మన జాతీయ గీతానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా

author img

By

Published : Aug 13, 2022, 3:20 PM IST

NATIONAL ANTHEM composer

AZADI KA AMRIT MAHOTSAV మన జాతీయ గీతం జనగణమనకు సంగీతం సమకూర్చిందెవరో తెలుసా. భారత తోబుట్టువుగా మారిన ఐర్లాండ్​కు చెందిన మానవతావాది మార్గరెట్ కజిన్స్ జనగణమనకు బాణీలు అందించారు. స్వాతంత్ర్య పోరాటంలో భారత్​కు తోడుగా నిలిచి జైలుకు సైతం వెళ్లారు మార్గరెట్.

Margaret cousins jana gana mana: ఏదైనా వినసొంపైన పాట వినగానే.. ఎవరబ్బా మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనేస్తాం! మరి మధురమైన మన జాతీయ గీతం జన గణ మనకు సంగీతం సమకూర్చిందెవరో తెలుసా? ఎక్కడో ఐర్లాండ్‌లో పుట్టి.. విద్యావేత్తగా భారత్‌కు వచ్చి, స్వాతంత్య్ర సమరంలో తోడుగా నిల్చి.. జైలుకెళ్లి.. మన మదనపల్లెలో నివాసం ఏర్పరచుకొని.. భారతావని 'తోబుట్టువు'గా మారిన మానవతావాది.. మార్గరెట్‌ కజిన్స్‌!

national anthem music director: ఐర్లాండ్‌లో 1878 నవంబరు 7న జన్మించిన మార్గరెట్‌ ఎలిజబెత్‌... రాయల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఐర్లాండ్‌ నుంచి సంగీతంలో పట్టా సంపాదించారు. కవి, సాహితీ విమర్శకుడు జేమ్స్‌ కజిన్స్‌తో 1903లో పెళ్లయింది. సామ్యవాదం, శాకాహారం, మహిళల హక్కులు, సమానవత్వం, విద్య... తదితరాంశాలపై వీరిద్దరూ కలసికట్టుగా ఉద్యమించేవారు. మహిళలకు ఓటు హక్కుల కోసం పోరాడుతూ మార్గరెట్‌ అరెస్టు అయ్యారు కూడా. దివ్యజ్ఞాన సమాజం (థియోసాఫికల్‌ సొసైటీ)తో కూడా పరిచయమైంది. ఈ నేపథ్యంలో... అనీబీసెంట్‌ ఆహ్వానం మేరకు 1915లో జేమ్స్‌ కజిన్స్‌ భారత్‌కు వచ్చారు. ఆమె ఆధ్వర్యంలోని న్యూఇండియా పత్రికకు ఆయన పనిచేశారు. తర్వాత మదనపల్లెలోని దివ్యజ్ఞాన సమాజ కాలేజీకి వైస్‌ ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఆయనతోపాటే...మార్గరెట్‌ ఇంగ్లిష్‌ టీచర్‌గా చేరారు.

జేమ్స్‌కు ఆధ్యాత్మిక విప్లవకారుడు అరబిందో ఘోష్‌తో మంచి స్నేహం కుదిరింది. ట్రావెన్‌కోర్‌ మహారాజాకు సాంస్కృతిక సలహాదారుగా కూడా ఆయన వ్యవహరించేవారు. మహాత్మాగాంధీ, సరోజినీనాయుడు,. తదితరులతో కజిన్స్‌ దంపతులకు మంచి మిత్రత్వం ఏర్పడింది. విద్యారంగంలోనే కాకుండా సమాజసేవలోనూ కజిన్స్‌ దంపతులు ఎప్పుడూ ముందుండేవారు. భారత మహిళా సంఘాన్ని స్థాపించి.. స్త్రీధర్మ పత్రికకు మార్గరెట్‌ సంపాదకత్వం వహించారు. మార్గరెట్‌ పోరాటం కారణంగా మద్రాస్‌ రాష్ట్రం దేశంలో తొలిసారిగా మహిళలకు ఓటు హక్కు వచ్చింది. భారత జాతీయోద్యమానికి కూడా ఆమె మద్దతిచ్చారు. దేశీయంగానే కాకుండా విదేశీ వేదికలపైనా ఆంగ్లేయ విధానాలను విమర్శిస్తూ ప్రసంగించారు. ఒక పక్క భారతీయులకు రాజ్యాంగ ఆవశ్యకతను చెబుతూనే, మరోపక్క భారత్‌పై పట్టుబిగించటానికి బ్రిటన్‌ చేస్తున్న కుయత్నాలను ఆమె విమర్శించారు. ఆంగ్లేయ సర్కారు చర్యలను ఖండించినందుకుగాను... 1932లో మార్గరెట్‌ అరెస్టయ్యారు.

