో కాకుండా పరస్పర అంగీకారంతో జరగాలని అగ్రరాజ్యం స్పష్టం చేస్తోంది.

China Taiwan issue : 1980ల నుంచి తైవాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడసాగాయి. ఒకప్పడు చైనాకు శత్రువైన కొమింటాంగ్‌ పార్టీ క్రమంగా బీజింగ్‌కు అనుకూలంగా మారింది. ఆ పార్టీయే ఇటీవలిదాకా ఎక్కువసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చింది. 1992లో ఒకే చైనా విధానాన్ని ఆమోదిస్తూ కొమింటాంగ్‌, చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏకాభిప్రాయ ప్రకటన చేశాయి. చైనా, తైవాన్‌ల మధ్య వ్యాపార, పెట్టుబడి సంబంధాలు బలోపేతమయ్యాయి. అది కాలక్రమంలో తైవాన్‌ శాంతియుత విలీనానికి దారి తీస్తుందని బీజింగ్‌ ఆశిస్తూ వచ్చింది. తైవాన్‌ ప్రత్యేక దేశంగా మనుగడ సాగించాలని ఉద్ఘాటించే డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (డీపీపీ) 2016 జనవరిలో తైవాన్‌లో అధికారం చేపట్టింది. అప్పటి నుంచి చైనా ఆశలు ఆవిరి కాసాగాయి.

2020 ఎన్నికల్లో డీపీపీ కొమింటాంగ్‌ను చిత్తుగా ఓడించి తైవాన్‌పై పట్టు పెంచుకుంది. ఆ పార్టీకి అమెరికా దన్ను లభిస్తోంది. అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒకే చైనా విధానాన్ని పక్కనపెట్టి తైవాన్‌, అమెరికా అధికారుల రాకపోకలకు ఆమోదముద్ర వేశారు. తైవాన్‌కు ఆధునిక ఆయుధాలు సరఫరా చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ సైతం అదే పంధా అనుసరిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తినట్లు చైనా సైతం తైవాన్‌పై విరుచుకుపడవచ్చని అమెరికా, నాటో దేశాలు కలవరపడుతున్నాయి. తైవాన్‌కు సైనిక సహాయం చేయడంతోపాటు ఉన్నత స్థాయి అధికారిక పర్యటనలు జరపడం ద్వారా చైనాను అని హెచ్చరించదలచాయి. నాన్సీ పెలోసీ పర్యటనను ఆ కోణం నుంచే చూడాలి. మరోవైపు ఇదంతా తనను అవమానించడమేనని చైనా భావిస్తోంది.

దుందుడుకు చర్యలతో చేటు
తైవాన్‌ ప్రత్యేక దేశంగా మనుగడ సాగించగలిగితే చైనా అధ్యక్షుడు, సర్వసైన్యాధ్యక్షుడు అయిన జిన్‌పింగ్‌ బలహీనపడతారు. ఇప్పటికే ఆర్థికంగా అమెరికా తరవాతి స్థానాన్ని అందుకున్న చైనా అంతర్జాతీయ ప్రతిష్ఠా మసకబారుతుంది. దాన్ని నివారించడానికే చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తైవాన్‌ సమీపంలో యుద్ధ విన్యాసాలు జరుపుతోంది.

అయితే, పరిస్థితి అదుపు తప్పి సాయుధ పోరాటం ప్రజ్వరిల్లే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. 1962లో సోవియట్‌ యూనియన్‌ క్యూబాకు అణు క్షిపణులు తరలించినప్పుడు అమెరికా తీవ్రంగా ప్రతిఘటించింది. అప్పట్లో రెండు అగ్రరాజ్యాల మధ్య అణు యుద్ధం విరుచుకు పడుతుందేమోనని భయాందోళనలు వ్యాపించాయి. పరిస్థితి అంతదాకా రాకుండానే సమస్య సమసిపోయింది. నేడు ఉక్రెయిన్‌లో రష్యా, తైవాన్‌లో చైనా అమెరికా నుంచి సవాలు ఎదుర్కొంటున్నాయి. అఫ్గానిస్థాన్‌ నుంచి ఉన్నపళాన సేనలను ఉపసంహరించి బైడెన్‌ విమర్శలకు లోనయ్యారు. ఆర్థిక మాంద్య ప్రమాదాన్ని ఆయన నివారించలేక పోతున్నారనే భావనా బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఎవరు దుందుడుకు చర్యలకు దిగినా, అవి ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధంలోకి నెడతాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
- ఆర్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.