Zika Virus: విస్తరిస్తున్న జికా వైరస్‌- మేలుకోకుంటే ముప్పే!

author img

By

Published : Nov 23, 2021, 6:59 AM IST

Zika Virus

దేశం.. ఇప్పుడిప్పుడే కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటుండగా.. పలుచోట్ల జికావైరస్ కేసులు నమోదవడం ​కలవరపాటుకు గురిచేస్తుంది. తొలుత కేరళలో బయటపడిన జికా కేసులు.. తర్వాత మహారాష్ట్ర, ఇప్పుడు ఉత్తర్​ప్రదేశ్​లో బాధితులు పెరుగుతుండటం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్​ వ్యాప్తికి ముందే అడ్డుకట్ట వేయకుంటే తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశమంతా తలమునకలై ఉన్న వేళ- భారత వైమానిక దళ అధికారి ఒకరు జికా వైరస్‌ బారిన పడటం, స్వల్ప వ్యవధిలో ఆ వైరస్‌ కేసులు దేశంలో(zika virus cases in India) పలు ప్రాంతాల్లో వెలుగు చూశాయి. జికా వైరస్‌ను 1947లో ఉగాండా దేశ అడవుల్లోని కోతుల్లో కనుగొన్నారు. ఆ తరవాత 1952లో మనుషుల్లోనూ జికా ఆనవాళ్లను గుర్తించారు. అనంతరం ముప్ఫై ఏళ్ల పాటు ఆఫ్రికా, ఆసియా ఖండాలకే పరిమితమైన ఈ వైరస్‌ కేసులు 2007నుంచి ఇతర ఖండాలకూ పాకాయి. 2015-16లో అమెరికా దేశాల్లో జికా విజృంభించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దాన్ని మానవాళికి తీవ్ర ముప్పుగా పరిగణించింది. భారత్‌లో(zika virus in India) తొలిసారిగా 2017లో గుజరాత్‌, తమిళనాడుల్లో, తరవాతి ఏడాది రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో జికా కేసులు బయటపడ్డాయి. రెండేళ్లుగా స్తబ్ధుగా ఉన్న వైరస్‌ గత జులైలో కేరళ, మహారాష్ట్రల్లో వెలుగుచూసింది. ఉన్నట్టుండి ఉత్తర్‌ ప్రదేశ్‌లో పెరిగిన కేసులు దేశాన్ని కలవరపాటుకు గురిచేశాయి.

నివారణే మార్గం

జికా అనేది ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన వైరస్‌. డెంగీ, ఎల్లో ఫీవర్‌, జపనీస్‌ ఎన్‌కెఫలైటిస్‌ వైరస్‌ జాతులూ ఈ కుటుంబానికి చెందినవే. దోమ కాటు ద్వారా ఈ వైరస్‌లు వ్యాప్తి చెందుతాయి. మన దేశంలో ఎక్కువగా ఉండే ఏడిస్‌ ఈజిప్టై, ఏడిస్‌ ఆల్బోపిక్టస్‌ దోమ జాతులు జికా వైరస్‌కు వాహకాలుగా పనిచేస్తాయి. పగటి వేళల్లో సంచరించే ఈ దోమల వల్లనే డెంగీ, చికున్‌గన్యా వ్యాధులూ వ్యాప్తి చెందుతాయి. దోమలద్వారానే కాకుండా తల్లినుంచి గర్భంలో ఉన్న శిశువుకు, రక్త, అవయవ మార్పిడి, శరీర స్రావాల ద్వారానూ జికా(zika virus is spread by) వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ సంక్రమించిన తరవాత 3-14 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు(zika virus symptoms) బయటపడతాయి. జ్వరం, కళ్లు ఎర్రబారడం, కీళ్లు, కండరాలు, చేతులు, పాదాలు, తల, కళ్ల నొప్పులు, అలసట వంటివి ప్రధాన లక్షణాలు. జికా వైరస్‌ సోకినా చాలా మందిలో ఎటువంటి లక్షణాలూ కనిపించవు. తల్లి ద్వారా గర్భంలోని శిశువుకు ఈ వైరస్‌ సోకినప్పుడు గర్భస్రావం, కడుపులోనే శిశువు మరణించడం, నెలలు నిండకుండానే కాన్పు వంటి సమస్యలు తలెత్తవచ్చు. మైక్రోసెఫలీ (చిన్న తల) వంటి శాశ్వత వైకల్యంతోనూ శిశువులు జన్మించవచ్చు. ఫలితంగా బుద్ధి మందగించడంతో పాటు, ఎదుగుదల లోపాలూ ఎదురవుతాయి. ఇటువంటి జననాలు తొలిసారిగా 2015-16లో బ్రెజిల్‌లో కనిపించాయి. గీలన్‌బా సిండ్రోమ్‌ అని పిలిచే పక్షవాతాన్ని పోలిన వ్యాధినీ జికా వైరస్‌ కలిగించే అవకాశం ఉంది. ఈ వైరస్‌ ఆనవాళ్లను రక్తం, మూత్రం, వీర్య నమూనాలతో నిర్ధారించవచ్చు. ఇప్పటిదాకా దీనికి కచ్చితమైన చికిత్సా విధానం అందుబాటులో లేదు. అందువల్ల వ్యాధి నివారణే మన ముందున్న ఏకైక మార్గం.

