టాటా, బిర్లా ముందుచూపు.. స్వాతంత్ర్యానికి ముందే పక్కా ప్లాన్!

author img

By

Published : Aug 10, 2022, 4:37 PM IST

tata birla plan 1944

AZADI KA AMRIT MAHOTSAV: ఒకవైపు వ్యాపారంలో ఆంగ్లేయులతో పోటీ పడుతూ.. మరోవైపు స్వాతంత్య్రోద్యమానికి అండగా నిలిచిన భారత పారిశ్రామికవేత్తలు.. మరో అడుగు కూడా ముందే వేశారు! అదే.. స్వాతంత్య్రానంతర భారతావనికి దార్శనికపత్రం రూపొందించటం. ఆంగ్లేయులు పంద్రాగస్టు అనే తేదీని ప్రకటించకముందే.. రెండో ప్రపంచ యుద్ధం ఇంకా ముగియకముందే.. టాటా, బిర్లా తదితర పారిశ్రామికవేత్తలంతా కలసి ముందుచూపుతో 1944లోనే స్వతంత్ర భారత పారిశ్రామిక ప్రణాళికను రచించారు. అదే బొంబాయి ప్లాన్‌ 1944!

Indian Independence day 2022: రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి ఒకవైపు బెంగాల్‌ క్షామం, మరోవైపు క్విట్‌ఇండియా ఉద్యమం రెండూ ఉద్ధృతంగా ఉన్నాయి. దాంతో ఇక స్వాతంత్య్రం ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేస్తుందనే అంతా భావించారు. ఆ ఉత్సాహంతోనే కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి ఏకంగా పదిహేనేళ్ల వరకు మార్గసూచిగా నిలిచేలా కొందరు పారిశ్రామికవేత్తలు, నిపుణులు కలిసి సమగ్ర ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేశారు. ఆ మహామహుల్లో జేఆర్‌డీ టాటా, జీడీ బిర్లా, పురుషోత్తమ్‌దాస్‌ ఠాకుర్‌దాస్‌, అర్దేశిర్‌ ష్రాఫ్‌, కస్తూర్‌భాయ్‌ లాల్‌భాయ్‌, అర్దేశిర్‌ దలాల్‌, జాన్‌ మతాయ్‌, లాలా శ్రీరామ్‌ ఉన్నారు.

Tata Birla plan 1944: ప్రభుత్వ జోక్యం, నియంత్రణ ఏవీ అవసరం లేకుండానే దేశంలో ఆర్థికవృద్ధి సాధ్యమేనని ఈ ప్రణాళిక తేల్చిచెప్పింది. విదేశీ కంపెనీల పోటీ నుంచి స్థానిక పరిశ్రమలకు రక్షణ కల్పించాలని సూచించింది. వ్యవసాయాధారిత దేశంలో క్రమంగా పారిశ్రామికీకరణ దిశగా మార్పు రావాలంది. జాతీయ ప్రణాళిక ద్వారా వనరులను కేటాయించాలని, ప్రాథమిక పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో ఉండాలని, వినియోగదారులకు అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలను ప్రైవేటు రంగానికి విడిచిపెట్టాలని చెప్పింది. ప్రాథమిక పరిశ్రమల్లో రవాణా, రసాయనాలు, విద్యుదుత్పత్తి, ఉక్కు ఉత్పత్తి లాంటివాటిని ప్రస్తావించింది. ప్రాథమిక పరిశ్రమలను జాతీయీకరిస్తే ఆర్థిక అసమానతలు తగ్గుతాయని, తద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపింది. పౌరులకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలను మాత్రం ప్రభుత్వమే కల్పించాలని తేల్చిచెప్పింది.

మూడు పంచవర్ష ప్రణాళికలుగా..
దేశానికి కావల్సిన వనరులను ఏయే రంగాలకు ఎంతెంత కేటాయించాలి, ఎంత మొత్తంతో ప్రణాళికలు రచించాలి, ఆ మొత్తాలను కాలక్రమంలో ఎలా పెంచుకుంటూ వెళ్లాలన్న విషయంలో నాటి ఆర్థిక నిపుణులకు పూర్తి స్పష్టత ఉంది. మొదటి పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి రూ.790 కోట్లు, రెండో ప్రణాళికలో రూ.1,530 కోట్లు, మూడో ప్రణాళికలో రూ.2,160 కోట్లు కేటాయించాలన్నారు. అలాగే వ్యవసాయం, రవాణారంగం, విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం.. ఇలా అన్ని రంగాలకూ కేటాయింపులు పెంచుతూ వెళ్లారు. తొలి ప్రణాళికను రూ.1,400 కోట్లతో రూపొందిస్తే, తర్వాతి రెండింటినీ వరుసగా రూ.2,900 కోట్లు, రూ.5,700 కోట్లకు పెంచడం వారి దార్శనికతకు నిదర్శనం.

మొదట్లో దీన్ని అంతర్గతంగానే పంచుకోవాలనుకున్నారు. కానీ ప్రణాళిక కలగజేసిన ఆసక్తి మామూలుగా లేకపోవడంతో కరపత్రం రూపంలో ప్రచురించారు. కొద్ది నెలల్లోనే దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ భాషల్లోకి అనువదించాల్సి వచ్చింది. ప్రణాళికాబద్ధమైన ఆర్థికవ్యవస్థలో ప్రైవేటు రంగానికి చోటు కల్పించేలా ఉన్న దార్శనిక పత్రం విప్లవాత్మక ఆలోచనగా మెప్పు పొందింది. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుందని నాటి వైస్రాయ్‌ లార్డ్‌ వేవెల్‌ అభివర్ణించగా, ఆర్థిక సభ్యుడు జెరెమీ రైస్‌మన్‌ సైతం స్వాగతించారు. 1944 మార్చి నాటికి ఫిక్కీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) తన వార్షిక ప్రణాళికలో దీన్ని ఆమోదించింది. రిజర్వుబ్యాంకు అప్పటి గవర్నర్‌ సి.డి. దేశ్‌ముఖ్‌ దీన్ని చూసే ప్రణాళిక, అభివృద్ధి శాఖను ఏర్పాటు చేయించారు. ఈ ప్రణాళికను ద గ్లాస్గో హెరాల్డ్‌, ద న్యూయార్క్‌ టైమ్స్‌ లాంటి పత్రికలన్నీ తమ పతాక కథనాల్లో ప్రస్తావించాయి.

భావి ప్రణాళికలపై ప్రభావం: వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలన్న బొంబాయి ప్లాన్‌ దార్శనికత స్వతంత్ర భారత దేశంలో మొదటి, రెండో పంచవర్ష ప్రణాళికలపై ప్రభావం చూపింది. పాశ్చాత్యదేశాల పెట్టుబడిదారీ విధానం, సోవియట్‌ రష్యాకు చెందిన సోషలిజం లాంటి అంశాలన్నింటినీ మిళితం చేస్తూ.. తన స్వతంత్ర మార్గాన్ని రూపొందించుకుని భారతదేశం ఒక రాజకీయ అర్థశాస్త్రాన్ని రూపొందించుకోడానికి మూలకారణం బొంబాయి ప్లాన్‌. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను సమతుల్యం చేసుకునేలా భావి ప్రభుత్వాలకు మార్గదర్శనం చేసింది ఈ ప్రణాళికే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.