విజయం సరిపోదు.. రికార్డులు కొట్టాల్సిందే.. మోదీ 'టార్గెట్ 150' స్కెచ్!

author img

By

Published : Nov 22, 2022, 4:50 PM IST

gujarat-assembly-election

Gujarat Assembly Elections: గుజరాత్ ఎన్నికల్లో మోదీ అన్నీ తానై భాజపాను నడిపిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత వెంటాడుతున్నా... 'నన్ను చూసి ఓటేయండి' అంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. గెలుపుపై ధీమా ఉన్నా.. సాధారణ విజయం సరిపోదని మోదీ భావిస్తున్నారు. రికార్డులు బద్దలు కొట్టేలా పనిచేయాలని శ్రేణులకు పిలుపునిస్తున్నారు.

Gujarat Assembly Elections 2022: గుజరాత్​లో భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచార సరళిని చూస్తుంటే.. ఏడోసారి ఎలాగైనా గెలవాలని కాషాయదళం కంకణం కట్టుకుందని అర్థమవుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందనే భయాలు, పలు నియోజకవర్గాల్లో రెబల్స్ సమస్య వెంటాడుతున్నా.. గెలుపుపై మాత్రం ధీమాతోనే ఉంది. క్షేత్రస్థాయిలో చూస్తే భాజపాదే విజయమని చాలా వరకు స్పష్టంగా తెలుస్తోంది. భాజపా ప్రత్యర్థులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు.అయితే, ఈసారి రాష్ట్రంలో ఎప్పటిలాగే గెలిస్తే సరిపోదని.. రికార్డు మెజార్టీతో విజయం సాధించాలని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. గతంలో నమోదైన రికార్డులను తిరగరాయాలని ఆయన సంకల్పించుకున్నారు. 1985లో మాధవ్​సిన్స్ సోలంకి కాంగ్రెస్​ను గెలిపించిన మాదిరిగానే.. భాజపా రికార్డు విజయం సాధించాలని మోదీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Gujarat assembly polls: గుజరాత్ అసెంబ్లీలో 182 సీట్లు ఉన్నాయి. 1985లో జరిగిన ఎన్నికల్లో సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 149 సీట్లు గెలుచుకుంది. మోదీ హవా ఓ రేంజ్​లో ఉన్న కాలంలో కూడా భాజపా ఈ స్థాయిలో సీట్లు గెలుచుకోలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రికార్డుపై మోదీ కన్నేసినట్లు తెలుస్తోంది. 150 సీట్లలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ కార్యవర్గానికి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అయితే, భాజపా చాణక్యుడు అమిత్ షా లెక్క మాత్రం మరోలా ఉంది. కాస్త వాస్తవిక కోణంలో ఆలోచించే షా.. గుజరాత్​లో 130 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని భావిస్తున్నట్లు సమాచారం.

లెక్కలపై మక్కువెందుకో?
రికార్డు స్థాయి విజయంపైనే ఎందుకు వ్యామోహం అని అడిగితే అందుకు కారణాలు లేకపోలేదు. భారీ విజయం సాధించడం ద్వారా.. గుజరాత్​పై తాము ఏమాత్రం పట్టు కోల్పోలేదని మోదీ.. తన విరోధులకు చాటిచెప్పవచ్చు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వంటి కొత్తవారు బరిలో దిగినా.. తమ అధికారానికి ఢోకా లేదని నిరూపించుకోవచ్చు. ఉచిత పథకాలకు వ్యతిరేకంగా ఉన్న భాజపా.. ఈ ఎన్నికల్లో ఎలాంటి ఉచితాలపై వాగ్దానాలు చేయలేదు. అయినప్పటికీ, ప్రజలు తమ వెంటే ఉన్నారని నిరూపించుకోవడం భాజపాకు అవసరం.

ఆ అంశాలు కలిసొచ్చి..
రెండు అంశాలు తమకు కలిసొస్తాయని భాజపా వర్గాలు భావిస్తున్నాయి. వీటిని తమకు అనుకూలంగా మలచుకొని పనిచేయాలని మోదీ సూచించినట్లు చెబుతున్నాయి. మొదటిది.. ఆప్! రెండు నెలల క్రితం ఫుల్ జోష్​తో గుజరాత్ ఎన్నికల్లోకి అడుగుపెట్టింది ఆమ్ ఆద్మీ. అయితే, అభ్యర్థుల పేర్లు ప్రకటించిన తర్వాత ఈ వేగం నెమ్మదించింది. అభ్యర్థుల్లో చాలా మంది కొత్తవారే ఉండటం ఆప్​కు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని భాజపా భావిస్తోంది.

మరోవైపు, ఆప్ ఒకవేళ ఎన్నికల్లో మెరుగ్గా పోరాడినా.. అది భాజపాకే కలిసొచ్చే అవకాశం ఉంది. చాలా వరకు కాంగ్రెస్ ఓటు బ్యాంకుకే ఆప్ కన్నం వేస్తుందని తెలుస్తోంది. ఇలా, ప్రభుత్వ వ్యతిరేక ఓటును రెండు పార్టీలు చీల్చడం ద్వారా భాజపా లాభపడుతుందని కమలదళం భావిస్తోంది. దీంతో 2017 ఎన్నికల్లో తగ్గిన మెజార్టీని మరింత పెంచుకోవచ్చని అనుకుంటోంది.