నిజానికి కొద్దికాలం కాగానే స్వదేశానికి వెళ్లిపోవాలని వచ్చిన కజిన్స్‌ దంపతులు ఈ గడ్డతో అనుబంధాన్ని పెంచుకొని... భారత ప్రేమికులుగా ఇక్కడే ఉండిపోయారు. జేమ్స్‌ హిందువుగా మారి... జయరాం అని పేరు మార్చుకున్నారు. 1944లో పక్షవాతం కారణంగా మార్గరెట్‌ మంచానికే పరిమితమయ్యారు. మద్రాసు ప్రభుత్వం, జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్థికంగా ఆదుకున్నారు. 1954లో మార్గరెట్‌ మరణించగా... రెండేళ్లకు... మదనపల్లెలోనే జేమ్స్‌ కూడా కన్నుమూశారు. ఆయన కోరిక మేరకు హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరిగాయి.

బాణీ కట్టారిలా
ఐర్లాండ్‌లో ఉన్నప్పుడే ప్రఖ్యాత ఆంగ్ల రచయిత డబ్ల్యు.బి.యేట్స్‌ ద్వారా విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్‌ కవితలు విన్న కజిన్స్‌ దంపతులు... ఇక్కడికి వచ్చాక ఆయనను కలుసుకున్నారు. 1919 ఫిబ్రవరిలో దక్షిణభారత పర్యటనకు వచ్చిన రవీంద్రుడు... కొద్దిరోజుల పాటు మదనపల్లె థియోసాఫికల్‌ కళాశాలలో బస చేశారు. ప్రతి బుధవారం రాత్రి కాలేజీ పిల్లలతో మార్గరెట్‌ సంగీత కచేరీ నిర్వహించేవారు. అందులో రవీంద్రుడు కూడా పాల్గొని తను అప్పటికే రాసిన 'జనగణమన' వినిపించారు. అది విన్న మార్గరెట్‌.. ఈ గీతానికి సరైన బాణీ ఉంటే బాగుంటుందని భావించారు. గీతంలో ప్రతి పదానికి రవీంద్రుడి నుంచి అర్థాలు తెలుసుకొని.. మ్యూజికల్‌ నోట్స్‌ రాసుకున్నారు. తనకున్న సంగీత పరిజ్ఞానంతో బాణీ కట్టి వినిపించారు. ఠాగూర్‌కు అదెంతో నచ్చింది. తర్వాత ఫిబ్రవరి 28న జనగణమనకు ఆంగ్ల అనువాదాన్ని 'మార్నింగ్‌ సాంగ్‌ ఆఫ్‌ ఇండియా'గా రవీంద్రుడు రాశారు. తన సంతకం చేసి మార్గరెట్‌కు దాన్ని ఇచ్చారు.

ఈ అనువాద ఒరిజినల్‌ ప్రతి చాలాకాలం మదనపల్లె కాలేజీలో ఉండేది. కానీ... దాన్ని తర్వాత ఓ అమెరికన్‌ కళాపిపాసికి అమ్మేశారు. ఎంతకు అమ్మారో వెల్లడించలేదు. దీనికి కారణం కూడా ఆంగ్లేయ సర్కారే. అనీబీసెంట్‌ సారథ్యంలో మదనపల్లె కాలేజీ విద్యార్థులు, ఆచార్యులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంటున్నారని... అప్పటి మద్రాసు ప్రభుత్వం నిధులు నిలిపివేసింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడటానికి ఆ ఒరిజినల్‌ ప్రతిని అమ్మేయాల్సి వచ్చింది. 1950 జనవరి 24న జాతీయ గీతంగా ప్రకటించటానికి ముందు... అప్పటి ప్రధాని నెహ్రూ మార్గరెట్‌ రూపొందించిన బాణీని ప్రముఖ సంగీతకారుడు హెర్బర్ట్‌ మురిల్‌కు వినిపించి సలహా కోరారు. మురిల్‌ కాస్త వేగం పెంచి ఓకే చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.