జికా వైరస్‌ విజృంభిస్తే భారత్‌లో దాదాపు 46కోట్ల మంది దాని బారిన పడే ప్రమాదం ఉందని ఒక అంచనా. మన దేశ ఉష్ణ వాతావరణం, అంటువ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తి గురించి ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడం వల్ల ఏడాది పొడవునా జికా వైరస్‌ సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. భారత్‌లో జికా కేసులు స్వల్పంగా నమోదవుతున్నప్పటికీ డెంగీ వ్యాధి స్థిరంగా ఉండటం వల్ల, ఆ వ్యాధి సోకినవారిలో జికా వైరస్‌ వల్ల కలిగే దుష్పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. జికా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసింది. వ్యాధి వ్యాప్తిచెందే అవకాశాలను ఎప్పటికప్పుడు సమీక్షించడం, ప్రయోగశాలలను సిద్ధం చేయడం, దోమల నియంత్రణపై దృష్టి సారించడం వంటి చర్యలు తీసుకుంటోంది. ఈ వైరస్‌ను నివారించాలంటే ప్రజల్లో అవగాహన పెంచడం తప్పనిసరి. ముఖ్యంగా గర్భిణుల సంరక్షణపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

దోమలను నియంత్రించాలి

జాతీయ సాంక్రామిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమం కింద భారత ప్రభుత్వం దోమల నియంత్రణకు పలు చర్యలు చేపట్టింది. అయినా వాటి ద్వారా వ్యాపించే వ్యాధులు ఇప్పటికీ ఇండియాకు సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. దోమల నియంత్రణలో ఆధునిక పద్ధతుల పట్ల ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడంతో వాటి సంతతి వృద్ధి చెందుతోంది. ఫలితంగా డెంగీ కేసులు స్వల్ప సంఖ్యలోనైనా స్థిరంగా నమోదవుతున్నాయి. చికున్‌గన్యా ఉద్ధృతమవుతోంది. దోమల నియంత్రణకు 2017లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్‌ మస్కిటో డెన్సిటీ సిస్టం వంటి అధునాతన సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. స్థానిక సంస్థల సహకారంతో పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో పెద్దయెత్తున అవగాహన కల్పించాలి. వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి పారుదల సక్రమంగా సాగేలా ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇప్పటికే డెంగీ, చికున్‌గన్యా కేసులతో సతమతమవుతున్న దేశానికి, జికా వైరస్‌ ఉద్ధృతి సైతం తోడైతే తీవ్ర పరిణామాలు తప్పవు.

రచయిత- డాక్టర్‌ మహిష్మ.కె, వైద్యరంగ నిపుణులు

ఇదీ చూడండి: భారీ వర్షాలతో బెంగళూరు బెంబేలు- వాగులను తలపించిన వీధులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.