అయితే, ఇప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేకత సాధారణమైనది కాదు. మోదీ హయాంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వంతో పోల్చుకుంటున్నారు ప్రజలు. మోదీ దిగిపోయిన తర్వాత రాష్ట్ర సర్కారు పటిష్ఠంగా లేదని భావిస్తున్నారు. కానీ, ఇప్పటికీ గుజరాత్​లో మోదీ వ్యక్తిగత చరిష్మాకు తిరుగులేదు. ప్రజలు మోదీపై విశ్వాసం ఉంచుతున్నారు. అందుకే, గుజరాత్​లో పర్యటించిన తొలి సభలోనే ఎన్నికల బాధ్యతనంతా తన భుజాన ఎత్తుకున్నారు. 'ఈ గుజరాత్​ను తయారు చేసింది నేనే' అంటూ కొత్త నినాదాన్ని వినిపించారు. అప్పటి నుంచి గుజరాత్​లో పర్యటించిన ప్రతిసారి విపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. భాజపాదే అధికారమంటూ చెబుతున్నారు.

మోదీ వ్యక్తిగతంగా ఇచ్చే హామీలపై ప్రజలకు విశ్వాసం ఉంది. అది భాజపాకు తప్పక పనికొస్తుంది. అందువల్లే మోదీ ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. తనను చూసి ఓటు వేయాలని స్పష్టంగా చెబుతున్నారు. ఇదివరకు జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో అయినా.. ప్రస్తుత గుజరాత్ ప్రచారంలో అయినా.. ఈ విషయంలో సంకోచించడం లేదు.

"భాజపా అభ్యర్థి ఎవరనేది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఓటేసే సమయంలో మీకు కమలం గుర్తు కనిపించిందా.. అది మోదీనే అనుకోండి. మీరు కమలానికి వేసే ప్రతి ఓటు మోదీకి ఇచ్చే ఆశీర్వాదంగా భావించండి."
-ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ

ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలని ప్రతి ర్యాలీలో చెబుతున్నారు మోదీ. ఓటింగ్ శాతం విషయంలోనూ గత రికార్డులు బద్దలు కొట్టాలని పిలుపునిస్తున్నారు. 'భాజపాకే ఓటు వేయాలని నేను చెప్పడం లేదు. కానీ ప్రతి పౌరుడు ప్రజాస్వామ్య పండుగలో భాగం కావాలి. అందరికీ ఇది నా విజ్ఞప్తి' అని చెబుతున్నారు. అదే సమయంలో బూత్ స్థాయిలో భాజపాను గెలిపించడానికి దృష్టిపెట్టాలని స్పష్టం చేస్తున్నారు.

ప్రత్యామ్నాయం లేక..
ఇక, ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న గుజరాతీలకు సరైన ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. రాష్ట్రంలో బరిలో ఉన్న రెండు కీలక పార్టీలు ప్రజలను తమవైపు తిప్పుకోవడంలో సఫలం కాలేకపోతున్నాయి. కేజ్రీవాల్ పార్టీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొత్త. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుభూతి బాగానే ఉంది. కానీ, దాన్ని ఉపయోగించుకోకుండా హస్తం పార్టీ చేతులెత్తేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ యంత్రాంగ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అహ్మద్ పటేల్ వంటి వ్యూహచతురుడు లేకపోవడం కూడా ఆ పార్టీకి లోటుగా మారింది.

ఇదీ చదవండి: భాజపాకు మోదీ.. మరి కాంగ్రెస్​, ఆప్​కు విజయ సారథులెవరు?

ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిన సమయంలో మోదీ తీసుకున్న నిర్ణయాలు కొంతమేర పనిచేసినట్లు కనిపిస్తోంది. అమిత్ షా మనిషిగా భావించే సీఎం విజయ్ రూపానీపై అసంతృప్తి పెరగగానే.. 2021 సెప్టెంబర్​లో ఆయన్ను గద్దె దించి.. భూపేంద్ర పటేల్​కు పాలనాపగ్గాలు అప్పగించారు మోదీ. అప్పటివరకు ఉన్న సీనియర్ మంత్రుల్లో చాలా మందిని తొలగించారు. వారిలో కొందరికి ఈసారి టికెట్లు కూడా దక్కలేదు. పటేల్ వర్గం వ్యక్తి సీఎంగా ఉండటం కూడా భాజపాకు కలిసొచ్చే అవకాశం ఉంది.

పటేల్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ వంటి నేతలు సైతం భాజపాలో చేరిన నేపథ్యంలో.. ఆ వర్గం ఓట్లు తమకే వస్తాయని భావిస్తోంది. దీంతో పాటు సౌరాష్ట్రలో సీట్లు గెలుచుకోవడంపై పార్టీ దృష్టిపెట్టాలి. ఆదివాసీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో భాజపా మరింత మెరుగ్గా పనిచేయాల్సి ఉంది. ఈసారి గెలిస్తే మాత్రం భాజపా సరికొత్త చరిత్ర సృష్టించినట్లవుతుంది.

--శేఖర్ అయ్యర్, సీనియర్ పాత్రికేయులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.